ఎంజీఎం, రిమ్స్‌లో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు
ఆర్గాన్ డోనర్ల కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు
కార్పొరేట్ ఆస్పత్రులపై నిరంతర నిఘా
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి సర్జరీలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు జీవన్‌దాన్ పనితీరు, ప్రభుత్వ దవాఖానాల్లో అవయవ మార్పిడి చికిత్సలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జూబ్లిహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిమ్స్, గాంధీ, ఉస్మానియాతో పాటు ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎంలోనూ అవయవమార్పిడి సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. సీనియర్ డాక్టర్లతో డెడికేటెడ్ టీమ్స్ ఏర్పాటు చేయాలనీ, ఒక్కో ఆర్గాన్‌కు ఒక్కో టీమ్ ఉండాలని హెల్త్ సెక్రెటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తుకు మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవమార్పిడి సర్జరీలను ప్రోత్సహించే విధంగా ఈ బృందాలు పని చేయాలన్నారు.
ఇటీవల కేంద్ర చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నందున ఇందుకు అనుగుణంగా కొత్త నిబంధనల రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. ఈ చట్టం ప్రకారం సొంత కుటుంబ సభ్యులతో పాటు, గ్రాండ్ పేరెంట్స్ కూడా అవయవాలు డొనేట్ చేసేందుకు, స్వీకరించేందుకు అర్హులేనని ఈ నిబంధనను అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. తోట యాక్ట్ ప్రకారం ఆర్గాన్ స్వాపింగ్‌కు కూడా అవకాశం ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ యాక్ట్ ప్రకారం ఇరువురు పేషెంట్ల కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఆర్గాన్స్ డొనేట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. స్వాపింగ్ విషయంలో ఇతర రాష్ట్రాలు అవలంభిస్తున్న నిబంధనలను పరిశీలించి, బాధితులను ఆదుకునే విధంగా నిబంధనలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జీవన్‌దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ భూషన్‌రాజుకు మంత్రి సూచించారు. దీని కోసం ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల సహకారం తీసుకోవాలన్నారు. ఆర్గాన్ డోనర్ల కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. బ్రెయిన్ డెత్ అయిన వారి అవయవాలను ఇతరులకు డొనేట్ చేసి ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబాలను అందరూ అభినందించాలన్నారు. ఆర్గాన్ డోనర్ల దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రయివేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో జరుగుతున్న అవయవమార్పిడి సర్జరీలపై నిరంతరం నిఘా పెట్టాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే హాస్పిటళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు.
ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES