– చెవిలో పువ్వు – చేతిలో చిప్పతో నిరసన వ్యక్తం
– మద్దతుగా ప్రసంగించిన సీఐటీయూ నేత అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న దినసరి కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, కార్మిక సంఘాల జేఏసీ ని చర్చలకు పిలిచి సమ్మె విరమణకు ప్రభుత్వ అధికారులు చొరవ చూపాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ కోరారు. శనివారం అనంతారం ఆశ్రమ పాఠశాల ఎదుట దినసరి కార్మికుల సమ్మె శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. సమ్మె రెండవ రోజు దినసరి కార్మికులు చెవిలో పువ్వు చేతిలో చిప్ప తో తమ నిరసన తెలియజేశారు.
అనంతరం అర్జున్ మాట్లాడుతూ.. హాస్టల్ ఆశ్రమ పాఠశాలలో దినసరి కార్మికులుగా పనిచేస్తూ వారి సమస్యల పరిష్కారానికి దశలవారీగా అనేక ఆందోళనలు పోరాటాలు ఫలితం గానే నేడు రూ.26 వేలు పొందుతున్నారని అన్నారు.తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మిక కష్టజీవులు సమస్యలు పరిష్కరిస్తామని ధర్నాలు చేసే పని ఉండదని ఎన్నికల వాగ్ధానాలు ఇచ్చి ఇప్పుడు కార్మికుల వేతనాలు పెంచక పోగా సగం పైగా తగ్గించడమేనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విధానమని ప్రశ్నించారు.కార్మికుల అసంతృప్తి పెరగక ముందే కార్మిక నాయకులను చర్చలకు పిలిచి పాత వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బత్తుల శ్రీను, వెంకటేశు,లక్ష్మీ,మంగ,సీత తదితరులు పాల్గొన్నారు.