Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలురైతును, భూమిని వేరు చేసే కుట్ర

రైతును, భూమిని వేరు చేసే కుట్ర

- Advertisement -

కార్పొరేట్‌లకు సాగుభూములు కట్టబెట్టే పన్నాగం
పత్తి చేతికివచ్చే దశలో దిగుమతి పన్ను రద్దు చేసిన మోడీ
సరిపడా యూరియా కోసం ఇండెంట్‌ పెట్టని కేంద్రం
అమెరికా జరిమానా.. దేశ సార్వభౌమాధికారానికి మచ్చ
పోరాటాలతో సాగురంగాన్ని పరిరక్షించుకుందాం
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు
‘సుంకాలు-వ్యవసాయ రంగంపై ప్రభావం’పై ఆర్మూర్‌లో సదస్సు


నవతెలంగాణ-నిజామాబాద్‌ప్రాంతీయ ప్రతినిధి
‘ప్రస్తుతం పత్తి పంట చేతికి వచ్చే సమయం. గుజరాత్‌లో ఉన్న బడా కార్పొరేట్‌ పత్తి మిల్లుల లాభాల కోసం ఈ సమయంలో అమెరికా నుంచి పత్తి దిగుమతికి సుంకాలను మోడీ ప్రభుత్వం ఎత్తేసింది. గతంలో 11 శాతం పన్ను విధించగా.. దాన్ని పూర్తిగా ఎత్తివేయడంతో అమెరికా పత్తిని మిల్లులు దిగుమతి చేసుకుంటున్నాయి. మరి ఇక్కడ పండించిన పత్తి ఏం కావాలి..? చెరకు ఫ్యాక్టరీలకు కావాల్సిన ముడిసరుకు మొలాసిస్‌ విదేశాల నుంచి తెప్పిస్తూ బ్రాందీ, విస్కీ తయారు చేసే కంపెనీలకు ఇస్తుండటంతో చెరకు ఫ్యాక్టరీలు మూతపడి రైతులు కుదేలవుతున్నారు. ఇలా రైతును, భూమిని వేరు చేసి భూములను కార్పొరేట్‌లకు అప్పగించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది’ అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘సుంకాలు-వ్యవసాయ రంగంపై ప్రభావం, సహకార వ్యవస్థ పునర్జీవం’ అనే అంశంపై సోమవారం సదస్సు నిర్వహించారు. అంతకు ముందు బస్టాండ్‌ మీదుగా సభాస్థలి వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్‌ పోరాట అమరుడు రామకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేశ్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో పోతినేని మాట్లాడారు. దేశం కొన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించినా.. మిగతావాటి కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నామన్నారు. పత్తి, చెరకు, బియ్యం అధికంగా సాగు చేస్తూ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. కానీ మన దేశ ఎగుమతులపై అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ 50 శాతం సుంకాలు విధించారని అన్నారు. దీనిలో 25 శాతం పన్నుగా, రష్యా నుంచి చమురు తీసుకుంటున్నందుకు మరో 25 శాతం జరిమానా విధిస్తున్నట్టు చెప్పారు. స్వాతంత్య్రం సాధించి సార్వభౌమాధికారం ఉన్న మన దేశానికి ఎలా జరిమానా విధిస్తారని అడిగే ధైర్యం మోడీకి లేకుండా పోయిందని విమర్శించారు.

పంటల దిగుబడులపై పరిశోధనలేవి..?
దేశంలో 33 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతుంటే.. 30 కోట్ల టన్ను విత్తనాలే ఉత్పత్తి అవుతున్నట్టు పోతినేని తెలిపారు. అదే చైనాలో 30 కోట్ల ఎకరాలకు 70 కోట్ల టన్నులు, అమెరికాలో 28 కోట్ల ఎకరాలకు 68 కోట్ల టన్నుల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. పరిశోధనల కోసం చైనా తన దేశ జీడీపీలో 2.70 శాతం నిధులు కేటాయిస్తుండగా.. అమెరికా తన జీడీపీలో 3 శాతం కేటాయిస్తున్నదని, మన దేశంలో 0.63 శాతం కేటాయిస్తున్నారని తెలిపారు. సాగు రంగంలో పరిశోధనల కంటే.. ఆవు పేడ, మూత్రం మీద పరిశోధనలు చేస్తున్నారని గోమాత పరబ్రహ్మం అంటూ ఆవు పాలు లీటర్‌ రూ.60కి కొనుగోలు చేస్తుండగా.. మూత్రం మాత్రం రూ.110కి విక్రయిస్తున్నట్టు ఎద్దేవా చేశారు. అలాగే, రాష్ట్రంలో యూరియా కొరత విపరీతంగా ఉందని తెలిపారు. సరిపడా యూరియా తెప్పించేందుకు ఈసారి కేంద్రం ఇండెంట్‌ సరిపడా పెట్టలేదని దాంతో యూరియా కొరత నెలకొందని అన్నారు. వ్యవసాయాన్ని కాపా డుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. రైతులతోనే వ్యవసాయం చేయించాలని, భూములు వారి చేతుల్లోనే ఉండాలని వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటూ దేశ ఔనత్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

సహకార సంఘాల్లో కార్పొరేట్‌లను జొప్పిస్తున్నారు : మూడ్‌ శోభన్‌
రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ మాట్లాడుతూ.. సహకార సంఘాలను నిర్వీర్యం చేసి అంతిమంగా రైతుల ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నట్టు విమర్శించారు. సొసైటీ సభ్యులను ఏ,బీ కేటగిరీలుగా విభజించి భూములున్న వారిని, భూములు లేని వారిగా విభజిస్తూ కార్పొరేట్‌లను జొప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శించారు. భూములను, తినే తిండిని లాక్కునే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేశ్‌బాబు, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి కొండ గంగాధర్‌, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిడమర్తి సాయిలు, సీఐటీయూ మండల కన్వీనర్‌ కుతాడి ఎల్లయ్య, బొర్ర నాగరాజు, బద్దం నర్సారెడ్డి, భారతి, గంగమ్మ, పోసాని, పద్మ, కుల్‌దీప్‌ శర్మ, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad