బ్యాంక్ మోసంలో కొత్త కేసు నమోదు
ముంబయి: రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో షాక్ ఇచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ను రూ.2,929.05 కోట్లకు మోసం చేసిన రుణ కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) డైరెక్టర్‌గా ఉన్న అనిల్ అంబానీపై ఈడీ కొత్త కేసు నమోదు చేసింది. అనిల్ అంబానీతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు, ఇతరుల పైనా కేసు నమోదయ్యిందని తెలుస్తోంది. గత నెలలో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఎస్‌బిఐ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పలు బ్యాంకులకు అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కామ్ రూ.40 వేల కోట్లకు పైగా రుణాలు బకాయిలుపడింది. 2018 నాటి గణాంకాల ప్రకారం ఒక్క ఎస్బీఐనే రూ.2929 కోట్ల మేర నష్టపోయింది. ఆర్‌కామ్ అనుకూలంగా రుణాలు పొందేందుకు ఎస్బీఐను తప్పుదోవ పట్టించారు. ఈ నేరపూరిత కుట్రలో కంపెనీ డైరెక్టర్లు సహా పలువురు అధికారులు పాలుపంచుకున్నారని ఈడీ నిర్ధారణకు వచ్చింది. బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభించగా.. సీబీఐ కూడా సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు అంశంలో ఆగస్టులో అనిల్ అంబానీని ఈడీ 10 గంటల పాటు ప్రశ్నించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. నష్టాల్లో చిక్కుకున్న టెలికాం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తీసుకున్న రుణాన్ని కొన్ని నెలల క్రితం మోసపూరిత చర్య అని ఎస్బీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ఒక బ్యాంకు, ఒక ఖాతాను మోసపూరితమైందని గుర్తించిన తర్వాత ఆ విషయాన్ని 21 రోజుల్లోగా ఆర్బీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కేసును సీబీఐ, పోలీసులకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎస్బీఐ ఫిర్యాదు మేరకు సీబీఐ, ఈడీ కేసు నమోదు చేసింది.
అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్
- Advertisement -
- Advertisement -