త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలకు అధికార బీఆర్‌ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించి అన్ని పార్టీలను కలవరానికి గురి చేసింది. వామపక్షాలతో సర్దుబాటు అంటూనే ఒక సీటు వదలకుండా తమ అభ్యర్థులను ప్రకటించేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోనూ టికెట్ల పంచాయితీ మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇప్పటికే అధిష్టానం బలమైన అభ్యర్థుల కోసం జల్లెడ పడుతోంది. ఇదీలా ఉంటే క్షేత్రస్థాయిలో తమదే టికెట్ అంటూ పలువురు నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. అధికార బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్‌లో కుదుపు మొదలైంది. తమకు టికెట్ కేటాయించాలని ఆశావాదులు ఒక్కొక్కరు గాంధీభవన్ మెట్లెక్కుతున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరిని వరించేనో..?
టికెట్ కేటాయించాలని అధిష్టానానికి మొదటి దరఖాస్తు గాంధీ భవన్‌కు కార్యకర్తలతో తరలి వెళ్లిన దండెం రాంరెడ్డి టికెట్ తనదేనంటున్న మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో మర్రి నిరంజన్ రెడ్డి దిగనున్నట్టు ప్రచారం రసవత్తర రాజకీయంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయం
నవతెలంగాణ రంగారెడ్డి ప్రతినిధి
టికెట్ ఆశిస్తున్న దండె రాంరెడ్డి అధిష్టానానికి మంగళవారం దరఖాస్తు చేసుకున్నాడు. భారీ స్థాయిలో ప్రజా సమీకరణలతో గాంధీభవన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. ఇబ్రహీంపట్నం టికెట్ కేటాయించాలని పీసీసీకి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి అదిష్టానానికి మొదటి దరఖాస్తు రాంరెడ్డిదే. ఇటీవల ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అధిష్టానం ఇచ్చిన పిలుపులను అమలు చేస్తున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం టికెట్ తమకే దక్కుతుందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి గట్టి ఆశలే పెట్టుకున్నారు. ఆదిభట్ల సర్పంచ్‌గా, ఇబ్రహీంపట్నం ఎంపీపీగా పని చేశారు. ప్రస్తుతం ఆదిభట్ల కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు ఆయన సతీమణి మర్రి నిత్యనిరంజన్ రెడ్డి మంచాల జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఎంఎన్‌ఆర్ పేరుతో సేవా కార్యక్రమాలను ఉధృతం చేశారు. యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్ మండలాల్లోనూ ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన సైతం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా కొనసాగుతున్న నేపథ్యంలో తనకే ఇబ్రహీంపట్నం టికెట్ వస్తుందని ఆశాభావం చేస్తున్నారు. ఒకవేళ టికెట్ రాకున్నా బరిలో నిలిచేందుకు తన ఏర్పాట్లలో తను ఉన్నట్లుగా నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. గత మూడు పర్యాయాలు ఓటమిపాలైన మల్‌రెడ్డి రంగారెడ్డిసైతం ఈ సారి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పైనే పోటీ చేయనున్నట్టు ప్రకటిస్తున్నారు. ఈయనకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండుంది. ఈయన దాదాపు టికెట్ ఖాయమన్న రీతిలో ఉన్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తీగల కృష్ణారెడ్డిపైన ఓటమి పాలయ్యారు. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన క్యామ మల్లేష్‌పై మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరుడైన మల్‌రెడ్డి రాంరెడ్డిని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయించారు. ఇటు రెబల్, అటు కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించినప్పటికీ కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా టికెట్ చేజార్చుకున్నారు. దాంతో బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయినా 376 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన ఇబ్రహీంపట్నం బరిలో నిలవనున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హస్తం గుర్తు ఎవరికి వచ్చిన వారికే ప్రచారం చేస్తామని ప్రకటిస్తున్నారు. త్రిముఖ పోరులో టికెట్ ఎవరిని వరిస్తుందోనని కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.