ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడాలి
సర్వేయర్ వేసిన హద్దుల తొలగింపుపై ఆగ్రహం
నవతెలంగాణ – పెద్దవంగర
నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం గతంలో ప్రభుత్వం కేటాయించిన భూమిని ఆక్రమించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పెద్దవంగర గ్రామస్తులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ.. తహశీల్దార్ వీరగంటి మహేందర్ కు గురువారం స్థానికులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దలిత నాయకులు చిలుక సోమయ్య, సుంకరి ఏసయ్య మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 50/1 లో 6.14 ఎకరాల భూమి, సర్వే నెంబర్ 50/2 లో 2.30 ఎకరాల భూమిని పేదల ఇంటి స్థలాల కోసం కేటాయించింది.
సదరు భూమికి సరిహద్దు పట్టాదారుడైనా ఓ వ్యక్తి ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నాడు. అంతేకాకుండా అందులో ప్రహారీ గోడ నిర్మాణానికీ యత్నిస్తున్నాడు. దీనిపై స్థానికులు నిలదీయగా 6 ఫిబ్రవరి 2025 నాడు సదరు వ్యక్తి రెవిన్యూ అధికారులతో సర్వే చేయించాడు. ఆ భూమి సంబంధించి రెవిన్యూ అధికారులు, గ్రామ పెద్దలు సమక్షంలో అదేరోజు సరిహద్దులు కూడా వేశారు. ఆయన ఈనెల 8న మళ్ళీ ట్రాక్టర్ తో గతంలో సర్వేయర్ వేసిన సరిహద్దులను తొలగించి, భూమి చదును చేయించాడు. దీన్ని గమనించిన స్థానికులు అడిగినందుకు తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఏడాది కాలంగా తమను దుర్భాషలాడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల క్రితం నిరుపేదలకు కేటాయించిన ప్రభుత్వ భూమిని కాపాడాలని, ఆయన నుండి తమకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. రెవిన్యూ అధికారులు స్పందించి, ప్రభుత్వ భూమికి వెంటనే శాశ్వత సరిహద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చిలుక వెంకన్న, చెరుకు సాలయ్య, జలగం నాగరాజు, చెరుకు వెంకన్న, రాంపాక ముత్తయ్య, చిలుక మధురమ్మ, సుంకరి జ్యోతి, శ్రీలత, యాకమ్మ, వినోద, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
ఆక్రమణదారుపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES