11న రాష్ట్రవ్యాప్త ధర్నాలు : పోస్టర్ ఆవిష్కరణలో టి.సాగర్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడినంత యూరియాను సరఫరా చేయాలని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి. సాగర్ డిమాండ్ చేశారు. అందుకు కారణమైన కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో అందుకు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి, అరిబండి ప్రసాద్‌రావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెల రోజులుగా యూరియా కోసం రైతులు పడిిగాపులు కాస్తున్నారని తెలిపారు. అనేక జిల్లాల్లో సహకార సంఘాలు, డీలర్ షాపుల దగ్గర రైతులు బారులు తీరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సకాలంలో ఎరువులు వేయకపోతే దిగుబడి తగ్గే అవకాశముందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక మంది డీలర్లు 45 కిలోల బస్తాకు రూ. 242 తీసుకోవాల్సి ఉండగా, అదనంగా వసూలు చేస్తున్నారని విమర్శించారు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన కోటా ప్రకారం యూరియా, ఎరువులను సరఫరా చేయలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రసాయన ఎరువులను తగ్గించడం, క్రమంగా సబ్సిడీకి కోత విధిస్తున్నదని విమర్శించారు. నానో యూరియాను రైతులకు బలవంతంగా అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన యూరియాను కూడా సరైన ఇండెంట్ పెట్టడం లేదని విమర్శించారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే యూరియా, ఎరువులను అందుబాటులో లేకుండా చేస్తున్నదని విమర్శించారు. ఇదే వైఖరి కొనసాగిస్తే గతంలో శ్రీలంకలో వచ్చిన మాదిరిగా మనదేశంలోనూ ఆహార సంక్షోభం వచ్చే పరిస్థితులు వస్తాయన్నారు. పంటల దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి కేటాయించిన యూరియాను ప్రణాళిక బద్ధంగా పంపిణీ చేయడంలో కూడా విఫలమైందని విమర్శించారు.