అరిస్తే అబద్ధం నిజం కాదు : మాజీ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి నోరువిప్పితే అబద్ధలాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు వింటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుకోవాలంటూ గతంలో సీబ్ల్యూసీ మల్లన్నసాగర్ డీపీఆర్‌ను తిరస్కరించిందని గుర్తుచేశారు. సాగునీటి అవసరాల కోసం కేసీఆర్ 50 టీఎంసీల మల్లన్నసాగర్ నిర్మిస్తే, అది నిర్మించొద్దని రేవంత్ రెడ్డి 48 గంటల దీక్ష చేశారని గుర్తుచేశారు. దాని నిర్మాణానికి ప్రజల సమ్మతి తీసుకున్నామని తెలిపారు. మూసీలో మాత్రం 300 ఇళ్లను కూలగొట్టిన రేవంత్ రెడ్డి వారికి కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్ రూంలు ఇచ్చి నగదు సాయం చేయలేదని విమర్శించారు. మల్లన్నసాగర్‌లో ఇళ్లు కోల్పోయిన వారికి 250 గజాలతో సొంత ఇంటిని నిర్మించి ఇచ్చామనీ, రూ.2.5 లక్షల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఇచ్చినట్టు తెలిపారు. మూసీ నిర్వాసితులకు 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌లో మంచినీటి కోసం రూ.7 వేల కోట్లను ఖర్చు చేసినట్టు తెలిపారు. 2008లో కాంగ్రెస్ ప్రారంభించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏడేళ్లయినా పూర్తి కాకుంటే, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో పూర్తి చేసినట్టు తెలిపారు. కృష్ణా ఫేజ్ 4 పనులను కూడా పూర్తి చేసి ఆ నీళ్లను కూడా హైదరాబాద్ తెచ్చింది కేసీఆర్ అని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.1,600 కోట్లు ఖర్చు చేసి 56 రిజర్వాయర్లు, 2,600 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి,. ఓఆర్‌ఆర్ ఫేస్ వన్, ఫేస్ టూలో రూ. 2,000 కోట్లు ఖర్చు చేసి ఓహెచ్‌ఎస్‌ఆర్ పైపులైన్లు వేసినట్టు తెలిపారు. కేసీఆర్ కాళేశ్వరంతో పాటు 50 టీఎంసీలతో మల్లన్నసాగర్ నిర్మించినందువల్లే రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు నీళ్లు తేగలుగుతున్నారని హరీశ్ రావు తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్లకు అగ్రిమెంట్ ఉంటే, గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చి చూపించాలని హరీశ్ రావు సవాల్ విసిరారు. 148 మీటర్ల వద్ద బ్యారేజీ కడితే కేవలం 50 టీఎంసీల కంటే మనం ఎక్కువ తీసుకోలేమని హరీశ్‌రావు తెలిపారు.
రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES