Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెబ్బేరు, పానగల్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

పెబ్బేరు, పానగల్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

- Advertisement -

మున్సిపాలిటీలలో మంజూరైన అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
నవతెలంగాణ – వనపర్తి

వనపర్తి పట్టణం నుండి పెబ్బేరు, పానగల్ రోడ్ల పరిధిలో చేపట్టాల్సిన రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. కలెక్టర్ తన చాంబర్లో మున్సిపాలిటీ, రోడ్లు భవనాలు, పబ్లిక్ హెల్త్ అధికారులతో రోడ్డు విస్తరణ పనులు, ఆయా మున్సిపాలిటీలలో పబ్లిక్ హెల్త్ ద్వారా పూర్తి చేయాల్సిన అభివృద్ధి పనులపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్తరణ పనులపై కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్న కుటుంబాలలో ఇప్పటికే 23 కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, మిగిలిన అర్హులైన వారికి టిడిఆర్ కింద లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు.

అందువల్ల రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను వెంటనే తొలగించే ప్రక్రియ మొదలు పెట్టాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నిర్మాణాలను తొలగించే ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. రోడ్డు పక్కన ఆక్రమణ చేసిన యజమానులకు నోటీస్ జారీ చేసి అక్రమ నిర్మాణాలు తొలగించాలని సూచించారు.  పానగల్, పెబ్బేరు రోడ్డు విస్తరణకు సంబంధించి రోడ్డు పై ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ లు మార్చే ప్రక్రియ మొదలు పెట్టాలని అందుకు అవసరమైన నిధులు విద్యుత్ శాఖకు బదలాయించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. నిర్దేశించిన అలైన్మెంట్ ప్రకారం బి.టి. రోడ్డు వేసే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని రోడ్లు భవనాల శాఖ ఇంజనీరును ఆదేశించారు. 

పబ్లిక్ హెల్త్ పై సమీక్ష నిర్వహిస్తూ ఇప్పటికే టి.యు.ఎఫ్.ఐ.డి.సి నిధుల ద్వారా వనపర్తి జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలలో మంజూరు అయిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని పబ్లిక్ హెల్త్ కార్యనిర్వహక ఇంజనీరును ఆదేశించారు. డ్రైన్, సెంటర్ లైట్, మినీ ట్యాంక్ బండ్, పార్కు, ఓపెన్ జిమ్, సమీకృత మార్కెట్ తదితర అభివృద్ధి పనులను నిర్ణిత గడువులో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు విస్తరణ సందర్భంగా పబ్లిక్ హెల్త్, రోడ్లు భవనాల శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని, రోడ్డు వేశాక పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ వారు రోడ్డు ను తవ్వే చర్యలు ఉండకూడదని, ఏదైనా ముందుగానే సమన్వయం చేసుకొని పనులు చేపట్టాలని సూచించారు. పబ్లిక్ హెల్త్ కార్యనిర్వాహక ఇంజనీరు విజయ భాస్కర్ రెడ్డి, డి ఈ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రోడ్లు భవనాల ఇంజనీర్లు, తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -