Friday, September 12, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువీరతెలంగాణ పోరాటచరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ

వీరతెలంగాణ పోరాటచరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ

- Advertisement -

సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేయాలి : మిర్యాలగూడలో జరిగిన వారోత్సవాల్లో తమ్మినేని
నవతెలంగాణ-మిర్యాలగూడ

వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ మతం రంగు పూసి చరిత్రను వక్రీకరిస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. ముందుగా సీపీఐ(ఎం) అగ్రనేతలకు గ్రామస్తులు, కార్యకర్తలు పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌, ఖమ్మం నల్గొండ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, తుమ్మల వీరారెడ్డిలతో కలిసి అంబేద్కర్‌ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సన్మానించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ ఆనాడు భూస్వాములు, పెత్తందారులు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో సబ్బండ వర్గాలు కులమతాలకతీతంగా పోరాటం సాగించారని గుర్తు చేశారు. ఎంతోమంది ముస్లిం నాయకులు నాయకత్వం వహించి ప్రాణాలు పోగొట్టుకున్నారని చెప్పారు. నాడు పీడిత ప్రజల కోసమే సాయుధ పోరాటం సాగిందని ఆ పోరాట ఫలితంగా నేడు ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బీజేపీ లేదని, కానీ ఆ పోరాటాన్ని ముస్లిం హిందువుల మధ్య జరిగినట్టు చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఆనాటి పోరాట చరిత్రను ప్రజలకు వివరించి చైతన్యపరిచేందుకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహి స్తున్నట్టు తెలిపారు. ఆ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం బలమైన ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఎర్రజెండానే భవిష్యత్తు ప్రత్యామ్నాయమని తెలిపారు. ఐదేండ్లపాటు సాగిన సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి ఇచ్చారని 4500 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ నెల 17న నల్గొండలో వారోత్సవాల సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బందాకరత్‌ హాజరుకానున్నట్టు తెలిపారు. జిల్లా నల్గొండ నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. గ్రామ సీనియర్‌ నాయకులు వెంకయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి, డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్‌ హాసం, బండ శ్రీశైలం, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి మూడవత్‌ రవి నాయక్‌ జిల్లా కమిటీ సభ్యులు పాదూరి శశిధర్‌ రెడ్డి, చౌగాని సీతారాములు, పోలేబోయిన వరలక్ష్మి, వినోద్‌ నాయక్‌, సీనియర్‌ నాయకులు నూకల జగదీష్‌ చంద్ర, డా.మల్లు గౌతమ్‌ రెడ్డి, బావాండ్ల పాండు నాయకులు కృష్ణయ్య, లతీఫ్‌, చంటి, గోపి, గోవర్ధన, అరుణ, పులమ్మ,బాలాజీ, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -