– రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
– తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఐదు గ్రామాల రుణాన్ని తీర్చుకునేందుకు కృషి చేస్తా
– విజయవంతంగా ముగిసిన అంతర్ పాఠశాలల క్రీడలు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
రాబోయే రోజుల్లో మండలంలో క్రీడల నిర్వహణను ప్రోత్సాహానికి మానాల ట్రస్టు ద్వారా సహాయం అందిస్తామని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి మండలంలోని అమీర్ నగర్ మండల పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన మండల అంతర్ పాఠశాలల క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ .. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా యూనివర్సిటీలను ఏర్పాటు చేసి ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించడమే లక్ష్యంగా నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నారాని తెలిపారు. క్రీడల్లో రాణించడం ద్వారా భవిష్యత్తులో కూడా పైకి ఎదగవచ్చు అన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, స్నేహం పెంపొందుతాయన్నారు.
గతంలో తాను ఇచ్చిన మాట ప్రకారం మండలంలో క్రీడల నిర్వహణ కొరకు నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. తన సొంత గ్రామం మానాల తర్వాత అమీర్ నగర్, నర్సాపూర్, కోనాపూర్, ఇనాయత్ నగర్, కోన సముందర్ ఈ ఐదు గ్రామాలు తనకు రాజకీయ బిక్ష పెట్టిన గ్రామాలు అన్నారు. తాను ఇప్పుడు ఈ స్థాయికి ఎదగడానికి ఎప్పుడు ఈ ఐదు గ్రామాలు తనను తగ్గించకుండా సహాయ సహకారాలతో తోడ్పాటును అందించాయన్నారు. ఈ ఐదు గ్రామాల రుణాన్ని తీర్చుకునేందుకు తన వల్ల అయిన మేరకు కృషి చేస్తానన్నారు. అమీర్ నగర్ గ్రామస్తుల కోరిక మేరకు విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం తన వంతు కృషి, గ్రామస్తుల కోరిక నెరవేరుస్తానని హామీనిచ్చారు.
మండల అంతర్ పాఠశాలల క్రీడల నిర్వహణకు కృషి చేసి, విజయవంతం చేసిన క్రీడా నిర్వాహకులను, క్రీడాకారులను ఆయన అభినందించారు. అనంతరం విజేత జట్లకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, మండల విద్యాధికారి ఆంధ్రయ్య, క్రీడల కన్వీనర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కిరణ్, సీని దర్శకులు భాస్కర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పిఈటిలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.