Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరాజీనామా ఇవ్వను..

రాజీనామా ఇవ్వను..

- Advertisement -

కిషన్‌రెడ్డి చేస్తే నేను చేస్తా
అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం
ఈ కమిటీతో బీజేపీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా : గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను. ఏం పీక్కుంటారో పీక్కోండి’ అంటూ బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలనీ, ఆయన చేస్తే తాను చేస్తానని సవాల్‌ విసిరారు. తిరిగి పోటీ చేస్తే ఎవరు గెలుస్తారో చూద్దామన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీలో ఉన్నా, లేకున్నా కార్యకర్తల గొంతుగా మాత్రమే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. తనను టార్గెట్‌ చేస్తూ ప్రెస్‌మీట్లు పెట్టిస్తే భయపడబోనని హెచ్చరించారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారి కోసమే తాను ప్రశ్నిస్తున్నానని స్పష్టం చేశారు. నూతన రాష్ట్ర కమిటీలో దాదాపు 10 నుంచి 12 మంది సికింద్రాబాద్‌ పార్లమెంట్‌కు చెందిన వారే ఉన్నారని విమర్శించారు. కమిటీలో జిల్లా నాయకులకు స్థానం లేదా? అని ప్రశ్నించారు.

ఇది రాంచందర్‌ రావు వేసిన కమిటీయా? కిషన్‌ రెడ్డి వేసిన కమిటీయా? ఈ కమిటీతో తెలంగాణలో అధికారం సాధ్యమేనా? అని ఎద్దేవా చేశారు. ఆ కమిటీతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు. బీజేపీని డమ్మీ చేయడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కొత్త కమిటీపై ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతృప్తిగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రాంచందర్‌ రావు చాలా మంచి మనిషి అనీ, ఆయన్ను పార్టీలో రబ్బరుస్టాంపుగా మార్చారని ఆరోపించారు. తనపై ఒక మహిళతో విమర్శలు చేయించారనీ, ఆమెపై విమర్శలు చేస్తే బాగుండదనే గౌరవంతో ఆగానని చెప్పారు. తాజాగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వేముల అశోక్‌ బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు కల్పిస్తానని మాయమాటలు చెప్పి ఎంతో మంది వద్ద డబ్బులు దన్నుకున్నారని ఆరోపించారు.

రాంచందర్‌ రావు ఇంటి ఎదుట భార్యాభర్తలిద్దరూ పదవి కోసం పెట్రోల్‌ పోసుకున్నారని, మొత్తానికి ఆయనకు పార్టీ పదవి దక్కిందని ఎద్దేవా చేశారు. తాను ఎవరిపై విమర్శలు చేయడంలేదని, సరిచేసుకోండని మాత్రమే చెబుతున్నానంటూ రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు. తనకు యూపీ సీఎం యోగితో పాటు చాలామంది పార్టీ పెద్దల ఆశీర్వాదం ఉందని తెలిపారు. వారికి చెప్పకుండా రాజీనామా చేసినందుకు తిట్టారని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో తన బాధను వారికి చెప్పుకున్నానని వివరించారు. ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు తనకు సహకరించలేదనీ, తనను గెలిపించింది గోషామహల్‌ ప్రజలని స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad