పార్లమెంట్ రద్దుకు ఒప్పందం
51కి పెరిగిన మృతులు
నెమ్మదిగా చక్కబడుతున్న పరిస్థితులు
ఖాట్మాండు : నేపాల్ కొత్త ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి శుక్రవారం రాత్రి 8.45గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష కార్యాలయం సమాచార శాఖ అధికారి అర్చనా ఖడ్కా ఈ విషయాన్ని ధృవీకరించారు. దేశ తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా రికార్డు సృష్టించిన సుశీలా కర్కి ఇప్పుడు దేశ తొలి మహిళా ప్రధానిగాకూడా చరిత్ర సృష్టించనున్నారు. సోషల్ మీడియాపై నిషేధంతో తలెత్తిన నిరసన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలుగా రూపుదిద్దుకుని, హింసాత్మకంగా మారడంతో కె.పి.శర్మ ఓలి ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ముగింపు పలుకుతూ శుక్రవారం కొత్త ప్రధాని నియమితులయ్యారు. ఆందోళన చేసిన జనరేషన్ జడ్ నాయకులు, నేపాల్ ఆర్మీ, అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడల్ మధ్య సుదీర్ఘంగా, బృహత్తరంగా చర్చలు సాగిన అనంతరం ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా పార్లమెంట్‌ను రద్దు చేస్తారు.
ఎవరీ సుశీలా కర్కి ?
1952 జూన్ 7న విరాట్‌నగర్‌లో జన్మించిన సుశీలా కర్కి పొలిటికల్ సైన్స్, లాను అభ్యసించారు. 1972లో మహేంద్రా మొరాగ్ కేంపస్ నుండిబిఎ ఆర్ట్స్ చేసిన ఆమె తర్వాత 1975లో బనారస్ హిందూ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ చేశారు. తర్వాత 1978లో నేపాల్‌లోని త్రిభువన్ యూనివర్శిటీలో లా డిగ్రీ తీసుకున్నారు. అనంతరం న్యాయవాద వృత్తిని చేపట్టారు.
విద్యార్ధిగా వున్న సమయంలో ఆమెకు నేపాలీ కాంగ్రెస్‌తో అనుబంధం వుంది. అప్పుడు ఆ పార్టీ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతోంది. తర్వాత ఆమె తన ట్యూటర్ దుర్గా సుబేదినే వివాహం చేసుకున్నారు. ఆయన తన స్నేహితుడు, సంక్షోభ సమయాల్లో తన మార్గదర్శి అని ఆమె చెప్పుకుంటారు. 2006 చివరిలో ఆమె నేపాల్ సుప్రీం కోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో ఏడేళ్ళ తర్వాత ఆమె చీఫ్ జస్టిస్ పదవికి పదోన్నతి పొందారు. అయితే ఆమె పదవీకాలం వివాదాస్పదమైంది. నేపాలీ కాంగ్రెస్ ఆమెను తొలగించకపోయినా తన పార్లమెంట్ బలంతో ఆమెను ఆమెను అభిశంసించడానికి ప్రయత్నించింది.
రాజకీయ సంబంధాలు కలిగిన వారిని జడ్జిలుగా నియమించినందుకు ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఆమె తన వైఖరిని సమర్ధించుకున్నారు. ఒకసారి బెంచ్‌లోకి వచ్చిన తర్వాత తమ రాజకీయ బాంధవ్యాలను ఎవరైనా విడనాడాల్సిందేనని ఆమె అంటారు. అంతకుముందు సుశీలా కర్కికి జనరేషన్ జెడ్ నిరసనకారులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. అయితే మొత్తంగా పార్లమెంట్‌ను రద్దు చేయాలా వద్దా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెను అధికారికంగా నియమించడానికి ఏ రాజ్యాంగ నిబంధనను ఉపయోగించాలి, అలాగే పార్లమెంట్ రద్దు చేయాలా వద్దా అనే అంశంపై కూడా గందరగోళం నెలకొంది. నేపాల్ చీఫ్ జనరల్ అశోక్ సిగ్దేల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడల్ గురువారం అర్థరాత్రి న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు ప్రకటించాయి. శుక్రవారం ఉదయం 9గంటలకు ప్రారంభమవాల్సిన చర్చలు మధ్యాహ్నానికి ప్రారంభమయ్యాయి. ఎట్టకేలకు రాత్రికల్లా ఒక పరిష్కార మార్గం ఏర్పడింది. జస్టిస్ సుశీల్ కర్కి తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించేందుకు అన్ని వర్గాలు అంగీకరించాయని అధ్యక్షుడు పౌడెల్ ప్రధాన రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
రాజ్యాంగ పరిధిలోనే
ఈ పరిస్థితుల్లో దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రస్తుత రాజ్యాంగం పరిధిలోనే పరిష్కరించుకోవడానికి చర్యలు తీసుకోవాలని ప్రతినిధుల సభ స్పీకర్ దేవరాజ్ ఘిమిరె, నేషనల్ అసెంబ్లీ చైర్మన్ నారాయణ్ దహల్ తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రజల సార్వభౌమాధికారాన్ని, పౌర స్వేచ్ఛను, ప్రాదేశిక సమగ్రతను, దేశ ఐక్యతను, స్వాతంత్య్రాన్ని గౌరవిస్తూనే, పరిస్థితిని చక్కదిద్దడానికి అధ్యక్షుడు చర్యలు తీసుకుంటున్నారని వారు తెలిపారు. ఆందోళనకారుల డిమాండ్లను పరిష్కరించడానికి, మరింత పటిష్టమైన, సంపద్వంతమైన ప్రజాస్వామ్యానికి కట్టుబడి వుండాల్సిందిగా కూడా వారు అన్ని పార్టీలకు పిలుపిచ్చారు. అయితే, రిటైర్డ్ న్యాయమూర్తులు రాజకీయ లేదా రాజ్యాంగ పదవులను నిర్వహించడాన్ని నేపాల్ రాజ్యాంగం నిషేధిస్తోంది. దీనివల్ల అడ్డంకులు ఎదురవుతున్నాయి. అధ్యక్షుడు పౌడల్ తీసుకున్న వైఖరికి ప్రధాన రాజకీయ పార్టీలు కూడా మద్దతిస్తున్నాయి. మరోవైపు జనరేషన్ జడ్ ఉద్యమానికి లాంఛనంగా నాయకత్వం అంటూ లేకపోవడంతో వారిలో కూడా పలు అభిప్రాయాలు తలెత్తుతున్నాయి.
51కి పెరిగిన మృతులు
నేపాల్ ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 51కి చేరినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆందోళనల సమయంలో దేశవ్యాప్తంగా పలు జైళ్ల నుండి తప్పించుకున్న 12,500మందికి పైగా ఖైదీలు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారని పోలీస్ ప్రతినిధి బినోద్ ఘిమిరే తెలిపారు.
చక్కబడుతున్న పరిస్థితులు
నేపాల్ జన జీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. నెమ్మదిగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు పెచ్చరిల్లినపుడు ధ్వంసమైన పోలీస్‌స్టేషన్లు, చెక్‌పోస్టులు తిరిగి కార్యకలాపాలు మొదలెట్టాయని అధికారులు తెలిపారు. నేపాల్ పోలీసులు, సాయుధ పోలీస్ దళ సిబ్బంది యధావిధిగా తమ కార్యకలాపాలను పునరుద్ధరించారని ఖాట్మండు లోయ పోలీస్ కార్యాలయం పేర్కొంది. అలాగే ఆందోళనల్లో తీవ్రంగా నష్టపోయిన సుప్రీంకోర్టు, బ్యాంకులు కూడా దశలవారీగా తమ కార్యకలాపాలను పునరుద్ధరిస్తాయని అధికారులు చెప్పారు. చాలా చోట్ల కర్ఫ్యూను సడలించారు.