Saturday, September 13, 2025
E-PAPER
Homeమానవికాస్త ప్రేమ పంచితే చాలు….

కాస్త ప్రేమ పంచితే చాలు….

- Advertisement -

ఏ వయసులో ఉన్నా తనను ప్రేమించే వారు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను కోరుకుంటారు. వయసుకు వచ్చాక తమ ఆపోజిట్‌ జెండర్‌ పట్ల ఆకర్షణతో వారి నుండి ప్రేమను కోరుకుంటారు. పెండ్లి తర్వాత పిల్లలు తమను ప్రేమించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అంటే ఇలా ఏ వయసులోనైనా మనుషులు ప్రేమ కోసం తపిస్తూనే ఉంటారు. అయితే ఎదుటి వ్యక్తి నుండి ఎంత ప్రేమనైతే పొందుతున్నామో అదే ప్రేమను తిరిగి ఆ వ్యక్తికి పంచాలి. అంతేకాని నాకు కావల్సింది నాకు దక్కింది కదా అని ఎదుటి వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తే కొంత కాలానికి మనం పొందే ప్రేమ దూరమైపోతుంది. అలా తమను ప్రేమించిన వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియజేసే కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌ (ఐలమ్మ ట్రస్ట్‌)లో చదువుదాం…

లక్ష్మికి 50 ఏండ్లు ఉంటాయి. భర్త రమేష్‌ వయసు 52. వారికి పెండ్లి జరిగి 30 ఏండ్లు అవుతుంది. ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నారు. పాపకి ఈ మధ్యనే పెండ్లి చేశారు. బాబు కోసం సంబంధాలు చూస్తున్నారు. లక్ష్మికి తన ఇంట్లో తనకు స్వేచ్ఛ, ప్రేమ అనేది దొరకడం లేదు. పెండ్లై ఇన్నేండ్లు అయినా భర్త ఆమెతో ప్రేమగా పది నిమిషాలు ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఇద్దరూ ఉద్యోగులే. ఇంట్లో పిల్లలు, అత్తమామలు ఉండడంతో వారికి సమయం దొరికేది కాదు.

అయితే లక్ష్మి 30 ఏండ్ల నుండి భర్తతో మనసు విప్పి మాట్లాడాలని ఎదురు చూస్తూనే ఉంది. కానీ రమేష్‌కు ఇది అర్థం కావడం లేదు. పైగా ‘నీతో మాట్లాడటానికి ఏముంది’ అంటాడు. అందరి ముందు ఆమెను చులకన చేసి మాట్లాడతాడు. బంధువుల ముందు హేళన చేస్తాడు. అయినా లక్ష్మి ఏ ఒక్కరోజూ రమేష్‌ను ఏమీ అనలేదు. ఇన్నేండ్లలో రమేష్‌ ఆమెకు చిన్న బహుమతి కూడా ఇవ్వలేదు. కనీసం చీర కూడా కొనివ్వడు. ‘ఉద్యోగం చేస్తున్నావుగా నీకు కావలసింది నీవే కొనుక్కో’ అంటాడు.

అందరూ ఆఫీసులో ‘మా వారు ఈ చీర కొనుక్కొచ్చారు, మేమిద్దరం కలిసి ఈరోజు ఇక్కడకు వెళ్లాము, అక్కడికి వెళ్లాము’ అని చెబుతుంటే లక్ష్మి చాలా బాధపడేది. ఈ విషయమైనా భర్తకు చెబుదామంటే ఏ మాత్రం అవకాశం ఉండేది కాదు. కనీసం ఫోన్‌ చేద్దామన్నా సరిగ్గా మాట్లాడడు. ఇంట్లో ఒంటరిగానే ఫీలయ్యేది. పిల్లలు వాళ్ల చదువు, ఉద్యోగాలలో బిజీగా ఉండేవారు. రాను రాను లక్ష్మి పరిస్థితి యాంత్రికంగా తయారయింది. ఇంట్లో వాళ్లు కేవలం తమ అవసరాల కోసమే తనను ఉపయోగించుకుంటున్నారనే భావన వచ్చేసింది. కనీసం స్నేహితులు, బంధువులతో బయటకు వెళతానన్నా రమేష్‌ ఒప్పుకోడు. ఇలాగే 50 ఏండ్లు వచ్చే వరకు గడిపేసింది.

ఈ మధ్య కాలంలో వాళ్ల ఆఫీసులో రూపేష్‌ అనే వ్యక్తి కొత్తగా ఉద్యోగంలో చేరాడు. అతనికి సుమారు 52 ఏండ్లు ఉంటాయి. అతని మాటలు లక్ష్మికి బాగా నచ్చాయి. అతనితో మాట్లాడుతుంటే టైమే తెలిసేది కాదు. అతను లక్ష్మితోనే కాదు అందరితో అలా సరదాగా ఉండేవాడు. అందరూ కలిసి భోజనం చేసేవారు. రూపేష్‌, లక్ష్మి చేసిన వంటను బాగా మెచ్చుకునేవాడు. ఆమె వంటను గతంలో ఎవ్వరూ ఇలా మెచ్చుకోలేదు. లక్ష్మి నెమ్మదిగా రూపేష్‌ ఆకర్షణలో పడింది. అయితే అతనికి పెండ్లి కాలేదు. ఒంటరిగా ఉంటున్నాడు. అతను వయసులో ఉన్నపుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె వేరే వ్యక్తిని పెండ్లి చేసుకొని వెళ్లిపోయింది. దాంతో అతను పెండ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. లక్ష్మికి అతనితో కలిసి ఉండాలనే ఆలోచన వచ్చింది. కానీ తనను తానే ప్రశ్నించుకుంది. తాను చేస్తుంది సరైనదా కాదా అనే సందేహం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక తెలిసినవారు చెబితే సలహా కోసం ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.

ఆమె చెప్పింది మొత్తం విన్న తర్వాత రమేష్‌ను పిలిపించాము. లక్ష్మి లోలోపలే ఒంటరితనంతో ఎంత కుంగిపోతుందో అతనికి చెబితే ‘ఆమెకి ఈ వయసులో వేరే వ్యక్తి నచ్చాడు. అతనితో వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉంది. అలాంటప్పుడు నన్నెందుకు పిలిచారు. అసలు నేను ఆమెకు ఏం తక్కువ చేశాను. మా మధ్య ప్రేమ లేనిదే ఇన్నేండ్లు కలిసి ఉన్నామా? పిల్లల పెండ్లి చేశామా? అయినా ఆమెకు ఉద్యోగం చేసే అవకాశం ఇచ్చిందే నేను. అలాంటి నన్ను ఈ విధంగా చీట్‌ చేయడం ఎంత వరకు సరైనది’ అన్నాడు.

దానికి లక్ష్మి వెంటనే ‘భవిష్యత్తులో ఏ ఒక్కరూ నన్ను కూర్చొని తిన్నావు అని అనకూడదు అనే నేను ఉద్యోగం చేశాను. అయినా రమేష్‌ నన్ను కేవలం పెండ్లి చేసుకున్నాడు అంతే. నా ఆలోచనలపై ఆయన పెత్తనం ఏంటీ? కనీసం నేను ఒక మనిషిని అనే గౌరవం కూడా ఇవ్వడు’ అంది. దానికి అతను ‘నేను నీకు గౌరవం ఇవ్వలేదా. నేను నీతో తమాషాగా కూడా మాట్లాడకూడదా?’ అన్నాడు. ‘అదే నేను మీతో తమాషాగా కాదు కదా! మామూలుగా కూడా మాట్లాడలేను. నా ఫీలింగ్స్‌తో ఎలాంటి సబంధం లేకుండా 30 ఏండ్లు మీ ఇష్టం వచ్చినట్టు గడిపేశారు. నాకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించారా? ఏ ఒక్కరోజైనా నేను చెబితే మీరు విన్నారా? నన్ను ఓ యంత్రంలా వాడుకున్నారు. అందుకే నన్ను అర్థం చేసుకొని, నా గురించి ఆలోచించే రూపేష్‌ నాకు నచ్చాడు’ అంది.
ఆమె మాటలు విన్న తర్వాత ‘లక్ష్మీ మీ బాధ మాకు అర్థమవుతుంది. కానీ ఈ వయసులో మీరు భర్త పిల్లలను వదిలేసి బయటకు వచ్చి రూపేష్‌తో కలిసి ఉండగలరా? దానికి అతను సిద్ధంగా ఉన్నాడా? ఇంత జరిగిన తర్వాత రమేష్‌లో ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం. మీ భర్తకు కొంత సమయం ఇవ్వండి’ అన్నాము.

రమేష్‌తో ‘చూడండీ మీరు ఆమెవైపు నుంచి ఆలోచించడం లేదు. ఆమె మనసు అర్థం చేసుకోండి. భార్య అంటే బానిస కాదు. ఆమెకూ కొన్ని కోరికలు, ఆలోచనలు, ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఏ భార్య అయినా భర్త నుండి కోరుకునేది ప్రేమా, గౌరవం, ఆప్యాయత. ఇవి మీ భార్యకు మీరు ఇవ్వకపోవడం వల్లనే ఆమెకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. ఇప్పటికైనా ప్రశాంతంగా ఆలోచించండి. ఆమె మీ నుండి ఏం కోరుకుంటుందో అది అందివ్వండి. ఇద్దరూ సరదాగా ఎక్కడికైనా కొన్ని రోజులు బయటకు వెళ్లిరండి. సమస్యలన్నీ సర్దుకుంటాయి. లక్ష్మికి మీపై ఎలాంటి కోపం లేదు. మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచన అంతకన్నా లేదు. కేవలం మీ నుండి ఆమె కోరుకున్న ప్రేమ దొరక్కే ఇలా బాధపడుతుంది. నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆలోచించి మా దగ్గరకు వచ్చింది. ఇప్పటికైనా ఆమెను, ఆమె ఆలోచనలు గౌరవించండి. మీ భవిష్యత్‌ సంతోషంగా ఉంటుంది’ అని చెప్పి పంపించాము.
వై వరలక్ష్మి, 9948794051

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -