ట్రంప్ టారిఫ్‌ల ప్రభావమే : సీఎన్‌ఎన్ రిపోర్ట్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీగా విధిస్తోన్న టారిఫ్‌లతో తమ సొంత దేశంపైనే తీవ్ర ప్రభావం పడనుందని రిపోర్టులు వస్తున్నాయి. తాను రెండో సారి అధికారంలోకి రాగానే అమెరికా కలల కోసం పోరాడతానని, స్వదేశీయులకు ఉద్యోగాలను కల్పిస్తానని, దిగుమతులపై కఠిన వైఖరి తీసుకుంటానని ట్రంప్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ కోసం చేపడుతున్న చర్యలు ఆ దేశాన్నే ముంచేలా కనబడుతున్నాయి. చైనా, బ్రెజిల్, భారత్ ఇతర దేశాలపై భారీగా వేస్తోన్న సుంకాలతో అమెరికాలో పేదరికం కూడా భారీగా పెరగనుందని సీఎన్‌ఎన్ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ట్రంప్ చర్యలతో ప్రభుత్వ కస్టమ్స్ ఆదాయం పెరిగినప్పటికీ దేశంలో పేదరికం పెరుగుతోందని విశ్లేషించింది. దిగుమతులపై అధిక టారిఫ్‌లను విధించడంతో ఉత్పత్తుల ధరలు ఎగిసిపడనున్నాయని.. ప్రజల ఆదాయాలు తగ్గనున్నాయని పేర్కొంది. ట్రంప్ టారిఫ్‌లు 2026 నాటికి సుమారు 8,75,000 మంది అమెరికన్లను పేదరికంలోకి నెట్టవచ్చని అంచనా వేసింది. వీరిలో 3,75,000 మంది పిల్లలు ఉండొచ్చని విశ్లేషించింది. ఈ రిపోర్ట్‌ను పన్నులకు ముందు ఆదాయం ఆధారంగా లెక్కించింది. అమెరికాలో దిగుమతి ఉత్పత్తులు భారం కావడంతో అక్కడి ప్రజల రోజువారీ అవసరాలైన వస్తువులు గ్రాసరీలు, దుస్తులపై ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంతక్రితం ఇవి చౌకగా ఉండేవి కానీ ఇప్పుడు టారిఫ్‌లతో ధరలు పెరిగాయి. ట్రంప్ టారిఫ్‌లు ఒక విధంగా అమెరికన్ ప్రజలపైనే పన్ను అని బడ్జెట్ ల్యాబ్ ప్రతినిధి జాన్ రికో పేర్కొన్నారు. టారిఫ్‌లు ఆదాయం మీద కాకుండా వస్తువులు, సేవలపై కాబట్టి తమ ఆదాయ శాతాన్ని ఆదా చేసేదాని కంటే ఎక్కువగా ఖర్చు చేసే వారిని ఇది మరింత ప్రభావితం చేయనుందన్నారు. యూఎస్ సెన్సెస్ బ్యూరో అంచనా ప్రకారం.. గతేడాది నాటికి అమెరికాలో 36 లక్షల మంది పేదరికంలో ఉన్నారు.
పేదరికం వైపు అమెరికన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES