నవతెలంగాణ-రాయికల్
పట్టణంలో మౌలిక వసతుల లోపాలు, రోడ్లు, డ్రైనేజీ, చెత్త సేకరణ, వీధి దీపాలు, తాగునీటి సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులు, ప్లాస్టిక్ వాడకం, స్మశాన వాటికలో ఏర్పడుతున్న ఇబ్బందులు… ఇలా పలు సమస్యలపై ప్రజలు తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ అభివృద్ధి కోసం మున్సిపాలిటీ తీసుకుంటున్న చర్యలపై మున్సిపల్ కమిషనర్ టి. మనోహర్ గౌడ్ తో జరిపిన ప్రత్యేక ముఖాముఖి
నవతెలంగాణ: రాయికల్ పట్టణ ప్రజలు తరచుగా రోడ్ల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రోడ్ల మరమ్మత్తులు,కొత్త రహదారుల నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతాయి?
కమిషనర్: 15 కోట్ల ప్రతిపాదనలో వార్డుల వారీగా నివేదిక తయారు చేశాం. ప్రభుత్వం,ఎమ్మెల్యే అనుమతులు రాగానే వార్డులలో మరమ్మత్తులు,కొత్త సిసి రోడ్లు ఏర్పాటు చేస్తాం.
నవతెలంగాణ: వర్షాకాలం వస్తే డ్రైనేజీ సమస్యలు మళ్లీ మళ్లీ ఉత్పన్నమవుతున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం కోసం మున్సిపాలిటీ వద్ద ఏ ప్రణాళిక ఉంది?
కమిషనర్: 15 కోట్ల నిధులలో పట్టణంలో అవసరమైన ప్రాంతాల్లో పెద్ద డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి రహదారులపైకి మురికి నీరు రాకుండా ప్రణాళికలు రూపొందిస్తాం.
నవతెలంగాణ: పట్టణంలో చెత్త సేకరణ, శుభ్రతపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డోర్ టు డోర్ కలెక్షన్‌ను మెరుగుపరచడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు?
కమిషనర్: చెత్త సేకరణకు వాస్తవంగా లేబర్, వాహనాలు, డ్రైవర్లు తక్కువ ఉన్నారు. ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటాం.తిరిగి సమస్య ఉత్పన్నం కాకుండా చూస్తాం.
నవతెలంగాణ: తాగునీరు సరఫరాలో తరచుగా అంతరాయం వస్తోంది.మిషన్ భగీరథ ద్వారా సమయానికి నీరు అందేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కమిషనర్: ప్రస్తుతం రెండు పైపుల ద్వారా మున్సిపాలిటీ నీరు సరఫరా అవుతోంది.వీటిని తొలగించి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సమయానికి నీరు అందేలా కృషి చేస్తాం.
నవతెలంగాణ: వీధి దీపాలు చాలావరకు పనిచేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఆధునిక ఎల్.ఇ.డి లైట్లు ఏర్పాటు చేసే యోచన ఉందా?
కమిషనర్: ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నది వాస్తవం.ఈఈఎస్ఎల్ ద్వారా వీధి దీపాల నిర్వహణకు గతంలో ఒప్పందం చేసుకున్నాం.ఇది అక్టోబర్ 2026 వరకు కొనసాగుతుంది.అయితే వారికి రావలసిన నిధులు అందకపోవడం వల్ల మరమ్మత్తులు,నిర్వహణలో ఆలస్యం అవుతోంది.
నవతెలంగాణ: రాయికల్ పట్టణం వేగంగా విస్తరిస్తోంది. కొత్త కాలనీల్లో మౌలిక వసతులు అందించడానికి మున్సిపాలిటీ ఏ విధమైన ప్రణాళికలు సిద్ధం చేసింది?
కమిషనర్: మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వానికి నివేదిక సమర్పించి అవసరమైన చర్యలు తీసుకుంటాం.
నవతెలంగాణ: శనివారం ట్రాఫిక్ సమస్య,పార్కింగ్ సౌకర్యం పట్టణంలో ప్రధాన సమస్యలుగా మారాయి. వీటికి త్వరితగతిన పరిష్కారం చూపే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా?
కమిషనర్: పోలీస్ శాఖను సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటాం.
నవతెలంగాణ: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విషయంలో మున్సిపాలిటీ ఎంతవరకు కఠినంగా వ్యవహరిస్తోంది?
కమిషనర్: ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం.రానున్న రోజుల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని చోట్ల జరిమానాలు విధించాం.
నవతెలంగాణ: మున్సిపాలిటీకి వచ్చే ప్రజా ఫిర్యాదులను ఎలా పరిష్కరిస్తున్నారు?
కమిషనర్: విచారణ జరిపి పరిష్కరిస్తున్నాం. ప్రజలతో నేరుగా సమావేశమై సమస్యలు విని వెంటనే పరిష్కరించే పద్ధతి అమల్లో ఉంది.
నవతెలంగాణ: సన్మాన వాటికలో అంత్యక్రియల సమయంలో ప్రజలు మౌలిక వసతుల లోపాలపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కమిషనర్: అక్కడ విద్యుత్, నీటి సౌకర్యం ఉంది. డోజర్ తో చెత్తను తొలగించాం.రాబోయే నిధుల ప్రతిపాదనలతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం.
నవతెలంగాణ: రాయికల్ పట్టణ అభివృద్ధికి రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ చేపట్టబోయే ప్రధాన ప్రాజెక్టులు ఏమిటి?
కమిషనర్: ఒక కోటి రూపాయల నిధులతో మత్తడి సమీపంలో ఓపెన్ జిమ్, పార్క్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నాం15 కోట్ల నిధులతో సిసి,డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులు చేపడుతాం. అమృత్ 2.0 కింద ల్యాండ్ అక్విజిషన్ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.