– సాయంత్రం 4 గంటలకు మోగిన సైరన్‌లు
– యుద్ధం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పౌరులకు అవగాహన
– ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు : నగర సీపీ సీవీ ఆనంద్
నవతెలంగాణ-సిటీబ్యూరో
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో బుధవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. గోల్కొండ, కంచన్‌బాగ్, సికింద్రాబాద్, మల్లాపూర్‌లలో మాక్ డ్రిల్ నిర్వహించారు. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు పలుచోట్ల సైరన్లు మోగాయి. ప్రధాన కూడళ్లు, అపార్ట్‌మెంట్ల వద్ద కూడా సైరన్లు మోగించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు, సహాయక సిబ్బంది ఎలా వ్యవహరించాలనే దానిపై అధికారులు అవగాహన కల్పించారు.హౌం సెక్రెటరీ రవి గుప్త, ఫైర్ సర్వీసెస్ డీజీ వై.నాగిరెడ్డి, అదనపు సీపీ విక్రమ్‌సింగ్ మాన్, ఐసీసీసీ ఇన్‌చార్జ్ కమలాసన్‌రెడ్డితో కలిసి నగర సీపీ డీజీ సీవీ ఆనంద్ మాక్ డ్రిల్‌ను కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో యుద్ధం నేపథ్యంలో ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి నగరంలో మాక్ డ్రిల్ నిర్వహించామని తెలిపారు. 54 సంవత్సరాల తర్వాత మాక్ డ్రిల్ జరిగిందన్నారు. ఈ మాక్ డ్రిల్ సన్నాహక చర్యలు మాత్రమేనని, ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఈ మాక్ డ్రిల్‌లో తమ లోపాలను సమీక్షించుకుని అప్రమత్తత మెరుగు పర్చేలా చేశామని తెలిపారు. యుద్ధానికి సంబంధించి లేదా ఇతర ఏ విషయాలకు సంబంధించైనా తప్పుడు వార్తలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. నాలుగు గంటలకు కమాండ్ కంట్రోల్స్ సెంటర్ నుంచి అలెర్ట్ ఇచ్చామని, రెండు నిమిషాల పాటు పోలీస్, ఫైర్ వాహనాలు, ఇండిస్టియల్ సైరన్లు మోగాయన్నారు. నాలుగు ప్రాంతాల్లో మిస్సైల్ అటాక్ జరిగినట్టు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సందేశం ఇచ్చామని, అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారని తెలిపారు. నాలుగు ప్రాంతాల్లో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, మెడికల్, ఫైర్, డిజాస్టర్, రెవెన్యూ ఇతర విభాగాల అధికారులు అందుబాటులో ఉన్నారని, మిస్సైల్ అటాక్ జరిగిన ప్రాంతాలకు తర వెళ్లడం, మంటలు అంటుకుంటే ఆర్పడం వంటి అంశాలను డ్రిల్‌లో చూపించామని వివరించారు. అంబులెన్స్‌లు రావడానికి.. వెళ్లడానికి ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చామని, లా అండ్ ఆర్డర్ పోలీసులు క్రౌడ్ కంట్రోల్ చేశారని వివరించారు. మాక్ డ్రిల్‌లో భాగంగా గాయపడిన వారికి వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారన్నారు.
హైదరాబాద్‌లో ఆపరేషన్ అభ్యాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES