Friday, September 12, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమమ్మల్ని అదుపు చేయలేరు

మమ్మల్ని అదుపు చేయలేరు

- Advertisement -

అమెరికాకు చైనా హెచ్చరిక
బీజింగ్‌ :
తమను కట్టడి చేయాలని, ఆటంకపరచాలని లేదా తమ వ్యవహారాలలో జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తే ప్రయోజనం ఏమీ ఉండదని అమెరికాను చైనా హెచ్చరించింది. అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌కు బుధవారం వీడియోకాల్‌ చేసిన చైనా రక్షణ మంత్రి డాంగ్‌ జన్‌ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారని ప్రభుత్వ సీసీటీవీ తెలియజేసింది. అయితే చర్చలు ఎలాంటి దాపరికం లేకుండా నిర్మాణాత్మకంగా సాగాయని పెంటగాన్‌ తెలిపింది. రెండు దేశాల మధ్య వివాదాస్పద అంశాలుగా నిలిచిన తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం కూడా ప్రస్తావనకు వచ్చాయని వివరించింది.
చైనాను కట్టడి చేసేందుకు తైవాన్‌ను వాడుకున్నా లేదా తైవాన్‌ స్వాతంత్య్రానికి మద్దతుగా బల ప్రయోగం చేసినా ఆ ప్రయత్నాన్ని, జోక్యాన్ని తిప్పికొడతామని హెగ్‌సేథ్‌కు డాంగ్‌ స్పష్టం చేశారు. స్వయం పాలిత ప్రాంతంగా ప్రకటించుకున్న తైవాన్‌ తన అధీనంలోనే ఉన్నదని చైనా తేల్చి చెబుతోంది. దానిని తన అధీనంలోకి తీసుకునేందుకు బల ప్రయోగం చేసే అవకాశాన్ని బీజింగ్‌ తోసిపుచ్చడం లేదు. మరోవైపు తైవాన్‌కు అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తోంది. అంతేకాక తైవాన్‌ రక్షణ కోసం సాయం చేస్తానని చెబుతోంది. ఇక పసిఫిక్‌ మహా సముద్రంలోని దక్షిణ చైనా సముద్ర ప్రాంతం తనదేనని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. అయితే అందులో తమకూ భాగం ఉన్నదని ఆ సముద్రం చుట్టూ ఉన్న అనేక దేశాలు చెప్పుకుంటున్నాయి. ‘చైనాతో అమెరికా ఘర్షణను కోరుకోవడం లేదని హేగ్‌సేథ్‌ స్పష్టంగా చెప్పారు. అదే సమయంలో ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికాకు కొన్ని కీలక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది’ అని పెంటగాన్‌ ప్రతినిధి సియాన్‌ పార్నెల్‌ తెలిపారు. ఏదేమైనా చర్చలు కొనసాగించాలని ఇరు దేశాలు అంగీకరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -