Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఎస్‌ఎల్బీసీ పనులకు సవాలెన్నో..

ఎస్‌ఎల్బీసీ పనులకు సవాలెన్నో..

- Advertisement -

టీబీఎం టెక్నాలజీనే కీలకం
గడువులోగా పూర్తయ్యేనా !?
కొత్తగా అధికారుల నియామకం

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులు ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సవాల్‌గా నిలిచాయి. 2027 నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం సంకల్పిస్తున్న తరుణంలో అనేక సమస్యలు, సవాళ్లు ముందుకొస్తున్నాయి. ఉద్దేశం మంచిదే అయినా భౌతిక పరిస్థితులు, సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా వీటిని పరిష్కరించుకోవడం ద్వారా ముందుకు పోవాల్సి ఉంది. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు సైతం ప్రాజెక్టును నిలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమయ్యే ప్రమాదమూ ఉంది.

సాంకేతిక సవాళ్లు
ఇప్పటికే సాంకేతికంగా అనేక సవాళ్లు ఎదురవుతుండగా, కొత్తగా కాంట్రాక్టు సంస్థపైనా అనేక సందేహాలు ప్రచారంలో ఉన్నాయి. పనులను చేపట్టిన జయప్రకాశ్‌ అసోసియేట్స్‌(జేపీ)కంపెనీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందంటూ జలసౌధలో అధికారులే అంటున్నారు. దీంతో పనుల్లో జాప్యం జరిగిందని అంటున్నారు. అలాగే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు ప్రశ్నార్ధకంగా మారాయి. అసలు ఎస్‌ఎల్‌బీసీ పనుల కొనసాగింపు సాధ్యమా ? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ 44 కి.మీ. పొడవు. దానిని రెండు వైపులా నుంచి టీబీఎం టెక్నాలజీతో చేపట్టేందుకు జయప్రకాష్‌ అసోసియేట్‌ కంపెనీ తొలుత పనులను సొంతం చేసుకుంది. టీబీఎం సాంకేతికతతో పనులు చేసిన అనుభవం, జేపీ అసోసియేట్స్‌కు లేదని సమాచారం. ఈ తరుణంలో అమెరికాకు చెందిన రాబిన్సన్స్‌ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. మొదట్లో పనులు సజావుగా కొనసాగాయి. టీబీఎంలు కొత్తవి కావడం, కంపెనీ సైతం లాభాల్లో ఉండటంతో టన్నెల్‌ పనులు వేగంగా చేపట్టింది.

యంత్ర పరికరాలు
టీబీఎం విడిభాగాలను తెప్పించడంలో పూర్తిగా తాత్సారం చేస్తూ, పూటకో మాట చెబుతూ కంపెనీ పనులు ఆలస్యం చేస్తున్నట్టు అంటున్నారు. ఇన్లెట్‌ టన్నెల్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యల గురించి ఇటీవల ప్రమాదం జరిగేవరకు రాబిన్సన్‌ కంపెనీ దష్టికి జేపీ అసోసియేట్స్‌ తీసుకుపోలేదని సమాచారం. జేపీ కంపెనీ టీబీఎం యంత్ర విడిభాగాలను కూడా నాణ్యమైనవి తెప్పించకపోవడం, ద్వితీయ శ్రేణి, నాసిరకం విడిభాగాలను దిగుమతి చేసుకున్నదనీ, అందువల్లే పదే పదే మరమ్మతులకు గురవుతున్నదని తేలింది. ప్రస్తుతం 8.6 కి.మీ. టన్నెల్‌ ఇంకా తవ్వాల్సి ఉన్నది.

కొత్త నియామకాలు
టన్నెల్‌ తవ్వేందుకు ఇరిగేషన్‌తోపాటు ఆర్మీ అధికారుల సహకారం తీసుకుంటున్నారు. ఇందుకోసం మిలిటరీలో టన్నెల్స్‌ ఈఎన్సీగా పనిచేసిన లెఫ్టినెంట్‌ జనరల్‌ హర్పాల్‌సింగ్‌ను సలహాదారుగా నియమించారు. స్థానికంగా ఉన్న మిలిటరీ అపరేషన్స్‌ చేసే అధికారులు ఇందుకు సహకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హర్పాల్‌ సింగ్‌ సైతం విధుల్లో చేరారు.

నిపుణుల హెచ్చరికలు
ప్రమాదం వాటిల్లిన ఇన్లెట్‌ వైపు నున్న టీబీఎం పూర్తిగా ధ్వంసమైంది. సొరంగంలో ప్రమాదస్థలం అత్యంత దుర్లభమైన, సున్నితమైన ప్రాంతమనీ, ఈ నేపథ్యంలో 50 మీటర్ల మేర పేరుకుపోయిన శిథిలాలను, మట్టి, రాళ్లను ఒకేసారి, ఒకేవైపు నుంచి కాకుండా దఫదఫాలుగా, ఇరువైపుల నుంచి కొద్దికొద్దిగా తొలగిస్తూ ముందుకు పోవాల్సి ఉంటుందని సబ్‌ కమిటీ స్పష్టం చేసింది. టీబీఎం పద్ధతిలో సొరంగం పనులను నిర్వహించడం ఆసాధ్యమనీ, డ్రీల్లింగ్‌, బ్లాస్టింగ్‌ టెక్నాలజీ ఒక్కటే శరణ్యమనీ, అందుకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచించారు.

సమస్యలు
తాజా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో అత్యంత క్లిష్టతరమైన సమస్యలు ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి దాదాపు 400 మీటర్ల దిగువ నుంచి సొరంగం పనులను చేపట్టాల్సి ఉన్నది. టన్నెల్లో భారీగా నీటిఊట రావడం, షీర్‌ జోన్లు (పగుళ్లు పట్టిన రాతిపోరలు) తదితర అనేక క్లిష్టమైన సాంకేతిక సమస్యలు పనులకు సవాళ్లు విసురుతున్నాయి. అత్యంత క్లిష్టమైన ఈ సొరంగం పనులను తొందరగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటన్నింటికి తోడు ఆర్థికపరమైన ఇబ్బందులు సైతం సొరంగం పనులకు బ్రేక్‌వేసే అవకాశాలు ఉన్నాయి. సమీక్షల మీద సమీక్షలు జరుగుతున్నాయి. అయితే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒక్క రోజు కూడా పనులు ఆలస్యం కావొద్దని ఆదేశించడం గమనార్హం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad