– సొసైటీని సందర్శించిన ఏడీఏ రవి కుమార్
– ఆరోగ్యంగానే ఉన్న రైతు: సొసైటీ అధ్యక్షులు పుల్లా రావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలో మంగళవారం యూరియా కోసం లైన్ లో నిలబడిన ఓ రైతు స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం బచ్చువారిగూడెం పంచాయితీ జెట్టి వారి గూడెం రైతు సింగరాజు ఉదయాన్నే నారాయణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్దకు చేరుకున్నాడు.సిబ్బంది యూరియా పంపిణీ చేస్తుండగానే సింగరాజు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై సొమ్మసిల్లి పడిపోయాడు. పక్కన ఉన్న రైతులు మంచినీళ్లు తాగించి అక్కడే ఉన్న కుర్చి లో కూర్చోబెట్టారు.అయితే రైతు చెవిలో నుండి రక్తము రావడంతో సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించి,ఇంటికి చేర్చారని నారాయణపురం సొసైటీ అధ్యక్షులు నిర్మల పుల్లారావు తెలిపారు.
విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పెంట్యాల రవికుమార్ హుటాహుటిన నారాయణపురం చేరుకుని విచారించారు.రైతు సింగరాజు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. మంగళవారం నాటికి అశ్వారావుపేట సొసైటీలో 200,నారాయణపురం సొసైటీలో 450 బస్తాల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. 5 ఎకరాలు లోపు 2 బస్తాలు,5 పైన ఉన్న రైతులకు అవసరాన్ని బట్టి యూరియా సరఫరా చేస్తున్నామని అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన పడవద్దని భరోసా ఇచ్చారు. ఈయన వెంట ఏవో శివరాం ప్రసాద్, ఏఈఓ షకీరా భాను లు ఉన్నారు.