Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంత్రిబుల్‌ ఆర్‌ భూ నిర్వాసితుల పోరాటానికి అండగా ఉంటాం

త్రిబుల్‌ ఆర్‌ భూ నిర్వాసితుల పోరాటానికి అండగా ఉంటాం

- Advertisement -

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం,మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
చౌటుప్పల్‌లో త్రిబుల్‌ ఆర్‌ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా


నవతెలంగాణ-చౌటుప్పల్‌
త్రిబుల్‌ ఆర్‌ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అండగా ఉంటామని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ ఆర్డీఓ కార్యాలయం ఎదుట త్రిబుల్‌ ఆర్‌ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో వారు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓఆర్‌ఆర్‌కు 40 కిలోమీటర్ల పరిధిలో ట్రిబుల్‌ ఆర్‌ నిర్మాణం జరగాల్సినప్పటికీ కొన్ని కార్పొరేట్‌ కంపెనీల ఒత్తిడితో ప్రభుత్వాలు అలైన్‌మెంట్‌లో మార్పులు తీసుకువచ్చారన్నారు. గతంలో చేసిన అలైన్‌మెంట్‌ మార్చడంలో ఎవరికి లబ్ది చేకూర్చుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తరతరాలుగా భూములు సాగుచేసుకుంటున్న రైతులు తమ భూములు త్రిబుల్‌ ఆర్‌ నిర్మాణంలో కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ బడా పరిశ్రమ ఒత్తిడితోనే త్రిబుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు తెచ్చారని, ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ల వైపు మొగ్గుచూపడం దారుణమన్నారు.

భూసేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వాలని, లేదంటే మార్కెట్‌ ధర ప్రకారంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ద్ణుఖాన్ని మిగిల్చి, కొంతమంది బడా వ్యాపారవేత్తలకు సంతోషం మిగిల్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టవద్దన్నారు. రైతుల పక్షాన పార్టీలకతీతంగా పోరాడుతామని తెలిపారు. ఈ క్రమంలో ధర్నా చేస్తున్న ప్రాంతం నుంచి భూ నిర్వాసితులు జాతీయ రహదారిపై పోలీసులు ఏర్పాటుచేసిన బారీకేడ్లను తొలగించి బైటాయించారు. భూనిర్వాసితులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. దాంతో ఆందోళనకారులను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, రైతుసంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, రాష్ట్రకమిటీ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మెన్‌ చింతల దామోదర్‌రెడ్డి, సీపీఐ(ఎం), బీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ నాయకులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -