మణిపూర్ పర్యటనకు ముందు నేతల మూకుమ్మడి రాజీనామా
ఇంఫాల్ : మణిపూర్‌లో పర్యటించబోతున్న ప్రధాని నరేంద్ర మోడీకి సొంత పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను నాయకత్వం పట్టించుకోవడం లేదని, పార్టీ రాష్ట్ర కమిటీలో ఐకమత్యం కొరవడిందని ఆరోపిస్తూ ఫుంగ్యార్ మండలానికి చెందిన 43 మంది బీజేపీ సభ్యులు పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు మూకుమ్మడి గా రాజీనామాలు చేశారు. వీరిలో వివిధ మోర్చాలకు చెందిన వారు కూడా ఉన్నారు. రాష్ట్ర బీజేపీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న నగచోమ్నీ రాంషాంగ్ నేతృత్వంలో వీరందరూ రాజీనామాలు సమర్పించా రు. వీరిలో ఫుంగ్యార్ మండల బీజేపీ అధ్యక్షుడు, మహిళా మోర్చా అధ్యక్షురాలు, యువ మోర్చా అధ్యక్షుడు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు, ఎస్టీ మోర్చా కార్యవర్గ సభ్యుడితో పాటు 53 మంది బూత్ స్థాయి అధ్యక్షులు కూడా ఉన్నారు. రాష్ట్ర పార్టీలో నెలకొన్న పరిస్థితులపై వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక నాయకత్వంలో సంప్రదింపులు కొరవడ్డాయని, కార్యకర్తలంటే గౌరవం లేకుండా పోయిందని ఆరోపించారు. పార్టీ సిద్ధాంతాలకు తాము ఎప్పుడూ విధేయులమేనని, కానీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల పట్ల వ్యవహరిస్తున్న తీరు కారణంగా తామంతా ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. ప్రధాని మోడీ శనివారం మణిపూర్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో జరిగిన రాజకీయాలు రాజకీయ ప్రకంపనలు రేపాయి. కొండ ప్రాంతంలోనూ, లోయలోనూ జరుగుతున్న అభివృద్ధిలో చోటుచేసుకున్న అసమానతలను ప్రధాని దృష్టికి తెచ్చేందుకే వీరు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే రాజీనామా చేసిన వారంతా 2022 శాసనసభ ఎన్నికల సమయం నుంచే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర కమిటీ చెబుతోంది. ఈ రాజీనామాలు ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఉద్దేశించినవేనని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయడానికే వారు ఈ డ్రామా ఆడారని మణిపూర్ బీజేపీ ఉపాధ్యక్షుడు అవుంగ్ షిమ్రే హాపింగ్‌సన్ ఆరోపించారు.