మయన్మార్ జాతి మైనారిటరీ సాయుధ బృందం వెల్లడి
నేపిడా: పశ్చిమ రఖినే రాష్ట్రంలో జుంటా వైమానిక దాడిలో చిన్నారులతో సహా 19 మంది మృతి చెందినట్టు శనివారం మయన్మార్ జాతి మైనారిటీ సాయుధ బందం తెలిపింది. గత ఏడాది కాలంలో రఖినేలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్న అరకాన్ ఆర్మీ (ఎఎ) మయన్మార్ పాలక సైన్యంతో భీకర పోరాటం చేస్తోంది. క్యుక్తావ్ టౌన్‌షిప్‌లోని రెండు ప్రయివేటు ఉన్నత పాఠశాలలపై శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన దాడిలో 15- 21 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులు మతి చెందారు. 22మంది గాయాలపాలయ్యారని అరకాన్ ఆర్మీ టెలిగ్రామ్ పోస్టులో తెలి పింది. ఈ ఘటనపై ఎఎ విచారం వ్యక్తం చేసింది. అయితే ఈ ఘటనపై ఎఎకి చెందిన సభ్యులెవరూ మీడియాకు వెల్లడించలేదు. జుంటా యుద్ధ విమానం ఒక ఉన్నత విద్యా పాఠశాలపై 500 పౌడ్ల బాంబులను విసిరింది. ఆ సమయంలో పాఠశాలలోని విద్యార్థులు నిద్రిస్తున్నారని లోకల్ మీడియా అవుట్‌లెట్ మయన్మార్ తెలిపింది. కాగా, ఈ బాంబు దాడిని యునిసెఫ్ తీవ్రంగా ఖండించింది. రఖినే రాష్ట్రంలో పెరుగుతున్న వినాశకరమైన హింసకు పిల్లలు, కుటుంబాలు భారీ మూల్యం చెల్లిస్తున్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది. క్యౌక్తావ్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇంటర్నెట్, ఫోన్ సేవలు అస్తవ్యస్తంగా ఉండడంతో మీడియా అక్కడికి చేరుకోలేకపోయింది. మయన్మార్‌ని సైన్యమే పరిపాలిస్తోంది. దీంతో సైన్యం పాలనను ప్రజలు వ్యతిరేకించడంతో.. పౌర సమాజాలను దెబ్బ తీసేందుకు ఫిరంగి దాడులకు పాల్పడుతుందని మిలటరీపై ఆరోపణలున్నాయి.