Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాజ హితం కోసమే కామ్రేడ్ ఏచూరి ప్రయత్నం

సమాజ హితం కోసమే కామ్రేడ్ ఏచూరి ప్రయత్నం

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు 
సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీతారాం ప్రథమ వర్ధంతి
నవతెలంగాణ – వనపర్తి  

దేశ ప్రజల మధ్య మతం చిచ్చు పెచ్చరిల్లుతున్న నేటి సమాజ పరిస్థితులను అర్థం చేసుకొని లౌకిక రాజ్యం కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ సమాజ హితం కోసం పాటుపడ్డ ఒకే ఒక వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు అన్నారు. సీపీఐ(ఎం) వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సిఐటియు జిల్లా కార్యాలయంలో శుక్రవారం సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎం. పరమేశ్వర చారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ప్రసంగిస్తూ 72 సంవత్సరాల వయసులో ధన్యజీవి సీతారామ్ ఏచూరి  సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో మరణించారని అన్నారు. ఆయన స్వస్థలం కాకినాడ అని, మద్రాసులో జన్మించి హైదరాబాదులో పెరిగారన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం సమయంలో ఢిల్లీకి వెళ్లి చదువుకున్నారన్నారు. ఢిల్లీలో సీబీఎస్ఈ లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించారన్నారు. ఆర్థిక శాస్త్రంలో బి ఏ ఆనర్స్, జేఎన్ యు లో ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారన్నారు. అర్థశాస్త్రంలో పీహెచ్డీ జేఎన్ఈ లో చదువుతుండగా 1975లో ఎమర్జెన్సీ కాలంలో ఆయనను అరెస్టు చేయడంతో చదువు ఆగిందన్నారు. సీతారాం ఏచూరి సీపీఐ(ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాలంలో 2024 సెప్టెంబర్ 12న ఆయన మరణించడం ఇటు పార్టీ, అటు దేశం తీరని లోటుగా భావించాయని తెలిపారు. 

ఆయన 1974 లో ఎస్ఎఫ్ఐ లో చేరి విద్యార్థి ఉద్యమాలు నడిపారన్నారు. 1975లో సీపీఐ(ఎం) పార్టీలో చేరారన్నారు. 1984 నుండి 1986 వరకు ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులుగా పని చేశారన్నారు. 1977- 78 కాలంలో జేఎన్ యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నారు. 1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారని, 1985లో పార్టీ కార్యదర్శి వర్గానికి ,1992లో పొలిట్ బ్యూరో సభ్యులయ్యారన్నారు. సీపీఐ(ఎం) 19వ అఖిల భారత మహాసభలు 2015లో అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారని తెలిపారు. వరుసగా మూడు మహాసభల్లో ఆయన ఏకగ్రీవంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారని తెలిపారు. రెండుసార్లు 2005 నుండి 2017 వరకు సీపీఐ(ఎం) పక్షాన రాజ్యసభ సభ్యుడిగా పని చేశారన్నారు. పార్లమెంటులో అనేక అంశాల్లో విలువైన సూచనలు, సలహాలు ఇవ్వడం పార్లమెంటును సక్రమంగా నిర్వహించేందుకు ప్రయత్నించారన్నారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2017 మార్చి 3న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సీతారాం ఏచూరి చేసిన సవరణకు రాజ్యసభ ఆమోదించడం ,మోడీ ప్రభుత్వానికి తలవొంపులు తెచ్చిందన్నారు. ఏచూరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారన్నారు. ఈ విధంగా పార్లమెంటులో సవరణ చేయడం పార్లమెంటు చరిత్రలో నాలుగోసారి అన్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం సమయంలో 2004 యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని తయారుచేసి సాధారణ ప్రజలకు ఉపయోగపడేలా పార్లమెంటును ఉపయోగించుకు న్నారని అన్నారు. 

ఆయన హయాంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం, అటవీ హక్కుల చట్టం దేశమంతా అమలవుతున్నాయని అన్నారు. 2024 ఇండియా కూటమి కూర్పులో సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న భారతదేశంలో మతోన్మాదం హెచ్చరిల్లుతున్న కాలంలో “పెట్రేగిపోతున్న మతోన్మాదం” అనే పుస్తకం రాశారని, పార్లమెంటులో చర్చించారన్నారు. ” హిందూ రాష్ట్ర అంటే ఏమిటి” అనే పుస్తకం రాశారని, గోల్వాల్కర్ సిద్ధాంతాన్ని బట్టబయలు చేశారన్నారు. గోల్వాల్కర్ సిద్ధాంతాన్ని తూర్పారబట్టారని లౌకిక రాజ్యాంగం అవసరాన్ని నొక్కి చెప్పారన్నారు. మనోధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించాలన్నారు. సిపిఎం అఖిలభారత కార్యదర్శిగా లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు.

రష్యాలో సోషలిజం పోయినప్పుడు సైదాంతిక తీర్మానం రాసి మహాసభ ఆమోదానికి పెట్టారని, అంతర్జాతీయ వ్యవహారాలు చూసేవారని జాతీయ అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణించడం సీపీఐ(ఎం) పార్టీతో, భారతదేశంలో సెక్యులర్ రాజ్యాంగానికి నష్టమన్నారు. రాబోయే కాలంలో హిందూ ఉన్మాదానికి, ముస్లిం ఉన్మాదానికి వ్యతిరేకంగా మతసామరస్యం కోసం లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు సోషలిజం సాధనకు చేసే కృషి కామ్రేడ్ సీతారాం ఏచూరి కి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. లక్ష్మి, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పట్టణ కమిటీ సభ్యులు డి. కురుమయ్య, జి .మదన్ ,జి .గట్టయ్య, జి. బాలస్వామి, సీపీఐ(ఎం) నాయకులు జి. బాలరాజు, నందిమల్ల రాములు, సాయిలీల, ఉమా, లలిత, జి. రాబర్ట్, డి.శ్రీను, ఎం. మన్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -