Saturday, September 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుగోదావరి తీరప్రాంతాల్లో పుష్కర ఏర్పాట్లు చేయండి

గోదావరి తీరప్రాంతాల్లో పుష్కర ఏర్పాట్లు చేయండి

- Advertisement -

ఏకకాలంలో రెండులక్షల మంది స్నానాలు చేసేలా ఘాట్ల నిర్మాణాలు
శాశ్వత ప్రాతిపదికగా అభివృద్ధి పనులు..ఆలయాలనూ తీర్చిదిద్దండి
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గోదావరి తీరప్రాంతాల్లో పుష్కరాల ఏర్పాట్లను శాశ్వత ప్రాతిపదికగా చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఏకకాలంలో రెండులక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. 2027 జులై 23వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయనీ, ఇప్పటి నుంచి 22 నెలల వ్యవధి ఉన్నందున శాశ్వత మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ముందస్తు సన్నాహకాలపై శుక్రవారంనాడిక్కడి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ధార్మిక సలహాదారు గోవిందహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్కరాల ప్రణాళికల్ని అధికారులు సీఎంకు వివరించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీర ప్రాంతముందని తెలిపారు. దాదాపు 74 చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముంటుందని అధికారులు ముఖ్యమం త్రికి వివరించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ గోదావరి తీరం వెంట ఏకకాలంలో రెండు లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించేలా ఘాట్ల నిర్మాణాలు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలన్నారు.

బాసర నుంచి భద్రాచలం వరకు ధర్మపురి, కాళేశ్వరం వంటి ప్రధాన ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలనీ, పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. యాత్రీకులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు కలగడానికి వీల్లేదని, రోడ్ల నిర్మాణం మొదలు, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలనీ, వాహనాల పార్కింగ్‌, తాగు నీరు, స్నానాల ఘాట్లు, వసతి సౌకర్యాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఆలయ కమిటీలు, అధికారులతో చర్చించాలనీ, మహా కుంభమేళాతో పాటు గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవం ఉన్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని చెప్పారు. గోదావరి తీరం వెంట ఉన్న అన్ని ఆలయాలనూ సందర్శించి వేర్వేరుగా ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేసుకోవాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వచ్ఛభారత్‌, జల్‌జీవన్‌ మిషన్‌ సహా అందుబాటులో ఉన్న అన్ని కేంద్ర పథకాలనూ సమన్వయం చేసుకుంటూ, నిధుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పర్యాటక, నీటి పారుదల, దేవాదాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -