Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంటార్గెట్‌ -2030

టార్గెట్‌ -2030

- Advertisement -
  • హైదరాబాద్‌ అవసరాలకు అనుగుణంగా తాగునీటి వ్యవస్థ
  • గోదావరి ఫేజ్‌-2,3 పనులకు శ్రీకారం
  • అదనంగా 20 టీఎంసీల గోదావరి జలాలు
  • ఇప్పటికే గోదావరి మొదటి దశ నీరు సరఫరా

    నవతెలంగాణ-సిటీబ్యూరో
    హైదరాబాద్‌ నగర ప్రజలతోపాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) పరిధిలోని శివారు గ్రామాలు, కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీల ప్రజలకు తాగునీటిని అందించేందుకు గోదావరి ఫేజ్‌-2, 3 ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దేశంలోనే వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్‌ ముందుంది. నగరానికి ఉన్న భౌగోళిక, వాతావరణ అనుకూల పరిస్థితుల కారణంగా వేగంగా విస్తరించడంతో పాటు జనాభా పెరుగుతోంది. నగర ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత అవసరాలు తీర్చడంతోపాటు 30 ఏండ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నగరానికి 20 టీఎంసీల అదనపు నీటి సరఫరాకు శ్రీకారం చుట్టింది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా టార్గెట్‌ -2030 లక్ష్యంగా ప్రాజెక్టులకు వాటర్‌ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.

    2047 నాటికి 1114 ఎంజీడీలుగా..
    మూసీ పునరుజ్జీవనం కోసం.. జంట జలాశయాలను గోదావరి నీటితో నింపడానికి రూ.7,360 కోట్లతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్‌-2,3 ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 580 నుంచి 600 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు. 2030 వరకు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 300 ఎంజీడీల అదనపు జలాలను సరఫరాకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో, అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్‌-2,3లకు రూపకల్పన చేసింది. 2027 వరకు హైదరాబాద్‌ నగర తాగునీటి డిమాండ్‌ 835 ఎంజీడీలకు పెరగనుంది. 2047 నాటికి అది 1114 ఎంజీడీలుగా ఉండనుంది.

    ఇప్పటికే 10 టీఎంసీల నీరు తరలింపు
    గోదావరి డ్రికింగ్‌ వాటర్‌ సప్లై పథకం ఫేజ్‌-1 కింద నగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీరు తరలిస్తోంది. తాజాగా పథకంలో రెండు దశల ద్వారా మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి మరో 20 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. ఈ 20 టీఎంసీల్లో 17.5 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు పోగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా, జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 2.5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రెండు లాభాలు న్నాయి. ఒకటి.. హైదరాబాద్‌ ప్రజల దాహార్తి తీర్చడం, రెండోది మూసీ ప్రక్షాళన, జంట జలాశయాల పునరుజ్జీవనం.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad