Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుభయపెడుతున్న జ్వరాలు

భయపెడుతున్న జ్వరాలు

- Advertisement -

ఆస్పత్రుల్లో పెరుగుతున్న రోగులు
ఆదిలాబాద్‌లో 90 డెంగ్యూ కేసులు
పెరుగుతున్న మలేరియా, వైరల్‌ ఫీవర్స్‌
భారీ వర్షాలతో లోపించిన పారిశుధ్యం
ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది

నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో జ్వరాలు మళ్ళీ విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పారిశుధ్యం లోపించి ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారు. దోమకాటుతో విషజ్వరాలు పెచ్చరిల్లుతున్నాయి. వైరల్‌ ఫీవర్‌ మరోవైపు ప్రజల్ని కుంగదీస్తోంది. మొన్నటి వరదలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఈ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఓపీ, ఇన్‌పేషెంట్లు పెరుగుతున్నారు. ఏటా సీజనల్‌ వ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. కానీ ఈసారి భారీ వర్షాలు, వరదలతో పట్టణాలు, పల్లెలు, తండాలు సహా ముంపునకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాధుల తీవ్రత మరింత పెరిగింది. ఇప్పుడిప్పుడే అధికారులు మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేపడుతున్నారు. వైద్య సిబ్బంది పారిశుధ్యం, దోమకాటు నివారణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇంటింటికీ తిరుగుతూ జాగ్రత్తలు చెబుతున్నారు.
ఎడతెరిపి లేని భారీ వర్షాలతో వాతావరణంలో అనేక మార్పుల వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. సహజంగా జులై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తాయి.
డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్‌ ఫీవర్స్‌, టైఫాయిడ్‌ వ్యాధులు ప్రబలి ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. అయితే గత నెల నుంచి ఈ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమై 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవల్ని విస్తృతం చేశారు. 126 ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా ప్రతి రోజూ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆర్‌బీఎస్‌కే వాహనాలు, పీఎం జన్‌మన్‌ సంచార్‌ వైద్య బృందాలు గ్రామీణంలో తిరుగుతున్నాయి. ఆశావర్కర్లు ఇంటింటికీ తిరిగి, ప్రజల అనారోగ్య రికార్డులు నమోదు చేస్తున్నారు.
ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రెండు సీహెచ్‌సీలు, రిమ్స్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ద్వారా వైద్య సేవల్ని ముమ్మరం చేశారు. ఒక్కో ఆశా కార్యకర్త 25 ఇండ్లను సందర్శించి ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 25 వేల ఇండ్లను సందర్శించి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో రిమ్స్‌, ఉట్నూర్‌, బోథ్‌ మండల కేంద్రాల్లోని ఏరియా ఆస్పత్రుల్లో ప్రతి రోజూ ఇన్‌ పేషెంట్లు, ఔట్‌ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. రిమ్స్‌లో ప్రతి రోజూ ఓపీ వార్డులో 2,500 నుంచి 3 వేల మంది వరకు వైద్య పరీక్షలకు రాగా, 60 నుంచి 80 మందికి వైరల్‌ జ్వరాలు వచ్చినట్టు తేలుతోంది.

రోజూ గ్రామాల్లో పర్యటిస్తున్నాం శ్రీధర్‌, జిల్లా మలేరియా అధికారి
జిల్లాలోని 126 ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలో వైద్య సిబ్బంది ప్రతి రోజూ ఇండ్ల సందర్శన చేపట్టి ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతూ అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. వైద్య సిబ్బంది మారుమూల గ్రామాలను సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఆర్‌బీఎస్‌కే వాహనాల ద్వారా, జన్‌మన్‌ సంచార వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. దోమల నివరాణకు తీసుకోవల్సిన చర్యలను ప్రజలకు వివరిస్తున్నాం.

పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసులు
ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ నెల 7 వరకు 6664 మందికి పరీక్షలు నిర్వహించగా, 90 డెంగ్యూ కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. మలేరియా కేసులు రెండు నమోదయ్యాయి. గతేడాది 9,608 మందికి డెంగ్యూ పరీక్షలు నిర్వహిచగా 366 కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితి కేవలం ఈ జిల్లాకే పరిమితం కాలేదు. వరంగల్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad