10మీ ఎయిర్ పిస్టల్‌లో గోల్డ్ మెడల్
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ 2025
నింగ్బో (చైనా) : భారత స్టార్ షూటర్, ఒలింపియన్ ఇషా సింగ్ పసిడి గురి కుదిరింది. చైనాలోని నింగ్బోలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ ఆఖరు అంచె పోటీల్లో ఎట్టకేలకు భారత్ పతక ఖాతా తెరిచింది. శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో వరల్డ్ చాంపియన్ ఇషా సింగ్ బంగారు పతకం సాధించింది. ప్రపంచకప్‌లో వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్‌కు ఇదే తొలి గోల్డ్ మెడల్. ఇషా సింగ్‌తో పాటు మరో భారత షూటర్ రిథమ్ సంగ్వాన్ సైతం ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఆరంభంలో సంగ్వాన్ మెరిసినా.. ఆ తర్వాత ఏకాగ్రత కోల్పోయి వెనుకంజ వేసింది. ఓవరాల్‌గా సంగ్వాన్ ఐదో స్థానంలో నిలిచింది. పారిస్ ఒలింపిక్ చాంపియన్ యెజిన్ (దక్షిణ కొరియా) సైతం బరిలో నిలిచినా.. ఇషా సింగ్ అదరగొట్టింది. 242.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం సొంతం చేసుకుంది. చైనా షూటర్ 242.5 పాయింట్లతో రజత పతకం సాధించగా, యెజిన్ 220.7 పాయింట్లతో కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. అంతకుముందు జరిగిన అర్హత రౌండ్‌లో ఇషా సింగ్ పదో స్థానంలో నిలిచింది. 578 పాయింట్లతో ఇషా సింగ్ పదో స్థానంలో నిలిచింది. అర్హత రౌండ్‌లో టాప్-8లో నిలిచిన షూటర్లే ఫైనల్స్‌కు చేరుకుంటారు. భారత షూటర్ పాలక్ (586), చైనా షూటర్ చెన్ యిల్లింగ్ (582)లు వరుసగా 1, 5వ స్థానాల్లో నిలిచినా.. ఈ ఇద్దరు షూటర్లు కేవలం ర్యాంకింగ్ పాయింట్ల కోసమే పోటీపడ్డారు. దీంతో ఇషా సింగ్ తుది పోరుకు అర్హత సాధించింది. అర్హత రౌండ్‌లో సంగ్వాన్ 578 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
‘ప్రపంచకప్‌లో నా తొలి ఈవెంట్‌లోనే పసిడి పతకం సాధించటం సంతోషంగా ఉంది. నా లక్ష్యాల్లో ఒకటి సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నింగ్బోలో భారత్‌కు మెడల్స్ రాలేదని తెలుసు. బరిలో ఎంతో మంది మేటీ షూటర్లు ఉన్నారు. వీళ్లతో కలిసి ఎన్నోసార్లు ఫైనల్లో పోటీపడిన అనుభవం కలిసొచ్చింది. ఈ ఏడాది కైరో ప్రపంచ చాంపియన్‌షిప్స్ కోసం కఠోరంగా సాధన చేస్తూ సిద్ధమవుతున్నాను’
- ఇషా సింగ్