కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
యంగ్ ఇండియా స్కూళ్లు, ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి రూ.30 వేల కోట్ల వ్యయం
ఈ వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మినహాయించాలి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులు తేవడానికి తాము చేస్తున్న కృషికి అన్ని విధాలుగా సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. విద్యారంగంలో సంస్కరణల కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 30వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతించడంతో పాటు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి నుంచి మినహాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై చేస్తున్న ఈ వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడిక్కడ నార్త్ బ్లాక్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు, గత ప్రభుత్వం అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులకు లోన్ల రీస్ట్రక్చర్, ఇతర ఆర్థిక అంశాలపై చర్చించారు.
రూ.30 వేల కోట్లతో విద్యా రంగ అభివృద్ధి ప్రణాళిక
తెలంగాణలో దాదాపు రూ.30 వేల కోట్లను విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలోని 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించనున్నట్టు చెప్పారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే నాలుగు స్కూళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయని, మిగతా పాఠశాలలకు సంబంధించి టెండర్లు ముగిశాయని అన్నారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యార్థులు ఉంటారని, 2.70 లక్షల మంది విద్యార్థులకు ఈ పాఠశాలల్లో చదువుకునే అవకాశం లభిస్తుందని వివరించారు. అత్యాధునిక వసతులు, ల్యాబ్‌లు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు.
గత ప్రభుత్వ అప్పులను రీస్ట్రక్చర్ చేయండి
గత ప్రభుత్వం ఇష్టారీతిగా అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. ఆ వడ్డీల చెల్లింపులతో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర భారం పడుతోందని తెలిపారు. అందువల్ల వాటిరీస్ట్రక్చరింగ్‌కు అనుమతించాలని కోరారు. కాగా… తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
కాళోజీకి ఘన నివాళి
ప్రజా కవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. తన అధికారిక నివాసంలో కాళోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఉభయ సభ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల, రఘురామ సహాయం, సురేష్ షట్కర్, కడియం కావ్య, రేణుకా చౌదరి, అభిషేక్ మను సింఘ్వీ, అనిల్ కుమార్‌లు పాల్గొన్నారు. అనంతరం సీఎం ఎంపీలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా బ్లాక్ తరపున ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని దిశా నిర్దేశం చేశారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి, ఇతర అంశాలపై సమాలోచనలు చేశారు. అనంతరం పార్లమెంట్‌కు వెళ్లారు. ఈ సందర్బంగా కాసేపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలతో ముచ్చటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్‌లో స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకం గా కలిశారు.రాజకీయాలకతీతంగా పలు అంశాలపై స్పీకర్‌తో చర్చించారు.