ప్రత్యామ్నాయ ఏర్పాటు ..
నవతెలంగాణ – నసురుల్లాబాద్
బిందెడు నీటి కోసం మహిళలు, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీటి కోసం ఎక్కడో దూరాన ఉన్న పంట పొలాల బాటపడుతున్నారు. దాహర్తీ తీర్చండి సారో అని విన్నవించుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో గ్రామస్తులు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. మిర్జాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో 2వ వార్డు, 3వ వార్డు, 6వ వార్డులో బుధవారం ఉదయం ప్రజలు కాలి బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
నెల రోజుల నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా సైతం నిలిచిపోయింది. దాంతో గ్రామస్తులు తాగునీటి కోసం ఇక్కట్లు పడుతున్నారు. వర్షాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే మండు వేసవిలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాగునీటి కోసం గ్రామ మహిళలు, ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలుపడమే దీనికి నిదర్శనం. పంచాయతీ కార్యదర్శి రవి ని వివరణ కోరగా సింగిల్ మోటార్ చెడిపోవడంతో కొన్ని ఇండ్లకు మాత్రమే కొద్దిపాటి నీరు సరఫరా అవుతుంది. కొన్ని ఇండ్లకు మిషన్ భగీరథ నీళ్లు రాక ఇబ్బందులు పడడం వాస్తవమేనని, తాగునీటి ఎద్దడి నివారణకు ఇతర బోర్ మోటార్ నుంచి తాగునీరు అందిస్తున్నాం అన్నారు. పూర్తి స్థాయిలో రెండు రోజుల్లో పైపులైన్ పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు చేపట్టి తాగునీటి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.
ప్రత్యేకాధికారులు పట్టించుకోవడం లేదు..
గ్రామంలో ప్రత్యేకాధికారుల పాలన వచ్చినప్పటి నుంచి గ్రామంలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కరువైంది. తాగునీటితో పాటు పారిశుధ్య పనులు పట్టించుకోవటం లేదు. గ్రామానికి పుష్కలంగా నీరు అందించే బోరు ఉన్నా పైపులైన్ మరమ్మతులు చేపట్టడంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిరక్ష్యం వహిస్తున్నారు. గ్రామ సమస్యలను తెలుసుకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.