నవతెలంగాణ – జుక్కల్
నియోజకవర్గంలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాల కారణంగా పలు ప్రాంతాలు, పంటలు నీట మునిగి ప్రజలకు, రైతులకు తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ.. నష్ట పోయిన పంట పొలాల్లో పూర్తి స్థాయి అంచనాలతో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పంట నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం నుండి నష్ట పరిహారం అందించే దిశగా పని చేయాలని అధికారులకు సూచించారు.
వరదల వల్ల పంట పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను తొలగించి రైతులు సాగు చేసుకోవడానికి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు,కల్వర్టులు, చెరువు కట్టలు, కాలువల మరమ్మతులు, పునర్నిర్మాణం కోసం అంచనాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.