రగులుతున్న బసవన్నగుట్ట

– భూ యజమానులు, గ్రామస్తుల మధ్య ఆధిపత్య పోరు
– చట్ట ప్రచారం కోనుగోలు చేశామంటున్న రియాల్టర్లు
– సంవత్సరాల తరబడి కాస్తు చేస్తున్నామంటున్న గ్రామస్తులు
– 2008లో ఓఆర్సీ ద్వారా భూ కొనుగోలు
– 2009లోనే రద్దు చేయించామంటున్న గ్రామస్తులు
– సదరు భూముల్లో అక్రమంగా ఆలయ నిర్మాణం
నవతెలంగాణ రంగారెడ్డి ప్రతినిధి
మలిశెట్టిగూడ రెవెన్యూ పరిధిలోని బసవన్న గుట్ట భూ వివాదం రగులుతోంది. ఈ భూమి తమదంటే తమదేనని ఇరు వర్గాలు ఘర్షణకు దిగుతున్నాయి. ఒకరు ఓఆర్సీ ద్వారా కొనుగోలు చేశామని చెబుతుంటే, మరొకరు ఏండ్ల తరబడి ఈ భూమి గ్రామస్తుల ఆస్తీగా అనుభవిస్తున్నామంటున్నారు. ఈ తరుణంలో ఆ భూమి మీదకు వచ్చేందుకు సదరు భూ యజమానికి చెందిన వారసులు, కొనుగోలు దారులను గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. అంతే కాదు అక్రమంగా ఆ భూమిలో ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. కొనుగోలుదారులను హద్దులు కూడా ఏర్పాటు చేసుకోకుండా అడ్డు పడుతున్నారు. దాంతో ఈ భూ పంచాయతీ చిలికిచిలికి గాలివానగా మారుతుంది. అందుకు సంబంధించిన వివరాలు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మలిశెట్టిగూడా రెవెన్యూ పరిధిలోని 4సర్వే నంబర్‌లో సుమారు 233 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూమి కైసరుద్దీన్‌ఖాన్‌ అనే పట్టేదారునిది. ఇతను 1954 నుంచి 2016 వరకు రికార్డుల్లో వస్తున్నారు. అంతే కాదు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఖాతానంబర్‌ కలిగి ఉన్నారు. భూ యజమాని మరణానంతరం ఆయన కుమారుడు రహుఫుద్దిన్‌ ఖాన్‌ 1999లో భూ పట్టా మార్పిడి చేసుకుని హక్కుల పొందాడు. ఈయనకు పాత ఖాతా నెంబర్‌ 2069, పాత పాస్‌బుక్‌ నంబర్‌ 379580తో భూమి హక్కులు లభించాయి. ఈ భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించాడు. జి సైదయ్యకు 3ఎకరాల 25 గుంటలు, డాక్యుమెంట్‌ నెంబర్‌ 2384/ 2008, గలి వేణుగోపాల్‌కు 3.ఎకరాల 25 గుంటలు, అందుకు డాక్యుమెంట్‌ నెంబర్‌ 2383/2008 కొనుగోలు చేశారు. కాగా ఈ భూమిపై కోర్టులో కేసు కూడా నడిచినట్లు ఇరు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ భూమి తమదని గ్రామస్తులు కేసులు వేస్తే 2008లో పట్టాదారు కైసరుద్ధిన్‌ఖాన్‌కు చెందినదిగా తేలిందని పేర్కొంటున్నారు. అటు తరువాతనే భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. కాగా ఈ భూమిని కొనుగోలు చేసిన సదరు వ్యక్తులు తమ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ద్వారా పాసుబుక్కులు పొందేందుకు ఆన్లైన్లోనూ పలుసార్లు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇదే భూమికి తమ గ్రామానికి చెందిన వారికి చెందినదని గ్రామస్తులు అడ్డుపడుతున్నారు. ఈ భూమిపైన మరొకరికి ఎలాంటి హక్కులు లేవని, సర్వ హక్కులు గ్రామస్తులకే చెందాలంటున్నారు. భూమి మీదకు రాకుండా అడ్డుపడుతున్న గ్రామస్తులపై ఇబ్రహీంపట్నం పోలీసులకు కొనుగోలుదారులైన వేణుగోపాల్‌, సైదయ్య ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. పట్టాదారుల ద్వారా అన్ని రకాలుగా రికార్డులు పరిశీలించిన తరువాతనే భూములు కొనుగోలు చేశామని కొనుగోలుదారలంటున్నారు. అంతే కాకుండా తమ పట్టా భూమిలో ఆలయ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పట్టాదారు వారసులు రహుపుద్దిన్‌ఖాన్‌, భూమి కొనుగోలుదారులు సైదయ్య, వేణుగోపాల్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ భూమి తనదంటున్న గ్రామస్తులు..
మరోవైపు సంవత్సరాల తరబడి ఈ భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని పశువులు, మేకల మేపుటం కోసం వాడుకుంటున్నామని గ్రామస్తులంటున్నారు. అంతేకాకుండా శ్మశాన వాటికలు కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకున్నామంటున్నారు. గత 40 సంవత్సరాల క్రితమే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు రైతులు పేర్కొంటున్నారు. కొంతమంది కావాలని పట్టా పాస్‌ బుక్కులు సృష్టించి భూమిని కాజేసే ప్రయత్నం చేస్తే 2009లో వాళ్ల ఓఆర్సీని రద్దు చేయించినట్లు పేర్కొంటున్నారు. దాంతో బసవనన్నగుట్ట వద్ద ఇరువర్గాల ఆదిపత్య పోరుతో రగులుతోంది. ఇటు రెవెన్యూ అధికారులు, అటు పోలీసులు ఈ భూమి ఎవరిదన్నది తేల్చకపోతే ఇరువర్గాల మధ్య తీవ్ర గర్జన చోటుచేసుకునే పరిస్థితి లేకపోలేదు. అందులో భాగంగానే మంగళవారం సదరు భూమి కొనుగోలుదారులు భూమిపైకి వచ్చే క్రమంలో తమ రికార్డులను మీడియా ముందు ప్రదర్శించారు. కొంతమంది తమపై ఓఆర్సీని సవాల్‌చేస్తూ ఆర్డీఓలో ఫిర్యాదు చేస్తే 2009 ముస్లిం వారసులుగా చెప్పుకుంటున్న వ్యక్తుల ఓఆర్సీని రద్దు చేసినట్లు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌ నాయకుడు పండాల శంకర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో భూ యజమానులను అడ్డుకున్నారు.

Spread the love