హరిత విప్లవం ద్వారా ఇండియా ఆహార స్వయంసమృద్ధి
ఆఫ్రికా నేలలకనుగుణంగా విత్తనం అందించాలి
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
తెలంగాణ విత్తనానికి గ్లోబల్ గుర్తింపు
20 దేశాలకు విత్తన ఎగుమతి
పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు భరోసా’ : ఇండో-ఆఫ్రికన్ సీడ్ సమ్మిట్-2025లో మంత్రి తుమ్మల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ రంగంలో ఇరుదేశాల సంబంధాలు మెరుగుపరిచే వేదిక ఈ ఇండియా ఆఫ్రికా సీడ్ సమ్మిట్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. హరిత విప్లవం ద్వారా భారత దేశం ఆహార స్వయం సమృద్ధి సాధించిందని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఆసియా, ఆఫ్రికా ఖండాలను కలపే వారధిగా ఈ సమ్మిట్ చరిత్రలో నిలవబోతున్నదని అభిప్రాయపడ్డారు. ఇండియా, ఆఫ్రికా దేశాలకు వ్యవసాయ రంగమే ప్రధాన ఆదాయ వనరని తెలిపారు. అధిక దిగుబడినిచ్చే నాణ్యతమైన విత్తనాలను అభివృద్ధి చేసేందుకు ఇరు దేశాలు కలిసి పని చేయాలని సూచించారు. గురువారం హైదారాబాద్‌లో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్‌ఏ), ఆఫ్రికన్ సీడ్ ట్రేడ్ అసోసియేషన్ (ఏఎఫ్‌ఎస్‌టీఏ), ఇతర భాగస్వామ్య సంస్థలు మూడు రోజులపాటు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇండో- అఫ్రికన్ సీడ్ సమ్మిట్-2025లో ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల మాట్లాడారు. ఈ సమ్మిట్‌లో కేవలం వాణిజ్యపరమైన అంశాలపై చర్చించడమేకాకుండా సీడ్ డిప్లొమసీ ద్వారా విశ్వాసాన్ని పెంపొందించడం, శాస్త్ర పరిజ్ఞానాన్ని పంచుకోవడం, వ్యవసాయరంగంలో సుస్ధిరతను సాధించేందుకు అనుసరించాల్సిన పద్దతుల కోసం భవిష్యత్తులో పరస్పరం కలిసి పని చేయాలని కోరారు. అందుకు ఈ సమ్మిట్ ఒక వారధిగా నిలవాలని సూచించారు. భారతదేశం ఆహార స్వయం సమృద్ధి సాధించడానికి నాణ్యమైన విత్తనమే కారణమని తెలిపారు. నాణ్యమైన విత్తనం లేకపోతే అధిక దిగుబడి రాదని చెప్పారు. అలాగే రైతు ప్రగతి సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఆఫ్రికా ఖండంలో మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి పంటలు సాగవుతున్నప్పటికీ అందులో కొంత ధాన్యాన్ని శుద్ధి చేసి విత్తనంగా ఉపయోగిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ ఉత్పాదకతను తగ్గిస్తుందని వివరించారు. ఆఫ్రికా దేశాల్లో సస్యశ్యామలమైన నేలలు, అనుకూల వాతావరణం ఉన్నప్పటికి రైతులకు సరైన సమయంలో సరైన విత్తనం అందడం లేదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర విత్తన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏ విధంగా ఉన్నదో ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశపు సీడ్ హబ్‌గా మారిందని తెలిపారు. తెలంగాణ నుంచి 60శాతం విత్తనం దేశంలోని అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని 20 దేశాలకు విత్తనాన్ని ఎగుమతి చేస్తున్నామని వెల్లడించారు. ఆధునిక పరిశోధన, ప్రాసెసింగ్, నిల్వసదుపా యాలతోపాటు కఠినమైన నాణ్యతా ప్రమాణాలను పాటించడం వల్ల తెలంగాణ విత్తనాలకు గ్లోబల్ గుర్తింపు లభించిందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పంట పెట్టుబడి సాయం (రైతు భరోసా) పథకానికి సంబంధించిన ప్రాధాన్యతను వివరించారు. రైతుల ఖాతాలో నేరుగా సబ్సిడీ జమ చేయడం ద్వారా, రైతు తనకు నచ్చిన నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని ఉందని తెలిపారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరిగి, రైతును శక్తివంతంగా మార్చేందుకు దోహదం చేస్తుంద న్నారు. ఆఫ్రికా దేశాలు కూడా ఇలాంటి విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నాణ్యమైన విత్తనాల వినియోగం పెరిగి ఉత్పాదకత, ఆహార భద్రత గణనీయంగా మెరుగుపడుతుందని ఆయన సూచించారు. ఆఫ్రికా విత్తన మార్కెట్ విలువ దాదాపు యూఎస్‌డీ 3.99 బిలియన్‌గా ఉందని చెప్పారు. భారత్-ఆఫ్రికా భాగస్వామ్యం ద్వారా రైతులు, పరిశోధకులు, విత్తన సంస్థలు ప్రయోజనం పొందవచ్చ న్నారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి ప్రభుత్వ, ప్రయివేటు రంగ నిపుణులు పాల్గొన్నారు.