Saturday, September 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుభవిష్యత్తు సోషలిజానిదే

భవిష్యత్తు సోషలిజానిదే

- Advertisement -

పెట్టుబడి శాంతిని సృష్టించదు..నిరుద్యోగ సమస్యను తగ్గించదు
ప్రమాదంలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, ఫెడరలిజం
వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత వామపక్ష, లౌకిక శక్తులదే
దేశంలో వామపక్షాల ఐక్యత అత్యావశ్యకం
మార్క్సిస్టు భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లిననేత సీతారాం ఏచూరి
ఆయన ఆశయస్ఫూర్తితో ముందుకెళ్దాం : ఏచూరి ప్రథమ వర్థంతి సభలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘పెట్టుబడి దారీ వ్యవస్థ సమాజంలో శాంతిని సృష్టించదు. దేశంలోని నిరుద్యోగ సమస్యను తగ్గించదు. ఉపాధి చూపదు. ఆర్థిక అసమానతలను తగ్గించదు. ఇది నిజం. అంతిమంగా భవిష్యత్తు సోషలిజానిదే. అయితే, కొత్తతరంలో స్ఫూర్తిని నింపాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, ఫెడరలిజం ప్రమాదంలో పడ్డాయి. ఎమర్జెన్సీ రోజుల్లో కంటే ఎక్కువగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. భూస్వామ్య, రాచరిక వ్యవస్థలు రావాలని బీజేపీ కోరుకుంటున్నది. ఇలాంటి సమయంలో సోషలిస్టు వ్యవస్థ కోసం వామపక్షాల కృషి మరింత పెరగాలి. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత వామపక్ష, లౌకిక శక్తులదే. ఇలాంటి తరుణంలో దేశంలో వామపక్షాల ఐక్యత అత్యావశ్యకం’ అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్థంతి సభను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత ఏచూరి చిత్రపటానికి బీవీ.రాఘవులు పూలమాల వేసి నివాళి అర్పించారు. సీతారాం ఏచూరి, కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మరణానికి సంతాప సూచకంగా సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది.

అనంతరం నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురించిన ‘ఓ సోషలిస్టు ఆచరణ పథం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత రాఘవులు మాట్లాడుతూ…బీజేపీ ఫాసిస్టు, మతోన్మాద ధోరణి నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భారత రాజకీయాల్లో పెనుమార్పులు, పెడధోరణలు వస్తున్న తరుణంలో అభ్యుదయ, లౌకిక, ప్రజాస్వామ్యశక్తుల పాత్రను ముందుకు తీసుకెళ్లడంలో ఏచూరి లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఏచూరి మార్క్సిస్టు భావజాలాన్ని ముందు కు తీసుకెళ్ళారనీ, ఆయన స్ఫూర్తితో యువతరం ముందుకు కదలాలి అని పిలుపునిచ్చారు. ఏచూరి మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని చెప్పారు. దేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలను పోటీచేయకుండా, ఉన్నవారిని పదవీచితులను చేసే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రమాదాన్ని దేశ ప్రజలకు వివరించి చెప్పడంతో పాటు మరింత చైతన్యం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఎన్ని భిన్నత్వాలు ఉన్నా ప్రతిపక్షాలన్ని బీజేపీకి వ్యతిరేకంగా ఒకతాటిపైకి వచ్చాయంటే వామపక్షాలు, అందులోనూ సీతారాం ఏచూరి వల్లే సాధ్యమైందన్నారు. సంఘపరివార్‌ ఏకత్వం తప్ప భిన్నత్వం ఉండకూడదని చెబుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మతాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగాన్నీ, అన్ని ప్రభుత్వ వ్యవస్థలను మార్చుకుంటూ పోతున్న తీరును ఎండగట్టారు.

ఏచూరి నాలెడ్జ్‌, విజన్‌ పర్సన్‌ : సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌ పాషా
సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ అజీజ్‌ పాషా మాట్లాడుతూ..విద్యార్థి ఉద్యమం నుంచి ఏచూరితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. పార్లమెంట్‌లో ఒకేసారి రాజ్యసభ సభ్యులుగా కొనసాగామనీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను అందరికీ అర్థమయ్యేలా పార్లమెంట్‌ సాక్షిగా ఎండగట్టేవారని గుర్తుచేశారు. కమ్యూనికేషన్‌, టూరిజం, కల్చరల్‌ పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మెన్‌గా ఆయన అందించిన సేవలను గుర్తుచేశారు. 120కిపైగా దేశాలు పాల్గొన్న ఏథెన్స్‌ ఇంటర్నేషన్‌ కమ్యూనిస్టుల సభలో ఏచూరి డ్రాప్టింగ్‌ కమిటీ మెంబర్‌గా ఉన్నారనీ, తాను ప్రతినిధిగా హాజరయ్యానని చెప్పారు. ఏచూరికి సాహిత్యంపై మంచి పట్టు ఉండేదన్నారు. ఆర్ట్‌, సాహిత్యం, సంగీతం, రాజకీయం ఇలా అన్ని అంశాలపై పట్టున్న నాలెడ్జ్‌, విజన్‌ పర్సన్‌ ఏచూరి అని కొనియాడారు.

జాతీయోద్యమంలో కమ్యూనిస్టులది కీలక పాత్ర : సీపీఐ(ఎంఎల్‌) – ప్రజాపంథా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు
కార్మికులను, రైతులను ఒక్కటి చేసి జాతీయోద్యమంలో పాల్గొనేలా చేయడంలో కమ్యూనిస్టులది కీలక పాత్ర అని సీపీఐ(ఎంఎల్‌)-ప్రజాపంథా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు చెప్పారు. జాతీయోద్యమంతో సంబంధం లేనివారు నేడు దేశభక్తి గురించి గొప్పగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో ఫాసిస్టు ధోరణులు బుసలు కొడుతున్న తరుణంలో ఏచూరి లాంటి నేత మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఏచూరి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అన్నారు. కులం, మతం, ప్రాంతం పేర మనుషుల మధ్య విభజనలు సృష్టించి విద్వేషాల మీద మోడీ సర్కారు నడుస్తున్నదని విమర్శించారు.

దేశంలో విభజన రాజకీయాలు : సీపీఐ(ఎంల్‌) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చలపతిరావు
దేశంలో రైతు, కార్మిక ఉద్యమాలపై తీవ్ర నిర్బంధం కొనసాగుతుండటం పట్ల సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చలపతిరావు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు ఖనిజవనరులను దోచిపెట్టేందుకు ఆపరేషన్‌ కగార్‌ పేరిట ఆదివాసీలను మోడీ సర్కారు చంపిస్తున్నదని ఆరోపించారు.

కమ్యూనిస్టులు ఏకం కావాలి : ఎంసీపీఐ పొలిట్‌ బ్యూరో సభ్యులు ఉపేందర్‌రెడ్డి
దేశంలో కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఎంసీపీఐ పొలిట్‌ బ్యూరో సభ్యులు ఉపేందర్‌రెడ్డి అన్నారు. ప్రజల విశ్వాసాన్ని మరింత చూరగొనాలనీ, పార్లమెంట్‌లోపలా, వెలుపలా పోరాటాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు.

ఓట్ల దొంగతనంతో గెలిచే పనిలో మోడీ : సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌రాజా
ఓట్ల దొంగతనంతో తన అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకునే పనిలో బీజేపీ ఉందని సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌రాజా విమర్శించారు. బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భావజాలరంగంలో ప్రత్యామ్నాయ సంస్కృతిని తీసుకుని ముందుకు పోవాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు.

దేశంలో అధ్యక్షతరహా పాలన తెచ్చే కుట్ర :ఆర్‌ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు
దేశంలో అధ్యక్ష తరహా పాలన తెచ్చే కుట్ర జరుగుతున్నదని ఆర్‌ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు విమర్శించారు. సీబీఐ, ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థలను మోడీ సర్కారు తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నదని ఆరోపించారు. బీజేపీ ప్రధాన శత్రువు కమ్యూనిస్టులేనని విమర్శించారు. ఇలాంటి తరుణంలో కమ్యూనిస్టులంతా ఐక్యమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి : ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకులు మురహరి
ప్రమాదంలో పడ్డ రాజ్యాంగాన్ని రక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకులు మురహరి నొక్కి చెప్పారు. ఇండియా అనేక జాతుల సమూహమనీ, ఇక్కడ ఒకేజాతి, ఒకే ఎన్నిక, ఒకే భాష అంటే నడవదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌, టి.సాగర్‌, ఎమ్‌డీ అబ్బాస్‌, బండారు రవికుమార్‌, సీపీఐ(ఎం) హైదరాబాద్‌ నగర కార్యదర్శి ఎం.వెంకటేశ్‌, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి యాదయ్య, మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి సూర్యం, తదితరులు పాల్గొన్నారు.

సెక్యులరిజం, సోషలిజం చుట్టే స్వాతంత్య్ర ఉద్యమం
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం

రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం పదాలను తీసేయాలని కొందరు మాట్లాడటాన్ని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం రాసిననాడు ఆ పదాలు లేకపోవచ్చుగానీ ఆ రెండు పదాల చుట్టే దేశ స్వాతంత్య్ర ఉద్యమం నడిచిందని గుర్తుచేశారు. ప్రభుత్వ పాలనలో, విద్యలో, రాజకీయాల్లో మతం జోక్యం ఏంటని ప్రశ్నించారు. రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదం లేకుంటే దేశం ఒక్కటిగా ఉండేదా? అని అడిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -