ఆందోళనలో రైతులు
నవతెలంగాణ – మల్హర్ రావు
ఆరుకాలం శ్రమించి పంటలు సాగుచేస్తున్న రైతులకు పంట చేతికొచ్చేదాకా నమ్మకం లేకుండా పోతోంది. ఈ ఏడాది భారీ వర్షాలు కురవ కపోయినా మండల వ్యాప్తంగా రైతులు మెట్ట ప్రాంతాల్లో పత్తి పంట సాగు చేశారు. అడపాద డపా కురిసిన వర్షాలకు పత్తిచేలు ఏపుగా పెరిగాయి. దీంతో తాము ఆశించిన దిగుబడి వస్తుందని రైతన్నలు ఆనందపడుతున్న సమయంలోనే పత్తిచేలు ఎర్రబారుతూ ఆకులు రాలిపోతున్నాయని, చేలు ఎర్రబారకుండా ఉండేందుకు రకర కాల మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకుండా పోతోందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
3500 ఎకరాల్లో పత్తి సాగు…
మండలంలోని 15 గ్రామాల్లో ఈ ఏడాది రైతులు మొత్తం 3,500 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. అయితే పంట ఎదుగుదలకు అవసరమైన రసా యన ఎరువులతోపాటు చీడపీడల నివారణ మందులు పిచికారీ చేశారు. దీంతో ఎప్పుడూలేనంతగా మొక్కలు బలంగా ఏపుగా పెరిగాయి.
ఎర్రనల్లి పురుగు బెడద…
గత పదిహేను రోజుల కాలంగా పత్తిచేలపై ఎర్రనల్లి పురుగుల ఉధృతి పెరిగింది. దీంతో మొక్కల ఆకులు వాడిపోయి చేలంతా ఎర్రబడిపోయి రోజురోజుకు ఆకులు రాలిపోతున్నాయి. దీని నివారణకు రైతులు ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు, వ్యవసాయ అధికారులు సూచనల ప్రకారం వారంలో ఒకటి, రెండు మార్లు మందుల పిచికారీ చేశారు.అయినా పంట మాత్రం అలాగే ఎర్రబారి కనిపిస్తోంది. తెగుళ్ల నివారణ కోసం మందులు పిచికారీ చేస్తే పెట్టుబడులు పెరుగుతున్నాయి తప్ప ఎన్ని మందులు కొట్టినాఎలాంటి ప్రయోజనం ఉండడం లేదని రైతులు వాపోతున్నారు.సంబంధిత వ్యవసాయ అధికారులు ఎర్రబారుతున్న పత్తి పంటలని పరిశీలించి దాని నివారణ చర్యలకు తగిన సూచనలు ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు.