Saturday, September 13, 2025
E-PAPER
Homeఆటలుభారత్‌, పాక్‌ క్రికెట్‌పై ఆసక్తి సన్నగిల్లుతోంది!

భారత్‌, పాక్‌ క్రికెట్‌పై ఆసక్తి సన్నగిల్లుతోంది!

- Advertisement -

రేపటి మ్యాచ్‌కు అమ్ముడుపోని టికెట్లు
ప్రకటనలకు ముందుకురాని కంపెనీలు
టెలివిజన్‌ వీక్షణలు సైతం తగ్గుముఖం?

ప్రపంచ క్రికెట్‌లో ‘భారత్‌-పాకిస్తాన్‌’ మ్యాచ్‌ ఓ సూపర్‌ బ్రాండ్‌. దాయాది దేశాలు ఎప్పుడు తలపడినా.. టికెట్లు హాట్‌ కేక్‌ కంటే వేగంగా అమ్ముడుపోతాయి. ఇరు దేశాల అభిమానుల భావోద్వేగాలను సొమ్ము చేసుకునేందుకు క్రికెట్‌ బోర్డు, ప్రసారదారు, ఐసీసీ ఎదురుచూస్తుంటాయి. కానీ ఈసారి సమీకరణం మారినట్టు అనిపిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినగా ఇరు దేశాలు ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి.
ఈ ఆదివారం భారత్‌, పాకిస్తాన్‌లో ఆసియా కప్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లో ఆడనుండగా.. అభిమానుల్లో ఎటువంటి ఆసక్తి లేదు, టీవీ ప్రకటనలకు కంపెనీలు ముందుకు రావటం లేదు, అసలు మ్యాచ్‌ టికెట్లే అమ్ముడుపోలేదు. భారత్‌, పాక్‌ క్రికెట్‌పై ఆసక్తి ఎందుకు తగ్గుతోంది?!.

నవతెలంగాణ – క్రీడావిభాగం
భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు ఎగబడే అభిమానులు.. ఆసియా కప్‌లో ఈ ఆదివారం (సెప్టెంబర్‌ 14)న దాయాదులు ఢీకొీట్టేందుకు సిద్ధమవుతుంటే ముఖం చాటేస్తున్నారు. నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోయే భారత్‌, పాక్‌ మ్యాచ్‌ టికెట్లు.. ఇప్పుడు అమ్ముడుపోవటం లేదు. భారత్‌, పాకిస్తాన్‌ అభిమానుల భావోద్వేగాలే పెట్టుబడిగా ఆసియా కప్‌ నిర్వహణతో భారీ ఆదాయం ఆశిస్తోన్న ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) సహా భారత క్రికెట్‌ నియంతణ్ర మండలి (బీసీసీఐ), పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కి ఈ పరిణామం మింగుడు పడటం లేదు. అభిమానుల్లో ఆసక్తి లేకపోవటంతో టెలివిజన్‌ ప్రకటనలు ఇచ్చేందుకు కార్పోరేట్‌ కంపెనీలు ముందుకు రావటం లేదు. అందుకు కారణాలను ఓసారి చూద్దాం.

ద్వైపాక్షిక సంబంధాల క్షీణత
భారత్‌, పాకిస్తాన్‌ సంబంధాలు ఈ ఏడాది మరింత క్షీణించాయి. పహల్గాం ఉగ్రదాడి, అనంతరం ఆపరేషన్‌ సింధూర్‌తో పొరుగు దేశాల ప్రజలు దాదాపుగా యుద్ధ వాతావరణంలోకి నెట్టబడ్డారు. ఈ ఘటనలు చోటుచేసుకుని ఏడాదైనా పూర్తి కాలేదు. పాకిస్తాన్‌తో ఎటువంటి సంబంధాలు ఉండకూడదని అతివాద వర్గాలు ప్రచారం చేశాయి. ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విపరీత నష్టం వాటిల్లింది. ఆసియా కప్‌ నిర్వహణ హక్కులు భారత్‌ సొంతం చేసుకున్నా.. పాకిస్తాన్‌ కోసం తటస్థ వేదిక యుఏఈలో టోర్నమెంట్‌ నిర్వహిస్తోంది.

