Saturday, September 13, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఉపరాష్ట్రపతి ఎన్నిక-జవాబు లేని ప్రశ్నలు!

ఉపరాష్ట్రపతి ఎన్నిక-జవాబు లేని ప్రశ్నలు!

- Advertisement -

మొత్తమ్మీద ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. ఫలితమేమి అనూహ్యంగా లేదు. కానీ ఆ ఎన్నిక కొన్ని జవాబు లేని ప్రశ్నలను మిగిల్చింది. అసలు ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న జగదీప్‌ ధన్కర్‌ ఎందుకు రాజీనామా చేశారు? అనే విషయానికి స్పష్టత కేంద్రం నుంచిగానీ, ఆయనగానీ ప్రజలకిచ్చు కోలేదు. జగదీప్‌ మాత్రం తాను అనారోగ్యంతో బాధపడుతు న్నానని అందుకే పదవిని త్యజిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఈ ఏడాది మొదట్లో అనారోగ్యంగా ఉన్నట్లు విన్నాం. ఒక రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా రాజీనామా చేయడం వెనుక ఏదో జరిగి ఉంటుంది. హోంమంత్రి అమిత్‌షా మాత్రం ధన్కర్‌ చాలా మంచి వ్యక్తని, ఆ పదవికి వన్నె తెచ్చారని, అనారోగ్య కారణాలచే ఆయన తప్పుకున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం నిజాన్ని మసిబూసి మారేడు కాయచేసే ప్రయత్నమే. ధన్కర్‌ ఎంత పదవిలో ఉన్నా ఆయన బీజేపీ మనిషి అనేది మనం గుర్తుంచుకోవాలి. పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చలకు, చర్యలకు పర్యవసానంగా మనస్తాపం చెందిన ఆయన రాజీనామా చేశారనేది బహిరంగ రహస్యమే. అసలు నిజం కేవలం జగదీప్‌ ధన్కర్‌ మాత్రమే చెప్పగలరు! ఆయన చెప్తారని అనుకోవ డం అత్యాశయే కావచ్చు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎందుకొచ్చింది, జగదీప్‌ ఎందుకు రాజీనామా చేశారు అనేవి మిలియన్‌ డాలర్ల ప్రశ్నలుగా మిగిలిపోయాయి.

ఈ ఎన్నికలో ఎన్డీయే కూటమి తరఫున శ్రీ సిపి రాధాకృష్ణన్‌, ఇండియా కూటమి తరఫున విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ సుదర్శన్‌ రెడ్డి పోటీ చేశారు. రాధాకృష్ణన్‌ వైపు మొగ్గు ఉన్నప్పటికీ ఎన్నిక ఏకపక్షం కాకూడదనే అభిప్రాయంతో ఇండియా కూటమి తమ అభ్యర్థిని బరిలో దించింది. అసలు తమ పార్టీ కేవలం తెలుగుజాతి సముద్ధరణ కోసం, ఔన్నత్యం కోసం పుట్టినట్లు చెప్పుకునే తెలుగుదేశం పార్టీ తాము ఎన్డీయే కూటమికే కట్టుబడి ఉన్నట్టు చెప్పి తెలుగువాడైన జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి తమ మద్దతు లేదని చెప్పుకొచ్చింది. విలక్షణమైన, విలువలు కలిగిన న్యాయమూర్తి పట్ల ఆ పార్టీ వైఖరి సబబుగా కాదు. ఇద్దరిలో అన్ని రకాలుగాను సుదర్శన్‌రెడ్డి మెరుగైన అభ్యర్థి. ఆ పార్టీ కేవలం దూరదృష్టితో తమ రాష్ట్రానికి నిధుల వరద పారాలనే ఉద్దేశంతో తమ ప్రాథమిక సూత్రాన్ని పక్కకు పెట్టింది. అదేవిధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నుండి తనకు రక్షణ కావాలనే ఆలోచనతో, రాష్ట్ర కూటమి నుండి ఉన్న భయంతో కేంద్రంలోని కూటమి అభ్యర్థికే మద్దతు తెలిపింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌. అవి ఆయా పార్టీల నిర్ణయాలే కావచ్చు కానీ వారు ప్రజలకు ఏదో ఒకనాడు జవాబు చెప్పుకోవాల్సిన రోజు వస్తుంది. సిద్ధాంతాలకన్నా వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమైనప్పుడు వారి నుండి ఇంతకంటే ఎక్కువ ఆచరణను ఆశించలేం.

ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలోని యూరియా సమస్యను జాతీయ స్థాయిలో చూపించి రాష్ట్రం, కేంద్రం రెండు కూడా ఈసమస్యకు కారణభూతాలుగా ప్రకటించి ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్‌ను బహిష్కరించింది. తెలంగాణకు చెందిన జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి అనేకమార్లు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మంచి సలహాలు, సూచనలిచ్చిన సందర్భాలున్నాయి. రేవంత్‌రెడ్డి మీద ఉన్న ద్వేషం కోపాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ దుర దృష్టవశాత్తు సుదర్శన్‌రెడ్డి మీద చూపించిందేమో? బిజూ జనతాదళ్‌ పార్టీకి చెందిన ఎంపీలు ఒక అసంబద్ధమైన నిర్ణయంతో ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. రెండు కూటములకు వారు సమానదూరం పాటించాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. అకాలీదళ్‌ పార్టీకి చెందిన ఏకైక సభ్యుడు కూడా ఎన్నికల్లో పాల్గొనలేదు. కొద్దిమంది ఎంపీలు క్రాస్‌ ఓటింగుకు కూడా పాల్పడ్డట్టు తెలుస్తోంది. వీరంతా ప్రత్యక్షంగా ఎన్నికకు దూరంగా ఉన్నా పరోక్షంగా బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చినట్లయ్యింది. ఈ ఐదు పార్టీలు సముచితంగా ప్రవర్తిస్తే ఎన్నికల ఫలితం తారు మారయ్యేదేమో? రేపటి నాడు ప్రజాక్షేత్రంలో వీరంతా జవాబు చెప్పుకోవలసినవాళ్లే.

రాజకీయాల్లో ప్రజాస్వామ్యం కొరవడుతున్న దనడానికి నిదర్శనం ఈ ఎన్నిక. రాజ్యాంగ స్ఫూర్తి పూర్తిగా మాయమవుతోంది. మృగ్యమవుతోంది. నిందించడానికి ఎలాంటి భాషనైనా సంకోచం లేకుండా ఉపయోగిస్తున్నారు. ఆత్మరక్షణకు ఎదురుదాడికి దిగడం మన నేతలకు పరిపాటి అయింది. నిందారోపణల పర్వమే చట్టసభల్లోనూ, సమావేశాల్లోనూ నడుస్తోంది. వ్యక్తిత్వ ‘హననానికి’ వెనకాడడం లేదు. జవాబు చెప్పవలసిన వారు జబర్దస్త్‌గా తప్పించుకుని తిరుగుతున్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారిని ఎక్కువ పరుష పదజాలంతో విమర్శించడం నేటి వ్యూహంగా మారింది. ప్రజా సమస్యలు లేవనెత్తిన ప్రతి సమయంలోనూ వారిని పక్కదారి పట్టించే ఉపాయాలు పాలక పక్షాల దగ్గర దండిగా ఉంటాయి. సమయం చూసి వాటిని అస్త్రాలుగా వదులుతారు. పార్టీలు సిద్ధాంతాలను పక్కన పెడుతుంటే నేతలు విలువలను విడిచి స్వారీ చేస్తున్నారు. మన నేతల అదృష్టం కొద్దీ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ. వీరు చేసే అకృత్యాలను మళ్లీ తదుపరి ఎన్నికల వేళకే వారు మర్చిపోవడం మన వ్యవస్థ లక్షణం! అందుకే ప్రతి ఎన్నికలోను పార్టీలు గెలుస్తున్నాయి, ప్రజలు ఓడుతున్నారు.

శ్రీశ్రీ కుమార్‌
9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -