- మిషన్ భగీరథలో రూ.1300 కోట్లు
- ధర్నాలు, ఆందోళనల్లో చిన్న కాంట్రాక్టర్లు
- బీఆర్‌ఎస్ హయాం నుంచే తిప్పలు
- ఆత్మహత్యలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
‘మూడేండ్లుగా మిషన్ భగీరథలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి…ఒక్కో కాంట్రాక్టర్‌కు రూ. 20 లక్షల నుంచి రూ. కోటి వరకు బకాయిలు రావాల్సి ఉంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులు మంజూరు కావడం లేదు.. వారం లోపు మా బిల్లులు ఇవ్వకపోతే గ్రామాల్లో నీళ్లు బంద్ చేస్తాం’ అని చిన్న కాంట్రాక్టర్లు హెచ్చరిక చేశారు. గత బుధారం హైదరాబాద్‌లోని మిషన్ భగీరథ రాష్ట్ర కార్యాలయం ఎదుట ధర్నా సందర్భంగా వారి స్పందన ఇది.
రాష్ట్ర వ్యాప్తంగా సురక్షిత తాగునీటి సరఫరా కోసం గత ప్రభుత్వం మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టింది. దాదాపు రూ. 38 వేల కోట్లు వ్యయం చేసింది. 26 సెగ్మెంట్లల్లో లక్షలాది మంది దాహార్తిని తీర్చేందుకు చేపట్టిందీ ఈ పథకం. ప్రాజెక్టు ప్రారంభమైంది. ప్రజలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. కానీ, ఆ పథకానికి నిధులు సమకూర్చిన కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇప్పటికీ అందడం లేదు. పెద్ద కాంట్రాక్టర్లకు మినహా మరేవరికి బిల్లులు రావడం లేదంటూ చిన్న కాంట్రాక్టర్లు ఏకంగా ధర్నాకే దిగారు. మూడేండ్లుగా బిల్లుల కోసం ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భగీరథ పైపులైన్లు పగిలాయి. ఇతర సమస్యలు తలెత్తాయి. వీటిని మరమ్మతు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అపరేషన్, నిర్వహణ బిల్లులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. వారం రోజుల్లో బిల్లులు చెల్లించకపోతే గ్రామాల్లో నీటిసరఫరాను ఆపేస్తామంటూ సర్కారుకు అల్టీమేటమ్ ఇచ్చారు. భద్రాచలం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం తదితర జిల్లాల్లో పెండింగ్ బిల్లుల సమస్య ఉంది. ఇందుకోసం గతంలో సూర్యాపేటకు చెందిన ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. మరికొంత మంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి కుటుంబాలు ఆర్ధిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి.
రూ.1300 కోట్లు పెండింగ్
రాష్ట్రంలో ప్రస్తుతం రూ. 1300 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో చిన్న కాంట్రాక్టర్లవి రూ. 250 కోట్లు. అపరేషన్, నిర్వహణకు సంబంధించినవి. రూ.450 కోట్లు. అలాగే మరో రూ. 600 కోట్లు పెద్ద కాంట్రాక్టర్లవి. దశలవారీగా బిల్లులు చెల్లిస్తున్నా అవి కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే ఇస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఎల్‌అండ్‌టీ, ఎన్‌సీసీ, రాఘవ కన్‌స్ట్రక్షన్స్, మెఘా ఇంజినీరింగ్ కంపెనీలకు మాత్రమే బీఆర్‌ఎస్ కాలం నుంచి బిల్లులు ఇస్తున్నారని చిన్న కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పైపులైన్లు వేయడం, నల్లాలు బిగించడం తదితర పనులు చేశారు. ఒక్కో కాంట్రాక్టర్‌కు రూ. 20 లక్షల నుంచి రూ. కోటి వరకు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. బీఆర్‌ఎస్ సర్కారు మాకు అన్యాయం చేసిందనీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం న్యాయం చేయాలని చిన్న కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
సర్కారుకు అల్టీమేటమ్
పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే గ్రామాల్లో నీళ్లు ఆపేస్తామని చిన్న కాంట్రాక్టర్లు సర్కారును హెచ్చరించారు. మిషన్ భగీరథ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో దాదాపు వంద మంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు వినతిపత్రం సైతం ఇచ్చారు. చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించి రూ. 250 కోట్లల్లో రూ. 100 కోట్లు ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.