Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeజాతీయం'ఉపాధి' కోసం పోరాటాలు ఉధృతం

‘ఉపాధి’ కోసం పోరాటాలు ఉధృతం

- Advertisement -

కార్పొరేట్లు, ధనికులపై పన్నులు వేయాలి
గ్రామీణ నిరుద్యోగానికి భూ పంపిణీతో చెక్‌ : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాల్లో కె.విజయరాఘవన్‌

కడప : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం బలోపేతం కోసం ఉధృత పోరాటాలు నిర్వహించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కె.విజయ రాఘవన్‌ పిలుపునిచ్చారు. కడప జిల్లాలో మూడ్రోజులపాటు జరగనున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాల్లో రెండో రోజైన మంగళవారం హరిత హోటల్‌ ప్రాంగణంలో సంఘం జెండాను ఆవిష్కరించారు. మృతవీరుల స్ధూపానికి నివాళులర్పించారు. అనంతరం సమావేశ మందిరంలో సీపీఐ(ఎం) అగ్రనేతలు పుచ్చలపల్లి సుందరయ్య, వీఎస్‌.అచ్యుతానందన్‌, సీతారాం ఏచూరి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించి దేశంలో అమరులైన ప్రజాసంఘాల నాయకులకు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఆ తర్వాత జాతీయ సమావేశాలను ఉద్దేశించి విజయరాఘవన్‌ మాట్లాడుతూ ఏపీలో భూసేకరణ, భూసమీకరణ పేరుతో రైతులకు నష్టం చేస్తూ చంద్రబాబు లబ్ధిపొందుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ నగరంలోనూ రింగు రోడ్ల ఏర్పాట్ల పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగానే చేస్తున్నారని అన్నారు. దేశంలో వ్యవసాయాభివృద్ధి తిరోగమనంలో ఉందని తెలిపారు. భూమిలేని పేదలు ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున వలసలు వెళ్తున్నారన్నారు. వలసల వల్ల పేదల జీవన ప్రమాణాలకు ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను కేంద్రంలోని బిజెపి అమలు చేస్తుండడంతో మైనార్టీల్లో అభద్ర ఏర్పడిందన్నారు. హిందుత్వ విధానాలు కుల, మతాల మధ్య విభజన తెస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ కార్మికులు, కలిసివచ్చే ఇతర సంస్థలను, సంఘాలను కలుపుకుని ఉధృత పోరాటాలు నిర్వహించాలన్నారు. బిజెపి వివక్షాపూరిత విధానాలు రాజ్యాంగ వ్యతిరేకమని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ అజెండాను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు.

పేదరిక నిర్మూలనకు భూ పంపిణీయే దివ్యౌషధం : మాది త్రిబులింజన్‌ : బి వెంకట్‌

అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు భూ పంపిణీయే దివ్యౌషధమని తెలిపారు. దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మహిళల శ్రమ కారణంగా సంపద వృద్ధి అవుతోందన్నారు. కానీ, వారికి దక్కాల్సిన వాటా దక్కడం లేదని వివరించారు. కార్పొరేట్లుకు, అత్యంత ధనికులకు మాత్రమే లబ్ధి చేకూరుతోందన్నారు. పి-4 పథకం పేరుతో పేదలను ధనికులకు దత్తత ఇవ్వడం వెనుక పేదల వనరులను దోచుకునే కుట్రకోణం ఉందని వివరించారు. ఇటువంటి విధానం వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదన్నారు. కార్పొరేట్లు, ధనికులపై పన్నులు వేయడం ద్వారా సమకూరే నిధులను సమర్థవంతంగా పేదల అభ్యున్నతికి మళ్లిస్తే పేదరికం మాయమవుతుందని తెలిపారు. దేశంలోని 40 కోట్ల ఎకరాల్లో 12 కోట్ల ఎకరాలు ధనికుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. ఈ భూములను వ్యవసాయ కార్మికులకు, పేదలకు పంపిణీ చేస్తే గ్రామీణ నిరుద్యోగాన్ని రూపుమాపవచ్చని తెలిపారు. పేదల కొనుగోలు శక్తి పెరగడానికి భూ పంపిణీ చేయడమే సరైన మార్గమని, ఇటువంటి అంశాలపై కౌన్సిల్‌ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మీది కార్పొరేట్లు, మతోన్మాదంతో కూడిన డబులింజన్‌ అయితే, మాది వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికులతో కూడిన త్రి బులింజన్‌ అని పేర్కొన్నారు. ఎపిలో రాజ్యాంగ పరిరక్షణ సంస్థలు ఏర్పడడం సంతోషకరమన్నారు.

రాష్ట్రంలో ఆరు సమస్యపై పోరాటం : దడాల సుబ్బారావు
కార్యదర్శి నివేదిక అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధుల చర్చల సారాంశాన్ని ఈ సమావేశంలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు వివరించారు. రాష్ట్రంలో ప్రధానంగా ఆరు సమస్యలపై సంఘం పనిచేసిందన్నారు. 14 జిల్లాల్లో 1,504 కేంద్రాల్లో 4,940 ఎకరాలకు సంబంధించి భూపోరాటాలు చేశామని, నాలుగు వేల ఎకరాల్లో సంఘం ఆధ్వర్యంలో జెండాలను పాతామని తెలిపారు. శ్రీసత్యసాయి, కడప, ఏలూరు, నెల్లూరు, విశాఖ, పార్వతీపురం, తిరుపతి జిల్లాల్లో ఈ పోరాటాలు జరిగాయని వివరించారు. ఇళ్ల స్థలాలు, భూనిర్వాసితుల సమస్యలపైనా పోరాడామన్నారు. విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించామని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ సమస్యలపైనా, స్థానిక సమస్యలపైనా పోరాడామని వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘాల జాతీయ నాయకులు విక్రమ్‌సింగ్‌, అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి విజ్జూకృష్ణన్‌, మహిళా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కన్వీనర్‌ లలితాబాలన్‌, కేరళ వ్యవసాయ కార్మిక సంక్షేమ సంఘం బోర్డు చైర్మెన్‌ చంద్రన్‌, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, మహిళా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్‌ శివ నాగరాణి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జి.చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి మనోహర్‌, కార్యదర్శి రామ్మోహన్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.శివకుమార్‌, వి.అన్వేష్‌, దేశంలోని 22 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad