1946 నుండి 1951 వరకు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని నోముల గ్రామానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. రజాకార్ల దాడులలో గ్రామానికి చెందిన ఎంతోమంది వీరోచితంగా పోరాడి అసువులు బాసిన చరిత్ర గ్రామానిది. పొట్టలోని పేగులు చీలిపోయిన పైపంచ బిగించి పోరాడిన పాపయ్య, శరీరం నుండి మాంసాన్ని ముక్కలుగా కోసిన ఇన్ఫర్మేషన్ చెప్పని ఎల్ల స్వామి నేటి యువతకు ఆదర్శం. ఈ గ్రామానికి పురాతన చరిత్రతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో గ్రామానికి ఉన్న చరిత్రపై విశేషాలు.
1947 నవంబర్ 15న నోముల గ్రామంలో లెవీ ధాన్యాన్ని పోలీసులు, రజాకార్లు బలవంతంగా తీసుకెళ్తుండగా 400 మంది వారిపై దాడి చేశారు. ఆ దారికి తట్టుకోలేని పోలీసులు కాల్పులు జరిపారు. ఇలాంటి తరుణంలో గ్రామంలోని కందికంటి వెంకటనర్సయ్య ఇంటిలో కమ్యూనిష్టులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నాయకత్వం వహించిన వారిని జమీందార్లు తీవ్రంగా కొట్టడంతో నిరసనగా నకిరేకల్‌కు చెందిన పన్నాల రాంరెడ్డి నాయకత్వంలో నోముల గ్రామంలో 200 మందితో ప్రదర్శన నిర్వహించి గ్రామ నడిబొడ్డున ఎర్రజెండాలను ప్రతిష్టించారు. దీనితో గ్రామంలో సాయుధ పోరాటం ఊపందుకుంది. 1947 సెప్టెంబర్ 9న కేతపల్లి మండలం గుడివాడ గ్రామంలో రజాకార్లు పోలీసులు నిర్బంధంగా రైతుల నుండి నిధి వసూలు చేశారు. నోముల గ్రామానికి చెందిన పన్నాల పాపిరెడ్డి, వలస పుల్లయ్య, ముసుకు శివారెడ్డి విషయం తెలుసుకొని నోముల, కడపర్తి గ్రామాలకు చెందిన 400 మంది కర్రలు, ఒడిసెలలు చేత బూని కమ్యూనిస్టు పార్టీకి జై, సంఘంకి జై అనే నినాదాలు మార్మోగిస్తూ వాళ్ల వెంటపడ్డారు. దీంతో రజాకారులు పోలీసులు ప్రాణ భయంతో పారిపోతుండగా వారిని వెంబడించడం వల్ల ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ప్రజలను చెల్లాచెదురు చేసి ఉన్మాదంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నోముల గ్రామానికి చెందిన పన్నాల పాపయ్య పొట్టలోని ప్రేగులు చీలిపోయిన పైపంచను పొట్టకు బిగించి ధైర్యంగా వెనుదిరగకుండా దాడి చేసి అక్కడే మతి చెందాడు. 50 సంవత్సరాల వయసుగల కడారి సోమయ్య, మచ్చ వీరమల్లు యువకులైన వెంకయ్య, వీరయ్య తమ ప్రాణాలను కోల్పోయారు. ఇంకా అనేకమంది గాయపడగా వారిలో మరో ఇద్దరు గోళ్ళ గోపయ్య, చెడిపల్లి సోమయ్య మతి చెందారు. మతి చెందిన వారిని, గాయపడ్డ వారిని తమతో తీసుకుపోయారు.

శరీరం నుండి మాంసాన్ని ముక్కలుగా కోసినా..
నోముల గ్రామంలో వ్యవసాయ కార్మిక కుటుంబానికి చెందిన రాచకొండ ఎల్లస్వామి నమ్మకమైన కొరియర్. కేంద్ర ఆర్గనైజర్. మానుకోట ప్రాంతంతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఆయనను పట్టుకున్నారు. లెక్క లేనంతగా చిత్రహింసలకు గురి చేశారు. ఆయన శరీరం నుండి మాంసం ముక్కలు ముక్కలుగా కోశారు. శరీరంలోకి ఇనుప మేకులు దిగ్గొట్టారు. ఎర్రగా కాల్చిన ఇనుపకడ్డితో వాతలు పెట్టారు. అయినా రహస్యాలు చెప్పటానికి ఆయన నిరాకరించాడు. చివరకు సోలిపేట గుట్టల్లో కాల్చి చంపారు.
చెరువు అన్నారం పొలాలలో కాల్చి …
కేతేపల్లి మండలం కాసనగూడు గ్రామానికి చెందిన పసునూరు వెంకటరెడ్డి 1947లో కళాశాల బహిష్కరణ ఉద్యమ సందర్భంగా చదువుకు స్వస్తి చెప్పి ప్రజా పోరాటంలో చేరాడు. ఆయనంటే భూస్వాములకు ప్రజాశత్రువులకు సింహ స్వప్నం. ఆయనను అంతమొందించాలని చూస్తున్న తరుణంలో 1948 ఏప్రిల్ 12న వెంకట్‌రెడ్డితో పాటు దళం చెరువు అన్నారం గ్రామంలో ఉన్నదన్న విషయం తెలుసుకున్న రజాకారులు, పోలీసులు గుర్రాలతో పెద్ద ఎత్తున గ్రామాన్ని చుట్టుముట్టారు. ఆ సమయంలో దళ సభ్యులు తప్పించుకోగా దళనాయకుడు పసునూరి వెంకట్‌రెడ్డితో పాటు నోముల గ్రామానికి చెందిన మరో విద్యార్థి నాయకుడు ముసుకు వెంకట్‌రెడ్డిని పట్టుకొని కాల్చి చంపారు. నేటికీ ఆ గ్రామ పొలాలలో వారి స్మారక స్తూపాలు ఉన్నాయి.

గ్రామానికి చెందిన మరెందరో…
నోముల గ్రామానికి చెందిన టేకుల నారాయణ, కర్రి బుచ్చయ్య కొరియర్లుగా, రొక్కం లింగారెడ్డి, చాకలి ఇద్దయ్య, పూసల లింగయ్య, గుడిసెకింది కాశయ్య, యల్మకంటి రాజయ్య, ముస్కు సత్తిరెడ్డి, దార నర్సింహ్మ, తెలగ వెంకటయ్య, మాచర్ల బక్కయ్య, దళ సభ్యులుగా పని చేశారు. గంజి గోపయ్య, కమ్మరి రాములు, వెంకయ్య గ్రామ పెద్దలుగా ఉన్నారు. గడగోజు నర్సింహ్మచారి బాల సంఘం నాయకునిగా పని చేశారు. వారిలో కొందరు ఏడాది పాటు జైలుశిక్ష అనుభవించారు. మరి కొంతమందికి ఉరిశిక్ష పడింది. అంతర్జాతీయంగా కమ్యూనిస్టు పార్టీలు, ట్రేడ్ యూనియన్లు జరిపిన ఆందోళన ఫలితంగా ఉరిశిక్షలు రద్దయ్యాయి.
పురాతన చరిత్ర
ప్రముఖ శాసన పరిశోధకులు బి.ఎన్. శాస్త్రి, డాక్టర్ డి. సూర్యకుమార్, పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకులు రామోజు హరగోపాల్ వేర్వేరు కాలాలలో నోముల గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఉన్న రాకాసి గుళ్ళు, పురాతన శివాలయం, నరసింహ స్వామి ఆలయాలను సందర్శించి అక్కడ ఉన్న విగ్రహాలు, శిల్పాలను పరిశీలించి కాల నిర్ణయం చేశారు. నోముల నుండి గుడివాడ గ్రామానికి వెళ్లే దారిలో కాశి వారి గూడెం సమీపంలో బహత్ శిలాయుగం నాటికి చెందిన రాకాసి గుళ్ళు కనిపిస్తాయి. లభించిన ఆధారాల ప్రకారం వీటి చరిత్ర క్రీస్తుపూర్వం సుమారు 3000 సంవత్సరాల నాటిదని చెప్పవచ్చు. దీనిపై తదుపరి పరిశోధనలు జరగాల్సి ఉంది. నవీన శిలా యుగం నాటి రాతి పనిముట్లు కూడా ఇక్కడ లభించాయి.
కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల నాటి శిల్పాలు లభ్యం
గ్రామంలో కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల నాటి శిల్పాలు లభించాయి. లక్ష్మీనరసింహస్వామి ఆలయం పరిసరాలలో ఓ రాతిపై అక్షరాలన్ని నశించి పోగా న, ర, మ అక్షరాలు మాత్రమే కనబడ్డాయి. ఆ అక్షరాల శైలిని బట్టి అవి వెలమరాజుల కాలం నాటివని చెప్పవచ్చు. ఈ కాలంలో వైష్ణవ మతం ఎక్కువగా అభివద్ధిలో ఉంది. 2021లో ఆలయం ముందు పేరుకుపోయిన మట్టిని తొలగించగా 16 స్తంభాలు గల రంగమండప పునాదులు బయల్పడ్డాయి. ఆలయంలోని నర్సింహాస్వామి. త్రిమూర్తి, భైరవ, భిన్నమైన సూర్యుని శిల్పాల శైలిని బట్టి ఈ ఆలయాన్ని కాకతీయులు క్రీశ. 13వ శతాబ్దిలో నిర్మించినట్లు తెలుస్తుంది. నర్సింహ్మస్వామి ఆలయం కాకతీయుల కాలం నాటి కంటే ముందుందనే అభిప్రాయం ఉంది.
కాకతీయుల తర్వాత పాలించిన రాచకొండ పద్మనాయక వెలమ దొరల కాలం నాటి నుండి గ్రామాన్ని అభివద్ధి చేశారు. ప్రస్తుతం యోగకోదండ రామాలయం ప్రక్కనున్న పెద్ద పెద్ద బండలు ఆ కాలం నాటివే.
10 శతాబ్దం నాటి దుర్గాదేవి విగ్రహం
శివాలయం ఎదురుగా ఉన్న రంగమండపశాల బహుశా క్రీ.శ. 10 లేదా 11 శతాబ్ధాల నాటిదని తెలుస్తుంది. క్రీస్తు శకం 10వ శతాబ్దం నాటి మహిషామర్ధిని విగ్రహం బయట పడింది. 8 చేతుల అమ్మ వారు ఎడమ కాలితో మహిషా తొక్కి పట్టి ఎడమ చేతితో కొమ్మును పట్టుకొని, కుడి చేతి లోని ఆయుధంతో రాక్షసున్ని సంహరిస్తున్నట్టు ఉన్నది. అన్ని ఆభరణాలు, ఆయుధాలు, పొడవాటి కిరీటాన్ని ధరించిన ఈ విగ్రహం కళ్యాణి చాళుక్యల కాలం నాటిదని చరిత్రకారులు భావిస్తున్నారు. శివాలయం ఆవరణలో క్రీస్తు శకం 10వ శతాబ్దం నాటికి చెందిన శిల్పాలు కళ్యాణి చాళుక్యుల శిల్ప శైలిలో ఉన్నాయి. శైవ మత గురువు ధరించే తలపాగాతో పాటు చెవులకు వేలాడే జుంకాలు, మెడలో పెద్ద రుద్రాక్షల పూసల దండ, దండ రెట్టలకు కట్టిన రుద్రాక్షలు, వ్యాఖ్యాన ముద్రలో పెద్ద మీసాలతో విగ్రహం ఉంది. శివాలయంలో ఉన్న నంది విగ్రహం, ఆంజనేయస్వామి ఆలయం ముందున్న వినాయకుని విగ్రహాలు కూడా కళ్యాణి చాళుక్యుల కాలం నాటివే.
- యరకల శాంతి కుమార్, 9849042083