స్టార్స్‌ లేక వెలవెల!
భారత క్రికెట్‌ సూపర్‌స్టార్స్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. గతంలో కోహ్లి, రోహిత్‌లతో షహీన్‌ షా అఫ్రిది, నషీం షా సవాల్‌ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. ఇదే సమయంలో పాకిస్తాన్‌ శిబిరంలోనూ స్టార్‌ క్రికెటర్లు లేరు. బాబర్‌ ఆజామ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌లను సెలక్షన్‌ కమిటీ పక్కనపెట్టింది. కొత్త ముఖాలతో ఆసియా కప్‌కు వచ్చిన పాకిస్తాన్‌పై పెద్దగా అంచనాలు లేవు. భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో ఉండాల్సిన స్టార్స్‌ సమరం ఇక్కడ స్పష్టంగా లోపించింది.

ఏకపక్షంగా మ్యాచులు
కొంతకాలంగా భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌లో టీమ్‌ ఇండియా ఏకపక్ష ఆధిపత్యం కనిపిస్తోంది. ఐసీసీ ప్రపంచకప్‌లో భారత్‌ వన్‌సైడ్‌ షో కొనసాగుతున్నా.. సమీకరణాలు మారతాయనే ఉత్సుకత, ఆసక్తి అభిమానుల్లో ఉండేది. ఇటీవల వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో భారత్‌, పాకిస్తాన్‌ 15 మ్యాచుల్లో తలపడగా అందులో 12 మ్యాచుల్లో టీమ్‌ ఇండియా గెలుపొందింది. 2023 ఆసియా కప్‌లో (వన్డే) పాకిస్తాన్‌పై భారత్‌ ఏకంగా 228 పరుగుల రికార్డు విజయం సాధించింది. భారత్‌ 50 ఓవర్లలో 356/2 పరుగులు చేయగా.. పాకిస్తాన్‌ 32 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ సమవుజ్జీల సవాల్‌ నుంచి టీమ్‌ ఇండియా ఏకపక్ష ఆధిపత్యానికి చేరుకుంది.

మూడు మ్యాచుల అత్యాశ
ఆసియా కప్‌లో ఇప్పటివరకు భారత్‌, పాకిస్తాన్‌ ఫైనల్లో పోటీపడలేదు. పొరుగు దేశాల క్రికెట్‌ మ్యాచ్‌కు కమర్షియల్‌ మార్కెట్‌ విలువ సొమ్ముచేసుకునేందుకు నిర్వాహకులు ఈ సారి టోర్నమెంట్‌ ఫార్మాట్‌లో మార్పులు చేశారు. దీంతో భారత్‌, పాకిస్తాన్‌ గరిష్టంగా మూడుసార్లు ముఖాముఖి తలపడే వీలుంది. భారత్‌, పాకిస్తాన్‌లు గ్రూప్‌ దశలో ఓసారి, సూపర్‌4లో మరోసారి.. కుదిరితే ఫైనల్లో ముచ్చటగా మూడోసారి ఆడాల్సి ఉంటుంది. దాయాదుల వరుస మ్యాచుల షెడ్యూల్‌ సైతం అభిమానుల్లో నిరాసక్తికి కారణం కావచ్చు.

భారీగా టికెట్‌ ధరలు
ఆదివారం దుబారు స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు గరిష్ట టికెట్‌ ధర రూ.2.5 లక్షలు కాగా.. సాధారణ గ్యాలరీ టికెట్‌ ధర రూ.10-15వేలుగా నిర్ణయించారు. టికెట్ల అమ్మకంలో అభిమానుల నిరాసక్తి తేటతెల్లం కావటంతో రికార్డు ధరలకు టెలివిజన్‌ ప్రకటనలు ఇచ్చేందుకు కార్పోరేట్‌ కంపెనీలు ముందుకు రావటం లేదు. భారత్‌, పాక్‌ 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ సహా 2019, 2023 ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు రికార్డు వీక్షణలు లభించాయి. ఈ ఏడాది ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో ఇరు దేశాలు తలపడగా అప్పుడూ అభిమానుల నుంచి గొప్ప స్పందన కనిపించింది. కానీ ఈసారి టీవీ రేటింగ్స్‌ భారీగా పడిపోయే సూచనలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -