ఇజ్రాయిల్ తీరును ఖండిస్తూ 140 మంది ప్రముఖ ఆర్థికవేత్తల లేఖ
న్యూఢిల్లీ : ఇజ్రాయిల్ గాజాలో ‘ఆకలిని ఆయుధంగా’ వినియోగించడాన్ని ఖండిస్తూ 140మంది ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వేత్తలు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆకలిని తీవ్రతరం చేసే ఏ విధానాన్ని అయినా’ తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ సమాజాన్ని, అమెరికా ప్రభుత్వాన్ని వారు కోరారు. ఇజ్రాయిల్‌తో ఆర్థిక, సాంస్కృతిక మరియు క్రీడా సంబంధాలను బహిష్కరించాలంటూ ప్రపంచ దేశాలను కోరారు. ఈ మేరకు ప్రముఖ ప్రొఫెసర్లు, పరిశోధకులు మరియు ఇతర విద్యావేత్తలు సహా 140మంది ఆర్థిక వేత్తలు బుధవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు. ”ఆక్రమణలు, మారణహోమానికి నిధులు సమకూర్చే ఆర్థిక వ్యవస్థ” నుంచి వైదొలగాలని వారు పిలుపునిచ్చారు. గత రెండేండ్లుగా ప్రజల జీవితాన్ని, సమాజాన్ని, పాలస్తీనా భవిష్యత్తును తీవ్రంగా నాశనం చేసినందుకు ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయాలని అంతర్జాతీయ సమాజం మరియు అమెరికా ప్రభుత్వాన్ని వారు ఆ ప్రకటనలో కోరారు. ఇదే విషయమై 23మంది ప్రముఖ ఆర్థిక వేత్తలు ఇటీవల ఇజ్రాయిల్ ప్రధానికి, నెసెట్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. గాజాలో శాశ్వతంగా కరువు నెలకొనేలా, అక్కడి ప్రజలను స్థానభ్రంశులను చేసే చర్యలను ఇజ్రాయిల్ కొనసాగిస్తోందని ఆ లేఖ పేర్కొంది. కానీ గాజాలో ప్రస్తుత యుద్ధానికి మూల కారణాలను ప్రస్తావించకుండా ఆ లేఖ తప్పించుకుంది. యుద్ధాన్ని తక్షణమే ముగించడమే ప్రస్తుతం అవసరమైన చర్య అని, అదే తర్వాతి చర్యలకు నాందీ ప్రస్తావన అవుతుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేశారు. గాజాలో యుద్ధాన్ని ఆపాలంటూ తమ తమ దేశాల్లోని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని, ఆ మేరకు డిమాండ్లు చేయాలని వారు పలువురు నేతలను, ఆర్థిక సంస్థలను కోరారు.