ఆస్పత్రి ఎదుట మృతుల కుటుంబీకులు, కార్మిక సంఘాల బైటాయింపు
భారీ వర్షాన్నీ లెక్కచేయకుండా నిరసన
ఈ ఘటనకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలి : సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ-బోధన్
ట్రాక్టర్‌పై తీసుకెళ్తున్న విద్యుత్ స్తంభాలు మీదపడి మృతిచెందిన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బిక్నేల్లి గ్రామ పంచాయతీ కార్మికులు బగారే యాదు, బగారే బాలాజీ కుటుంబాలకు న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, సీపీఐ(ఎంఎల్), ఏఐకేఎంఎస్, టీయూసీఐ, ఐఎఫ్టీయూ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు బాధిత కుటుంబాలతో కలిసి బోధన్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి మార్చురీ వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నూర్జహాన్ మాట్లాడుతూ.. విద్యుత్ స్తంభాలను సంబంధిత కాంట్రాక్టర్ తీసుకెళ్లాల్సి ఉంటే.. వాటిని జీపీ కార్మికులతో టాక్ట్రర్‌పై తీసుకెళ్లమని గ్రామపంచాయతీ కార్యదర్శి కార్మికులకు పురమాయించారని, దీనికి పంచాయతీ కార్యదర్శే పూర్తి బాధ్యత వహించాలని, ఆయన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా, రెండు ఎకరాల భూమి లేదా ఇంటి స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకొని అతని వద్ద నుంచి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.
వర్షంలోనే నిరసన..
నిరసన చేస్తున్న క్రమంలో వర్షం ప్రారంభమైనా బాధిత కుటుంబీకులు, కార్మిక సంఘాల నాయకులు ధర్నా విరమించకుండా గంటపాటు నిరసన కొనసాగించారు. దాంతో బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ, రూరల్ సీఐ విజయబాబు అక్కడికి చేరుకుని నిరసన చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ వద్దకు సబ్ కలెక్టర్ వచ్చి పూర్తి హామీ రాతపూర్వకంగా ఇస్తేనే ఆందోళన విరమిస్తామని కార్మిక సంఘాల నాయకులు, బాధిత కుటుంబాలు పట్టుపట్టారు. దాంతో బోధన్ తహసీల్దార్‌కు సమాచారం ఇవ్వగా తహసీల్దార్ విట్టల్‌తో పాటు ఎంపీడీవో మధుకర్ అక్కడకు వచ్చి వారి డిమాండ్లను తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున రావలసిన నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. తాత్కాలిక వర్కర్‌గా పనిచేసిన మృతుడు యాదుకు బోధన్ పట్టణంలో రెండు ప్లాట్లను, మృతుడు బాలాజీ కుటుంబానికి ఒక్క ఫ్లాట్ మంజూరు చేస్తామని, అలాగే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని, ఆర్థికపరమైన సహాయం చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని తహసీల్దార్ తెలిపారు. బాధిత కుటుంబాలను హాస్పిటల్ వద్ద పరామర్శించడానికి పలు రాజకీయ పార్టీల నాయకులు తరలివచ్చారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని అధికార పార్టీ నాయకులు ఫోన్‌లో సంప్రదించి వివరాలు తెలపగా.. బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు నాయకులు తెలిపారు. మృతుడు యాదు భార్యకు, మృతుడు బాలాజీ కూతురికి కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పిస్తామని, అలాగే జిల్లా కలెక్టర్ నిధుల నుంచి ప్రత్యేకార్థిక సహాయం చేస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చినట్టు నూర్జహాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, నాగేశ్వరరావు, నన్నేసాబ్, జంగం గంగాధర్, సీపీఐ(ఎంఎల్) నాయకులు మల్లేష్, ఏఐకేఎంఎస్ నాయకులు సీతారాం, ఐఎఫ్‌టీయూ నాయకులు పోశెట్టి, టీయూసీఐ నాయకులు సుధాకర్, గ్రామపంచాయతీ కార్మిక సంఘం అధ్యక్షులు సాగర్, పోశెట్టి, రాజేశ్వరి, నజీర్, సాయిలు, అర్బాస్ తదితరులు పాల్గొన్నారు.