Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపైసల కోసం పేదోడిపై శిరోభారం

పైసల కోసం పేదోడిపై శిరోభారం

- Advertisement -

ఇంటి పన్ను నెంబర్లతో విద్యుత్‌ నెంబర్ల అనుసంధానం
ప్రభుత్వ తాజా నిర్ణయంతో గందరగోళ పరిస్థితి
ప్రజావ్యతిరేకతతో గత ప్రభుత్వాల వెనుకంజ

ఖజానా పెంచుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ఇంటి పన్ను నెంబర్లతో విద్యుత్‌ నెంబర్ల అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రజల్లో గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తోంది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానాన్ని అమలు చేయాలని అప్పటి ప్రభుత్వం భావించినప్పటికీ ప్రజా వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సైతం ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ పేర్లతో డేటాను సేకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆ దిశగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ సిద్ధమవుతోంది.

నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం వద్ద నిధుల్లేవ్‌. అనుకున్నంత మేరకు ఖజానా లేకపోవడంతో ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టిన సర్కార్‌ ఉన్నోడి జోలికి పోకుండా, పేద, మధ్య తరగతి వర్గాలను టార్గెట్‌ చేసింది. ఆస్తి పన్ను నెంబర్‌ను, విద్యుత్‌ కనెక్షన్‌ నెంబర్‌తో అనుసంధానించాలని నిర్ణయించింది.
హైదరాబాద్‌ నగరంలో 100 గజాల లోపు స్థలంలో రెక్కల కష్టంతో ఇండ్లు నిర్మించుకున్న బడుగుజీవి ఈ నిర్ణయంతో కుదేలవుతాడు. అప్పు చేసో లేక లోన్లు తీసుకుని ఎంతో కష్టపడి మొదట చిన్న ఇల్లు నిర్మించుకుని ఆ తర్వాత కొద్దికొద్దిగా పొదుపు చేసుకుని పై అంతస్తు కట్టుకుంటే దీనివల్ల అదనపు నిర్మాణంగా బయట పడనుంది. ఫలితంగా పన్నులు 100శాతం పెనాల్టీతో పడనున్నాయి. ఇది చెల్లించలేక నిరుపేదలు ఉన్న గూడును కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చే ప్రమాదముందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీల్లో అమలు చేసే అవకాశముందని పలువురు అంటున్నారు.

పెరగనున్న జీహెచ్‌ఎంసీ ఆదాయం
నూతన విధానం ద్వారా ఆస్తి పన్ను ఆదాయాన్ని పెంచుకోవడానికి జీహెచ్‌ఎంసీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రయివేటు కంపెనీల సాంకేతిక సహకారం తీసుకోనుంది. జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్యలు (పీటీఐఎన్‌లు), విద్యుత్‌ సేవా కనెక్షన్లతో (యూఎస్‌సీలు) అనుసంధానం చేస్తారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ మార్గదర్శం మేరకు ఈ ప్రాజెక్టు బహుళ దశల్లో అమలు చేస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 96,938 నివాస ‘పీటీఐఎన్‌’ నివాసేతర యూఎస్‌సీలతో అనుసంధానం చేశారు. మొదటి దశలో ఎల్‌.బి.నగర్‌ జోన్‌ పరిధిలో 9,761, చార్మినార్‌ జోన్‌ పరిధిలో 26,056, ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలో 22,514, సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో 22,005, కూకట్‌పల్లి జోన్‌ పరిధిలో 7,260, శేర్‌లింగంపల్లి జోన్‌ పరిధిలో 9,342 గుర్తించారు. ఇక రెండో దశలో 22,169 రికార్డులు డోర్‌ నంబర్‌, పేరు ఆధారంగా తయారు చేశారు. ఇందులో కొన్ని సందర్భాల్లో నివాస పీటీఐఎన్‌లు నివాసేతర ఎఎస్‌లతో డేటాను కలెక్ట్‌ చేశారు.

జవాబుదారీతనాన్ని తీసుకురావడంలో.. అదనపు కమిషనర్‌ అనురాగ్‌ జయంతి
ఈ క్రమబద్ధమైన డేటా అనుసంధానాన్ని జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను వసూళ్లను బలోపేతం చేయడమే కాకుండా, ఆదాయ లీకేజీలను అరికట్టి, ఆస్తి వినియోగం, విద్యుత్‌ కనెక్షన్ల మధ్య మరింత జవాబుదారీతనాన్ని తీసుకురావడంలో దోహదం చేస్తుంది. కార్పొరేషన్‌ ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించనుంది. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ (ఐటీ అండ్‌ రెవెన్యూ) పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad