ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం
పార్లమెంట్‌లోని రూమ్ ఎఫ్ 101లో ఓటింగ్
సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ
ఆ తర్వాతే ఫలితాలు వెల్లడి
పోలింగ్‌కు బీఆర్‌ఎస్, బీజేడీలు దూరం
తెలుగువ్యక్తి పేరుతో గతంలో వెంకయ్య నాయుడుకి మద్దతు
ఇప్పుడా సెంటిమెంటుకు దూరంగా బీఆర్‌ఎస్, టీడీపీ, వైసీపీలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో రెండో అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ జులై 21న అకస్మాత్తుగా చేసిన రాజీనామాతో ఈ ఎన్నికలు అనివార్యంగా మారిన విషయం విదితమే. దీంతో దాదాపు రెండేండ్ల పదవీకాలంలో మిగిలి ఉండగానే ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. ఈ పదవి కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి, మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ సి.పి రాధాకృష్ణన్, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డిలు బరిలో నిలిచారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్‌హౌస్‌లోని వసుధ రూమ్ నెంబర్ ఎఫ్ 101 లో పొలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.రహస్య బ్యాలెట్ విధానం కింద జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులకు విప్ జారీ చేసే అవకాశం లేదు. సభ్యులు తమ ఇష్టపూర్వకంగా ఓటు వేసుకోవచ్చు. అందుకే ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సభ్యులు ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని కోరుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎన్నికైన వ్యక్తి పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి పూర్తి ఐదేండ్ల పదవీకాలం కొనసాగుతారు.
ప్రతిపక్షాలు, బీజేపీ మాక్ పోలింగ్
ఎన్నికల ప్రక్రియ గురించి తమ సభ్యులకు వివరించేందుకు ఎన్డీఏ, ప్రతిపక్ష పార్టీలు వేర్వేరుగా తమ సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేశాయి. మాక్ పోలింగ్ కూడా నిర్వహించాయి. సోమవారం పార్లమెంట్‌లోని సెంట్రల్‌హాల్‌లో కాంగ్రెస్, సీపీఐ(ఎం), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ), డీఎంకే, టీఎంసీ, ఆర్జేడీ, సీపీఐ, సీపీఐఎంఎల్, జేఎంఎం, శివసేన(యూబీటీ), ఎన్సీపీ, ఆప్ తదితర పార్టీల సభ్యులకు సీనియర్ నేతలు ఎన్నికల ప్రక్రియ గురించి వివరించారు. ఎస్‌పీ సీనియర్ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ సభ్యులందరికి స్వాగతం పలకగా, రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరాం రమేశ్ ఓటింగ్ విధానం గురించి వివరించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ నేత సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్, ఎస్‌పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, సీపీఐ(ఎం) నేతలు జాన్ బ్రిట్టాస్, రాధాకృష్ణన్, అమ్రారామ్, డీఎంకె నేత టి.ఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. కాగా ఏపీ రాష్ట్రమంత్రి నారా లోకేశ్ ఇప్పటికే ఢిల్లీ చేరుకుని టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేయడంపై తమ ఎంపీలకు సూచనలు చేశారు.
మ్యాజిక్ ఫిగర్ 391…
దేశంలో రెండో అత్యున్నతమైన పదవి అయిన ఉపరాష్ట్రపతి స్థానానికి ఎన్నిక జరుగుతోంది. పార్లమెంటులోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కలిపి మొత్తం 788 మంది ఉన్నారు. అందులో రాజ్యసభ నుంచి 245 మంది, లోక్‌సభ నుంచి 543 మంది ఉన్నారు. అలాగే రాజ్యసభకు నామినేట్ అయిన 12 మంది సభ్యులు కూడా ఓటు వేసేందుకు అర్హులే. రాజ్యసభలో ఆరు సీట్లు, లోక్‌సభలో ఒక సీటు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో 781 ఓట్లు ఉన్నాయి. అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థి గెలుపొందాలంటే మ్యాజిక్ ఫిగర్ కనీసం 391 ఓట్లు అవసరం. ఎన్డీఏ అభ్యర్థికి మొత్తం 425 మంది సభ్యుల మద్దతు కనిపిస్తున్నది. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థికి 324 మంది ఎంపీలు మద్దతు ఉన్నది. అలాగే వైసీపీ బయటి నుంచి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తుంది. ఆ పార్టీకి రాజ్యసభ, లోక్‌సభలో 11 మంది సభ్యులున్నారు. ఇక ఇండియా బ్లాక్ సంఖ్యా బలం 311గా ఉన్నది. ఆప్, ఇతర పార్టీల మద్దతు కలిపి మరో 45 మంది కూటమి వెంట నిలబడవచ్చని సమీకరణాలను బట్టి చూస్తే అర్థమవుతున్నది.
నాడు తెలుగువ్యక్తి పేరుతో వెంకయ్యకు మద్దతు… మరి ఇప్పుడెందుకు మౌనం?
ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతి ఎన్నికను సైద్ధాంతిక యుద్ధంగా అభివర్ణించాయి. కాంగ్రెస్, వామపక్షపార్టీలు, ఎంఐఎం, ఎస్‌పీ, డీఎంకే, టీఎంసీ, ఆప్ వంటి ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతిస్తున్నాయి. ప్రతిపక్షపార్టీల అభ్యర్థి తెలుగు వ్యక్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి విషయంలో తెలుగు ప్రాంతాలకు చెందిన పార్టీలు మాత్రం ముఖం చాటేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. తెలంగాణకు చెందిన సుదర్శన్‌రెడ్డికి మద్దతు పలకడానికి బీఆర్‌ఎస్ సైతం నో అంటోంది. తెలంగాణ సెంటిమెంట్‌ను చెప్పుకునే గులాబీ పార్టీ.. ఏకంగా పోలింగ్‌కే దూరంగా ఉంటోంది. ఇరు కూటములకు సమదూరం పాటిస్తోంది. తెలంగాణ ఇంటి పార్టీగా చెప్పుకునే బీఆర్‌ఎస్… తెలంగాణ బిడ్డ బరిలో ఉన్నప్పటికీ ఎన్నిలకు దూరంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రధాన ప్రతిపక్షం వైఖరి కూడా ఇదే విధంగా ఉన్నది. తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పే టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నది. పాలక టీడీపీతో పాటు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ సైతం బీజేపీ నిలిపిన అభ్యర్థికే మద్దతు తెలిపాయి. అయితే ఇవే పార్టీలు 2017లో బీజేపీ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు బరిలో దిగినప్పుడు, తెలుగు వ్యక్తి పేరుతో ఆయనకు మద్దతు తెలి పాయి. మరి ఇప్పుడు తెలుగు వ్యక్తే బరిలో ఉన్నా రు. కానీ ఇప్పుడు ఆ పార్టీలు ఎందుకు తెలుగు రాగం అందుకోవటం లేదు? అనే ప్రశ్నలు వెల్లు వెత్తుతున్నాయి. వెంకయ్యనాయుడు పోటీ చేసిన ప్పుడు ఉన్న సెంటిమెంట్ ఇప్పుడెందుకు లేదనేది బీఆర్‌ఎస్, టీడీపీ, వైసీపీలు చెప్పాల్సిన అవ సరం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బీఆర్‌ఎస్, బీజేడీ దూరం
ఈ ఎన్నికకు బీఆర్‌ఎస్, ఒడిశాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) రెండు ప్రాంతీయ పార్టీలూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఇందులో బీజేడీకి ఉభయ సభల్లో కలిపి ఏడుగురు ఎంపీలు ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు కేవలం నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు. శిరోమణి అకాలీదళ్, జోరమ్ పీపుల్స్ మూమెంట్ (మిజోరం) వంటి పార్టీలకు ఒక్కరు చొప్పున సభ్యులున్నారు. అలాగే ఆప్ నుంచి బహిష్కరణకు గురైన స్వాతి మాలివాల్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆమె ఓటు ఎవరికి వేస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. అలాగే కొంత మంది స్వతంత్రులు కూడా ఉన్నారు. వీరు ఎవరికి ఓటు వేస్తారనేది ఆసక్తిగా మారింది.
ఓటు వేసే విధానం
పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థుల పేర్లతో కూడిన బ్యాలెట్ పత్రాలను ఎంపీలకు అందజేస్తారు. వారు ఎంచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా 1 అనే అంకెను వేయడంతో వారి ప్రాధాన్యత స్పష్టం అవుతుంది. అంకెను అంతర్జాతీయ భారతీయ సంఖ్యల రూపంలో లేదా రోమన్ రూపంలో లేదా ఏదైనా భారతీయ భాషలో ఉపయోగించే రూపంలో వేసుకోవచ్చు. అయితే పదాలను రాయకూడదు.