Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీసీ వ్యతిరేకి బీజేపీ

బీసీ వ్యతిరేకి బీజేపీ

- Advertisement -

జనాభాకు తగ్గట్టు రాజకీయ ప్రాతినిధ్యం దక్కనీయట్లే
రిజర్వేషన్‌లు కల్పిస్తలే.. ఇస్తే అడ్డుకుంటుంది
బహిరంగ సభలో కొత్త సంక్షేమ పథకాలు ప్రకటిస్తాం :పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకటి శ్రీహరి

నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘రాష్ట్రంలో ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత ప్రాతినిధ్యం కల్పించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుంది. బీసీల సంక్షేమానికి మేము తాపత్రయపడుతుంటే అందుకు విరుద్ధంగా బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. జనాభాకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లు కేంద్రం అమలు చేయట్లేదు. చేస్తే అడ్డుకుంటుంది’ అని పశుసంవర్ధక, మత్స్య, క్రీడా యువజన శాఖ మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్‌ కృత జ్ఞత సభ నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశాలకు శుక్రవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రూరల్‌ క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా రాహుల్‌ గాంధీ చేసిన పాదయాత్ర సమయంలో పార్లమెంట్‌, అసెంబ్లీ గడపదొక్కని వెనుకబడ్డ జాతులు ఉన్నట్టు గుర్తించారని, అందుకే ‘దేశంలో ఎవరి జనాభా ఎంత ఉందో చట్టసభల్లో వారికి అంతే భాగస్వామ్యం’ కల్పించాలనే సంకల్పం తీసుకున్నారని తెలిపారు.

ఆయన సూచిన మేరకే సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కుల గణనను శాస్త్రీయబద్ధంగా చేపట్టి లెక్క తేల్చారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ద్వారా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. అనాడు తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు కోసం జయలలిత కోరగా.. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆమోదించినట్టు గుర్తుచేశారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు. చట్టబద్ధంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ ద్వారా ఆర్డినెన్స్‌ రూపొందించామని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ల పరిమితి ఎత్తివేశామని తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేసుకునేందుకు ఆయా రాష్ట్రాలకే అధికారం ఇవ్వాలని సూచించారు.

కులగణన చేపట్టిన వివరాలు ఎక్కడా దాచిపెట్టలేదని.. పబ్లిక్‌ డోమైన్‌లో ఉంచామని తెలిపారు. రాష్ట్రంలో ఎంత మంది చదువుకున్నారు..? ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారు? ఇలా ప్రతి ఒక్కరి వివరాలు రూపొందించి అందుబాటులో పెట్టినట్టు చెప్పారు. యూరియా సరిపడా పంపడంలో కేంద్రం తాత్సారం చేస్తుందని ఫలితంగా రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని అన్నారు. అయినా స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేలా పరిపాలించిందని.. కానీ ప్రజా ప్రభుత్వం అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తుందని ముదిరాజ్‌, బెస్త కులస్తుల విషయమై ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ సమావేశంలో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పాడిపరిశ్రమ కార్పొరేషన్‌ చైర్మెన్‌ గుత్త అమిత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మానాలమోహన్‌రెడ్డి, నాయకులు గడుగు గంగాధర్‌, శేఖర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -