Sunday, September 14, 2025
E-PAPER
Homeసోపతిఅమ్మ.. ఆకాశం..

అమ్మ.. ఆకాశం..

- Advertisement -

తన ప్రాణం పోతుందని తెలిసినా మరో ప్రాణికి జన్మనిస్తే చాలు అనుకొని మత్యువుతో పోరాడి మరో జీవికి ప్రాణం పోస్తుంది అమ్మ. అందుకే అమ్మ భరించే పురిటి నొప్పుల్ని సముద్రాన్ని దాటడంతో పోల్చారు పూర్వ కాలపు కవులు. సష్టిలోని అన్ని బంధాలలో పేగు బంధం వెల లేనిది.

తల్లి ప్రేమను ఎంతోమంది ఎన్నో రకాలుగా కావ్యాలలో గొప్పగా వర్ణించినా, అది చంద్రుడి ముందు నూలుపోగుతో సమానమే. అమ్మ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం… ఇంకా ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. నవమాసాలు పూర్తయ్యే వరకు రాబోయే శిశువు కోసం వెయ్యి కళ్ళతో నిరీక్షిస్తుంది. చివరికి తన పొత్తిళ్ళలో పసిగుడ్డును చూసి ప్రసవ వేదనను మరిచిపోతుంది. ఈ మధ్య కాలంలోనే మధ్య ప్రదేశ్‌లో తల్లి బిడ్డ అడవి గుండా వెళుతున్నప్పుడు చిరుత పులి పసిబిడ్డపై దాడిచేసి లాక్కెళితే దాన్ని తరిమి బిడ్డను కాపాడుకున్న తల్లి గూర్చి చదివాం. ఈ సందర్భంగా అమ్మ ఋణం తీర్చుకోవాలని ఊబలాటపడిన ఓ వ్యక్తి కథను చదవండి.

‘వీరబల్లుడు’ అనే ఓ మధ్య వయస్కుడు ఓ రోజు తన తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నన్ను కన్నందుకు నీ ఋణం తీర్చుకోవాలని వుంది. ఇదిగో నేను సంపాదించిన ఈ కోటి బంగారు నాణాలను నీకు ఇస్తున్నాను. ఇవి తీసుకొని నీకు నచ్చినట్లు ఉపయోగించుకో. దీంతో నీ ఋణం నుంచి నాకు విముక్తి లభిస్తుంది అంటాడు. ఆ మాటలు విన్న తల్లి ఒక నవ్వు నవ్వి ఊరుకుంటుంది. అదేమిటని పదేపదే అడగటంతో తల్లి ఇలా అంటుంది. కన్నా నా ఋణం తీర్చుకోవాలి అనుకుంటే నాకు ఈ బంగారు నాణేలు అక్కర్లేదురా. ఒక్క పని చెరు ఈ ఒక్కరోజు నాకు పసిబిడ్డగా మారి నా పక్కనే పడుకో అదే చాలు అని చెబుతుంది. ఆ మాటలు వినగానే కొడుకు ఆనందంతో ఆ రోజు తన తల్లి పక్కనే పడుకుంటాడు. కొంతసేపటికి అతను మంచి నిద్రలో వుండగా లేపి నాయనా చాలా దాహంగా వుందిరా కొంచెం నీళ్ళు తెచ్చి ఇస్తావా అని అడుగుతుంది.

వెంటనే లేచి నీళ్ళు అందిస్తాడు. నీళ్ళు తాగిన తర్వాత చేతిలో నుండి గ్లాసు జారిపోయి పక్క అంత తడిసిపోతుంది. అప్పుడు వెంటనే కొడుకు ఎంటమ్మ ఇది? అని అనగానే పొరపాటున చేయిజారి పోయింది కన్నా అని సమాధానం చెప్తుంది. సరేననుకొని కొడుకు మౌనంగా పడుకుంటాడు. ఇలా కొద్ది సేపటి తర్వాత అతనికి కాస్త నిద్రపడుతుంది. అతన్ని తల్లి మళ్ళీ నిద్రలేపి నాయనా చాలా దాహంగా వుందిరా కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడుగుతుంది. అప్పుడు కొడుకు ఇప్పుడే కదమ్మ నీళ్ళు తాగావు? అప్పుడే నీకు దాహం వేస్తుందా? అని చిరాకుపడుతూ నీళ్ళు ఇస్తాడు. యదావిధిగా రెండు గుక్కలు నీళ్ళు తాగి మిగిలిన వాటిని పక్క మీద ఒలక పోస్తుంది. అది చూడగానే కొడుకు కోపంతో అమ్మ ఏంటిది పక్క అంతా తడిపావు కళ్ళు కనబడటం లేదా ? అని అంటాడు. చీకటిగా వుంది కదా నాయనా గ్లాసు చేతిలోంచి జారిపోయింది అని చెబుతుంది. ఆ మాటలు విన్న తరువాత కోపాన్ని తమాయించుకొని మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు. కొంతసేపటికి తల్లి కొడుకును నిద్రలేపి కన్నా చాలా దాహంగా వుందిరా కొంచెం నీళ్ళు తెస్తావా? అని అడగడంతోనే కోపంతో దాహం దాహం అని నా ప్రాణాలు తోడేస్తున్నావ్‌. నన్ను అసలు నిద్ర పోనిస్తావా లేదా? అని కోపంగా వెళ్ళి ఇదిగో నీళ్ళు తాగిచావు అని అంటాడు. ఎప్పటిలాగే ఒక చుక్క నీళ్ళు తాగి పక్క మీద ఒలకబోస్తుంది. అది చూసిన కొడుకు ఇక సహించలేక నీకసలు బుద్దుందా లేదా? నన్ను ఇలా వేధించడానికే నీ పక్కన పడుకోమన్నావా? ఈ తడిసిన మంచం మీద ఎలా పడుకోవాలి? చూడబోతే నీకు పిచ్చి పట్టినట్లు వుంది. ఎందుకు ఇలా చేస్తున్నావ్‌ అంటూ కోపంగా ఊగిపోతాడు.

అప్పుడు అతని తల్లి నాయనా… నా ఋణం తీర్చుకుంటాను అన్నావే? నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తి నిరంతరం సేవ చేసినా కూడా తల్లి ఋణం నుండి విముక్తుడివి కాలేవు. ఎందుకంటావా పసిబిడ్డగా వున్నప్పుడు ప్రతిరోజు పక్క మీదే మల, మూత్రాలు విసర్జించే వాడివి. నీ తడిసిపోయిన బట్టలు విప్పి నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని. నువ్వు పక్క తడిపిన వైపు నేను పడుకొని, పొడిగా వున్న వైపు నిన్ను పడుకోబెట్టి నేను నిద్రపోయే దాన్ని. ఇలా ఒకరోజు కాదు ఒకవారం కాదు, కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజు అలాగే ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు రెండుసార్లు నీ పక్కను నీళ్ళతో తడిపినందుకే విసుక్కుంటున్నావే? ఒక్క రాత్రి నిద్ర లేనందుకే వీరంగం వేస్తున్నవే? బిడ్డలను కనిపెంచే క్రమంలో తల్లిపడే శ్రమకు ఆమె చేసే సేవలకు, ఆమె త్యాగాలకు, కష్టాలకు, సహనానికి ఋణం తీర్చుకోవడమన్నది సాధ్యమయ్యే పని కాదు అనగానే కొడుకు నా అజ్ఞానానికి క్షమించమ్మ అంటూ తల్లి పాదాలను పట్టుకొని ఏడుస్తాడు.
ఇక్కడ మా అమ్మ ‘సకినాబి’ ప్రస్తుతం 78 సం.రాలు గురించి తప్పకుండా ప్రస్తావించాలి. ఆమెకి నాల్గవ కాన్పులో నేను, చెల్లి కవల పిల్లలుగా పుట్టాం. నా కన్న ముందు మూడు కాన్పులలో మగపిల్లలు. నాల్గవ సంతానంగా నేను నా చెల్లి. అప్పట్లో ఊరిలో, పరిసర గ్రామాలలో పిల్లలు లేనివారు ఆడపిల్లను ఉంచుకొని నా కన్నా ముందు ముగ్గురు మగపిల్లలు ఉండడం వల్ల నన్ను దత్తత ఇవ్వమని ప్రతిరోజు వచ్చి అమ్మను నాన్నను వేడుకునేవారట. కానీ ఆ సమయంలో మా అమ్మమ్మ వాళ్ళ తాకిడి భరించలేక ఇంటి ముందు కుక్కను కట్టేసి వుంచేదట. అలా మా అమ్మ నాన్నకు దత్తత ఇవ్వాలన్న కోరిక లేకపోవడం వల్ల నేను మా అమ్మ ఒడి నుండి దూరం కాలేకపోయాను. మరో సంఘటన. బాల్యంలో నన్ను చెల్లిని సాగర్‌ ఎడమ కాలువకు వున్న లింక్‌ కెనాల్‌ (పిల్లకాలువ) దగ్గరికి మురికి బట్టలు ఉతుక్కొని రావడానికి మమ్మల్ని కూడా తీసుకొని వెళ్లిందట. మా ఇద్దరిని గట్టుపై కూర్చోబెట్టి తను బట్టలు ఉతికే పనిలో వుండగా నేను ఆడుకుంటూ వచ్చి కాలువలో పడి కొట్టుకొనిపోతుండగా అమ్మకు చెల్లి నన్ను చూయించిందట. అమ్మ నీటిలోకి ఈదుకుంటూ వెళ్ళి కాపాడిందట. నాన్న చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి ఐనా నాన్నతో పాటు సమానంగా ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేసి మమ్మల్ని పెంచిన విధానం ఊరందరికీ ఆదర్శం అమ్మ. ఇప్పుడు నేను ఉన్న స్థితిని చూసి (సహాయ ఆచార్యుల స్థానంలో) అమ్మ సందర్భం వచ్చిన ప్రతిసారి బాల్యంలో జరిగిన సంఘటనలు గుర్తు చేస్తుంది.

మీ కెరీర్‌ కోసం సర్వం ఒడ్డి, మిమ్మల్ని తీరానికి చేరుస్తారు తల్లిదండ్రులు. మీ ప్రతి కదలికలో వారి త్యాగం వుంటుంది.
నిన్ను నిన్నుగా నిలబెట్టి, నీతో బుడి బుడి అడుగులు వేయించి, లాలి పాటలు, జోల పాటలు, చందమామ కబుర్లు ఎన్నో చెప్పిన తొలి గురువు అమ్మ. ప్రపంచంలో అన్ని ప్రేమలు కల్మషమైనా అమ్మ ప్రేమ అమలినమైనది. ఎన్ని కావ్యాలు వ్రాసినా ఎన్ని పుటలు వ్రాసినా ఒడువదు తరగదు. ఇంట్లో తిరిగే ప్రత్యక్ష దైవం అమ్మ. అందుకే మాతదేవోభవ అన్నారు మన పూర్వీకులు. కాబట్టి వీరబల్లుడి మాదిరిగా కాకుండా మనుషులుగా మసలుకుందాం. అమ్మంటే ఆకాశం. పిల్లలు తారాజువ్వలు. ఆకాశం లేకుండా తారాజువ్వలు ఉంటాయా ఆలోచించండి? చీకటి పడగానే తల్లి కోడి నక్షత్రాల సమూహం చూడండి. మీ కుటుంబం గుర్తుకు రావడం లేదా? అమ్మ ఓ రంగురంగుల ముగింపు లేని క్యాన్వాసు అందులో మీరు ఏమీ గీసినా, ఏమి రాసినా అద్బుత కావ్యమే. మదర్స్‌ డే మే నెలలోనే కానుకలు, బహుమతులు ఇచ్చి ఆ తర్వాత మర్చిపోకుండా జీవితాంతం అమ్మను ప్రేమిద్దాం.

  • డా||మహ్మద్‌ హసన్‌,
    9908059234
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -