నవతెలంగాణ – కామారెడ్డి
వరద ప్రభావంతో దెబ్బతిన్న పనుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.10 కోట్లతో చేపట్టిన అత్యవసర పనులను నాణ్యతతో వేగంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా అధికారులను ఆదేచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వరద అనంతరం చేపట్టిన పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సంభవించిన అధిక వరద అనంతరం దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసిందని, ఈ నిధుల నుండి ఇప్పటికే రూ.7 కోట్ల 07 లక్షలను ఆర్ అండ్ బి, పంచాయతి రాజ్ జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలలో వరద ప్రభావిత పనుల పునరుద్ధరణ కోసం కేటాయించి పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు.
మిగిలిన రూ.2 కోట్ల 93 లక్షలతో ఇరిగేషన్ ఇతర పనులకు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ నిధులతో చేపట్టిన పనులను నాణ్యతతో వేగంగా చేపట్టాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. అలాగే జిల్లాలో దెబ్బతిన్న 1574 గృహాలలో 1566 ఇళ్లకు నష్టపరిహారంగా రూ.71 లక్షల 95 వేలను అందించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో చనిపోయిన 89 పశువులకు, 870 కోళ్లకు నష్టపరిహారం అందించేందుకు రూ.28 లక్షల 78,000 ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టు తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన సర్వే ద్వారా 17700 ఎకరాల్లో పంట నష్టాన్ని, 108 ఎకరాల్లో ఇసుక మేటలను గుర్తించడం జరిగిందని వెల్లడించారు. ఈ సర్వే ఇంకా కొనసాగుతున్నందున పూర్తిగా సర్వే నిర్వహించి తుది నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నష్టపరిహారం కోసం పంపడం జరుగుతుంది అని తెలిపారు.
దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు అన్ని శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలలో ప్రభుత్వ స్థలాలలో ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వరద బాధితులకు వివిధ స్వచ్ఛంద సంస్థలు అందజేస్తున్న రిలీఫ్ కిట్లను సక్రమంగా పంపిణీ చేసినందుకు ఆర్డీవోలు పరిరక్షించాలని అన్నారు. రానున్న రెండు రోజులు మళ్లీ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్టీవోలు వీణ, పార్థసింహారెడ్డి, సిఈ ఇరిగేషన్ శ్రీనివాస్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అత్యవసర పనులను నాణ్యతతో, వేగంగా పూర్తిచేయాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES