Friday, September 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచరిత్ర లేని బీజేపీ అందరి చరిత్రనూ హైజాక్‌ చేస్తోంది

చరిత్ర లేని బీజేపీ అందరి చరిత్రనూ హైజాక్‌ చేస్తోంది

- Advertisement -

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

నవతెలంగాణ-ముషీరాబాద్‌
ఏ చరిత్రా లేని బీజేపీ, అందరి చరిత్రను తనదంటూ హైజాక్‌ చేసుకుంటూ దుష్ట రాజకీయాలకు పాల్పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 77వ వారోత్సవాలను గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద రైతాంగ సాయుధ పోరాట యోధుడు మఖ్దూం మోహియుద్దీన్‌ విగ్రహానికి సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌, జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి. నరసింహతో కలిసి కూనంనేని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహం వరకు ‘రెడ్‌ ఫ్లాగ్‌ మార్చ్‌’ నిర్వహించారు. సీపీఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం నాటికి అసలు ఉనికే లేని బీజేపీ విమోచన దినోత్సవం పేరుతో సెప్టెంబర్‌ 17న ఉత్సవాలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. వర్గపోరాటాన్ని మత పోరాటంగా చూపిస్తూ బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు. ”కమ్యూనిస్టుల చరిత్ర చెరిపేయలేము. అమరుల త్యాగాలకు వెల కట్టలేము” అని స్పష్టం చేశారు. అజీజ్‌ పాషా మాట్లాడుతూ చరిత్రను ఎవరు వక్రీకరించినా… చరిత్ర ఎప్పటికీ చరిత్రగానే నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్‌.ఛాయాదేవి, రాష్ట్ర నాయకులు బి.వెంకటేశం, పి.ప్రేమ్‌ పావని, ఎం.నర్సింహ్మా, ఎం.ధర్మేంద్ర, ఎం.అనిల్‌ కుమార్‌, కమతం యాదగిరి, ప్రజానాట్యమండలి అధ్యక్షులు కె.శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ్మా, లక్ష్మినారాయణతో పాటు సీపీఐ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -