Saturday, September 13, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిభారత ఉపఖండంలో వీస్తున్న కొత్తగాలులు

భారత ఉపఖండంలో వీస్తున్న కొత్తగాలులు

- Advertisement -

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే సంక్షోభం ఉంటుంది. నిరుద్యోగం, దారిద్య్రం, అవినీతి, తీరని ప్రాథమిక అవసరాలు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తాయి. ఈ అస్థిరతే ప్రజా ఉద్యమాలు, తిరుగుబాటులు జరిగి వ్యవస్థల మార్పుకు దారితీస్తుంది. తాజా నేపాల్‌ పరిణామాలు చూస్తే ముండ్లకంచెలు, లాఠీలు, వాటర్‌ కెనన్లు, రబ్బర్‌ బుల్లెట్లు, తుపాకీ కాల్పులు జనాగ్రహాన్ని ఆపలేవని రుజువు చేశాయి. ఇలాంటి జనా గ్రహ జ్వాలలు గత కొన్నేండ్లుగా భారత ఉపఖండాన్ని కమ్మేస్తున్నాయి. ప్రజలకు గుదిబండలుగా మారిన వ్యవస్థలను వారే ధ్వంసం చేస్తారు.2022లో ఆర్థిక సంక్షోభం, తీవ్ర అస్థిరత కారణంగా శ్రీలంక ప్రజలు ప్రభుత్వ భవనాలపై దాడిచేసి, ప్రెసిడెంట్‌ రాజపక్సే దేశం నుండి పారిపోయేలా చేశారు. దాదాపు పాకిస్తాన్‌ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థి యువజన ఉద్యమాలను సాయుధ బలగాలతో అణిచివేయడానికి షేక్‌ హసీనా నాయకత్వంలోని ప్రభుత్వం ప్రయత్నించింది. వందలాదిమంది మరణించారు. ఈ తిరుగుబాటుకు తలొగ్గిన హసీనా చివరకు రాజీనామా చేసి, దేశం విడిచి ప్రాణభయంతో, సైనిక సహకారంతో పారిపోయారు.

తాజా నేపాల్‌ విషయానికొస్తే 2008లో నిరంకుశ రాచరికంపై తిరగబడి లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని నేపాలీ ప్రజలు స్థాపించుకున్నారు.అయితే నేపాలీల ఆశలు నెరవేరలేదు. ఓలీ, దేవ్‌ బా, ప్రచండల చుట్టూనే రాజకీయాలు తిరిగాయి. దాదాపు పద్నాలుగు ప్రభుత్వాలు పాలించాయి. కానీ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. దారిద్య్రం, నిరుద్యోగం, అస్థిరత నెలకొన్నాయి. యువతలో అసహనం పెరిగి పోయింది. ఫలితంగా నేపాల్‌ ఇప్పుడు కల్లోలమైపోయింది. రాజకీయ అస్థిరత, అవధుల్లేని అవినీతి, బంధుప్రీతి, అసమానతలు, అక్రమాలు కనీసం తీరని ప్రాథమిక అవసరాలు దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు ప్రజల జీవితాలను దుర్భరం చేశాయి. నేపాలీలలో గూడు కట్టుకున్న తీవ్ర అసంతృప్తిని శర్మ ఓలి ప్రభుత్వం గుర్తించలేదు. ప్రస్తుతం నేపాల్‌ పై అప్పుల భారం స్థూల దేశీయ ఉత్పత్తిలో 22 శాతం కాగా విదేశీ రుణ భారం జీడీపీలో 24.56శాతం. ఈ దేశ తలసరి ఆదాయం 1460 డాలర్లు మాత్రమే. ఈ దేశంలో నిరుద్యోగం ఇరవై శాతం పైగానే ఉంది. నేపాలీ యువతలో సుమారు నలభై శాతం మంది పొట్ట చేత పట్టుకుని ఇతర దేశాలకు వలస పోతారు .దాదాపు 65శాతం మంది వారి కుటుంబ సభ్యులు విదేశాలనుంచి పంపే డబ్బుల పైనే ఆధారపడాలి. తరాలు గడుస్తున్న ఇక్కడి ప్రజల జీవితాల్లో మార్పు లేదు, దీని కారణంగానే తాజా పెనుమంటలు.

సాంస్కృతికంతో, చారిత్రకంగా, భౌగోళికంగా నేపాల్‌ మన దేశం సుదీర్ఘ అనుబంధం కలిగి ఉంది. ప్రస్తుత నేపాల్‌ పరిణామాల పట్ల భారతదేశం జాగ్రత్త వహించాలి. మన దేశంలోనూ అచ్చం నేపాల్‌ పరిస్థితులే ఉన్నాయి. మనకు స్వాతంత్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు దగ్గరికి వస్తున్నా ప్రజల మౌలిక అవసరాలు తీరలేదు. అధ్వాన ఆర్థిక విధానాలు, నిరుద్యోగం, పేదరికం, దారిద్య్రం, రాజకీయ అస్థిరత, అవినీతి పెరిగిపోయాయి. ఈ కారణంగా పొరుగు దేశాల ఆగ్రహజ్వాలలు మనదేశంలో చెలరేగినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుత ప్రపంచీకరణ మూలనా ప్రధాన వైరుధ్యం సామ్రాజ్యవాదానికి-పీడిత ప్రజలకు మధ్య తీవ్రమై ఉంది. ఇది సంక్షోభాల కాలం. సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేక పోరాట కేంద్రాలుగా బడుగుదేశాలున్నాయి. గత రెండు దశాబ్దాల ప్రపంచ చరిత్రంతా ఈ సంక్షోభాల చరిత్రే. ఈ దృక్పథం నుంచి చూసినప్పుడే మనకు పరిష్కారం కనబడుతుంది. ప్రారంభంలో ప్రపంచీకరణ ప్రజలకు మేలు చేస్తుందని పాలకవర్గాలు ఉదరగొట్టాయి. కానీ కాలం గడిచేకొద్దీ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అభివృద్ధి విధ్వంస కరమైనదని రుజువైంది. ఇది ఉపాధి రహిత అభివృద్ధి అని, సామాన్యుల జీవాధారాలను హరించే అభివృద్ధి అని, సంపద కేంద్రీకరించబడుతుందని, పేదరికం పెరిగిపోతుందని తేలిపోయింది. పాలకుల దివాళాకోరు ఆర్థిక విధానాలను ప్రజలు తెలుసుకుంటున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు పెరిగిపోతున్నాయి. అరబ్బు వసంతం, వాల్‌ స్ట్రీట్‌ ముట్టడి, అలాగే ఒక దేశం తర్వాత మరో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతున్న తీరు చూస్తున్నాం.

1995లో మెక్సికో,1997లో తూర్పు ఆసియా దేశాలు, 1998లో బ్రెజిల్‌, తూర్పు యూరప్‌ దేశాలు, 2002లో అర్జెంటీనా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. నేడు ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభపు కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. పలు దేశాల్లో ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవనం దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా ఉంది. ఈ తరుణంలో ప్రజాందోళనలు, తిరుగుబాట్లు విశ్వజనీనం కానున్నాయి. అటు పశ్చిమ దిక్కు నుంచి, ఇటు భారతం ఉపఖండం నుంచి వీస్తున్న కొత్తగాలులు చెబుతున్న సత్యమిది. ప్రస్తుత మానవ సమాజం ఈ సంక్షోభం నుంచి బయట పడాలంటే ఒక నాగరిక మానవీయ సమ సమాజం ఏర్పాటు కావాలి. అదే సోషలిస్ట్‌ ఆర్థిక వ్యవస్థ. సమానత్వం ఆధారంగా మనిషిని మనిషి దోచుకోలేని సమిష్టి ఉత్పత్తి, సమిష్టి పంపిణీ ఆధారంగా ఏర్పడే సమ సమాజమే మానవాళి విముక్తికి మార్గం.

షేక్‌. కరిముల్లా
9705450705

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -