క్షేత్రస్థాయిలో వ్యాపార లావాదేవీలను పర్యవేక్షించండి : వాణిజ్య పన్నుల శాఖపై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వాణిజ్య పన్నులశాఖకు సంబంధించి ఆదాయం కోల్పోతున్న విభాగాలు, ప్రాంతాలను తక్షణమే గుర్తించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరుతోపాటు వ్యాపార లావాదేవీలను హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఇదే అంశంపై శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి ప్రతీ పదిహేను రోజులకొకసారి వాణిజ్య పన్నులశాఖ పనితీరు, పన్నుల పురోగతిపై తాను సమీక్ష నిర్వహిస్తానని ఆయన చెప్పారు. జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్ వల్ల రాష్ట్రం ఎంత ఆదాయం కోల్పోతోందనే అంశంపై క్షుణ్నంగా అధ్యయనం నిర్వహించి, ఒక నివేదికను సమర్పించాలంటూ సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు వీలుగా యావత్ యంత్రాంగం కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.
జీఎస్టీ ఎగవేత దారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. నిఘా వ్యవస్థ నిరంతరం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ఆదాయానికి గండి పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఉన్నత స్థాయి అధికారులు నిత్యం ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పర్యవేక్షించాలని ఆదేశించారు. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే లావాదేవీలు, పన్ను వసూళ్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కోరారు. వాణిజ్య పన్నుల శాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆడిట్ తదితర విభాగాల్లో సాధించిన ప్రగతిని గతేడాదితో పోల్చి ఆయన సమీక్షించారు. ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ శాఖలో అంతర్గత కమిటీలు వేసి అధ్యయనం చేయాలనీ, తద్వారా నివేదికను సమర్పించాలని సూచించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, కమిషనర్ హరిత తదితరులు పాల్గొన్నారు.